Car insurance : మీ కారుకు ఈ మాడిఫికేషన్స్ చేయిస్తున్నారా? వారంటీ, ఇన్సూరెన్స్ పూర్తిగా గోవిందా!
కొత్త కారు కొనగాని, దాన్ని మరింత అందంగా, స్టైలిష్‌గా మార్చుకోవడానికి ఆఫ్టర్‌మార్కెట్ యాక్సెసరీలు వేయించడం సాధారణమే. కానీ కొన్ని రకాల మాడిఫికేషన్ల వల్ల కారు వారంటీతో పాటు క్లెయిమ్ సమయంలో ఇన్సూరెన్స్ కూడా రద్దవుతుందని మీకు తెలుసా? ఆ వివరాలు ఇక్కడ చూడండి..
కొత్తగా కారు డెలివరీ తీసుకోగానే చాలామంది చేసే మొదటి పని.. తమకు నచ్చిన యాక్సెసరీలు ఫిట్ చేసుకోవడం, నచ్చినట్లు మాడిఫై చేసుకోవడం! కారు చూడటానికి డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుందనే ఉద్దేశంతో మార్కెట్లో దొరికే రకరకాల ఆఫ్టర్‌మార్కెట్ విడిభాగాలను అమర్చుతుంటారు. అయితే ఇలా కారును మనకు నచ్చినట్లు మార్చే క్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. మనం చేసే కొన్ని రకాల మాడిఫికేషన్ల వల్ల కారు తయారీ కంపెనీలు ఇచ్చే వారంటీ రద్దవుతుంది. అంతేకాకుండా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను కూడా కంపెనీలు తిరస్కరించే అవకాశం ఉంది!

అయితే, ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా ఒక భాగాన్ని మార్చినప్పుడు కారు మొత్తానికి వారంటీ రద్దు కాదు. మీరు చేసిన మార్పు వల్ల ఏ భాగం లేదా సిస్టమ్ ప్రభావితమైందో, దానికి సంబంధించిన వారంటీని మాత్రమే కంపెనీలు నిలిపివేస్తాయి. కారులోని మిగిలిన భాగాలకు వారంటీ వర్తిస్తుంది. కాబట్టి మీ కారుకు యాక్సెసరీలు వేయించే ముందు వారంటీని రద్దు చేసే ఆ మాడిఫికేషన్లు ఏంటో తప్పక తెలుసుకోండి.
1. మెకానికల్, పర్ఫార్మెన్స్ మార్పులు..
కారు పవర్, స్పీడ్ పెంచేందుకు చేసే పర్ఫార్మెన్స్ మాడిఫికేషన్లు చూడటానికి థ్రిల్లింగ్‌గా అనిపించినా.. కారు తయారీ కంపెనీలకు ఇవి తీవ్రమైన రెడ్ సిగ్నల్స్! ఇంజిన్ పవర్ పెంచడానికి టర్బోఛార్జర్, సూపర్‌ఛార్జర్, ఎయిర్ ఇంటేక్స్ అమర్చడం, ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను మార్చడం లేదా బయట థర్డ్ పార్టీ సీఎన్జీ కిట్లను బిగించడం వంటి పనుల వల్ల ఇంజిన్ వారంటీ పూర్తిగా రద్దవుతుంది. అలాగే కారు గ్రౌండ్ క్లియరెన్స్ పెంచినా, తగ్గించినా లేదా సస్పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేసినా వారంటీ వర్తించదు.
2. ఇంటీరియర్ యాక్సెసరీలు..
కారు లోపలి భాగాన్ని మార్చే విషయంలోనూ కంపెనీలు చాలా కఠినంగా ఉంటాయి. సీట్ల ఒరిజినల్ కవర్లను కట్ చేసి లేదా కుట్లు విప్పి తొడిగే కస్టమ్ సీట్ కవర్ల వల్ల ఎయిర్‌బ్యాగ్ ఫంక్షనింగ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, పెడల్స్ మార్చడం, ముఖ్యంగా డ్యాష్ బోర్డ్‌ను కట్ చేసి ఆఫ్టర్‌మార్కెట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేదా యాంబియంట్ లైటింగ్ బిగించడం వంటివి వారంటీ నిబంధనలకు విరుద్ధం. కంపెనీలు అందించే డ్రిల్లింగ్, కటింగ్ అవసరం లేని అఫీషియల్ సీట్ కవర్లు, మ్యాట్లను వాడటం శ్రేయస్కరం.
3. ఎక్స్‌టీరియర్ బాడీ మార్పులు..
కారు బాడీకి డ్రిల్లింగ్ (రంధ్రాలు చేయడం) చేయడం లేదా వెల్డింగ్ చేసి అమర్చే ఏ భాగానికైనా కంపెనీలు వారంటీని నిరాకరిస్తాయి. బయట మార్కెట్లో దొరికే బాడీకిట్లు, స్పాయిలర్లు, కస్టమ్ బంపర్లు, వీల్ ఆర్చ్‌లు, సన్‌రూఫ్, విండో టింట్లు (కార్ల అద్దాలకు నల్లటి ఫిల్మ్) వంటివి ఈ జాబితాలోకి వస్తాయి. కారు అసలు రంగును మార్చడం, పైన రూఫ్ రాక్స్ బిగించడం వల్ల కూడా వారంటీ సమస్యలు వస్తాయి. అందుకే కారును అందంగా మార్చాలనుకుంటే కంపెనీ అందించే అధికారిక 'ఓఈఎం యాక్సెసరీల'నే ఎంచుకోవడం సురక్షితం.
4. ఎలక్ట్రికల్ అండ్ వైరింగ్ కటింగ్..
కారు వైరింగ్ సిస్టమ్‌తో ఆడుకోవడం అత్యంత ప్రమాదకరం. కారు ఈసీయూని మార్చడం, హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, డాష్ కెమెరా లేదా పార్కింగ్ కెమెరాల కోసం ఒరిజినల్ వైర్లను కట్ చేయడం వంటివి చేస్తే ఎలక్ట్రికల్ వారంటీ తక్షణమే రద్దవుతుంది. కార్లలో ఫ్యూజ్ బాక్స్ నుంచి నేరుగా పవర్ తీసుకునే హై-పవర్ సౌండ్ సిస్టమ్‌లు బిగించడం వల్ల కార్లలో షార్ట్ సర్క్యూట్ జరిగి నిప్పంటుకునే ప్రమాదం ఉంది. కేవలం ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో కాకుండా, వైర్లు కట్ చేసి బిగించే ఏ పరికరానికైనా కంపెనీ అనుమతి తప్పనిసరి.
కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయం..
భారత్‌లో వారంటీ తిరస్కరణకు ప్రధాన కారణం మీరు ఏ యాక్సెసరీ వేయించారనేది కాదు.. దానిని ఎలా బిగించారనేదే ప్రధానం! కార్ తయారీ సంస్థ ఆమోదించిన డీలర్ ద్వారా 'ప్లగ్ అండ్ ప్లే' పద్ధతిలో బిగించే పరికరాల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ కటింగ్, డ్రిల్లింగ్, వెల్డింగ్ లేదా వైరింగ్ కట్ చేసే ఏ మాడిఫికేషన్ అయినా కారు వారంటీకి ముప్పు తెస్తుంది. కాబట్టి మీ కారులో ఎలాంటి మార్పులు చేయాలన్నా ముందుగా అధికారిక సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడం మంచిది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


