iPhone 18 pro : సరికొత్తగా ఐఫోన్ 18 ప్రో- డిజైన్, కెమెరా, ధర వివరాలు ఇవే?

iPhone 18 pro price : యాపిల్ సంస్థ తన నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. అధునాతన ఏ20 ప్రో చిప్‌సెట్, వేరియబుల్ అపెర్చర్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లపై ఇప్పటివరకు ఉన్న వివరాలు ఇక్కడ చూద్దాం..

Published on: Jun 21, 2026, 14:02:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టెక్ ప్రియులు.. యాపిల్ తన సరికొత్త ఐఫోన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు! గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 17 సిరీస్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు యాపిల్ తన తదుపరి తరం ఐఫోన్లతో మరింతగా అలరించడానికి సన్నద్ధమవుతోంది. కాలిఫోర్నియాకు చెందిన ఈ టెక్ దిగ్గజం ఇంకొన్ని నెలల్లో ఐఫోన్ 18 ప్రో మోడళ్లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. బేస్ మోడల్ ఐఫోన్ 18 తర్వాత వస్తున్నప్పటికీ, ప్రో మోడల్స్ మాత్రం అదిరిపోయే అప్‌గ్రేడ్లతో ముందుగానే రానున్నాయి.

ఐఫోన్ 18 ప్రో డీటైల్స్..
ఐఫోన్ 18 ప్రో డీటైల్స్..

మీరు గనుక ప్రస్తుతం కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కొద్ది నెలలు ఆగి ఐఫోన్ 18 ప్రో కోసం వేచి చూడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఫోన్ కోసం వేచి చూడటం వర్తేనా? ఈ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్లలో యాపిల్ ఎలాంటి మార్పులు చేయబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఐఫోన్ 18 ప్రో- డిజైన్, ఆకర్షణీయమైన రంగులు..

మనం ఏ స్మార్ట్‌ఫోన్ చేతిలోకి తీసుకున్నా మొదట గమనించేది దాని డిజైన్. యాపిల్ సాధారణంగా ఐఫోన్ల డిజైన్‌లో ఏటా పెద్దగా మార్పులు చేయదు. ఐఫోన్ 17 ప్రోలో ప్రవేశపెట్టిన కొత్త కెమెరా ప్లాటూ లుక్‌నే ఈసారి కూడా కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఐఫోన్ 18 ప్రో డిజైన్‌లో విప్లవాత్మక మార్పులేవీ ఉండకపోవచ్చు.

కానీ, ఈసారి కలర్ ఆప్షన్లలో సరికొత్త మార్పులు కనిపించనున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. యాపిల్ సంస్థ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్ల కోసం కొన్ని సరికొత్త రంగులను పరీక్షిస్తోంది. ఇందులో డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, డార్క్ గ్రే, సిల్వర్ ఫినిషింగ్ రంగులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి ప్రో మోడల్స్ లో రెగ్యులర్ బ్లాక్ కలర్ ఉండకపోవచ్చు. గతంలో ఐఫోన్ 17 ప్రోలో వచ్చిన కాస్మిక్ ఆరెంజ్ ప్లేస్‌లో.. ఈసారి ‘డార్క్ చెర్రీ’ కలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే, ఐఫోన్ 17 ప్రో సిరీస్‌లో ఉన్న టూ-టోన్ లుక్ కాకుండా, ఈసారి ఫ్రేమ్, బ్యాక్ ప్యానెల్ చాలా స్మూత్‌గా కలిసిపోయేలా వెనుక వైపు ఫినిషింగ్‌ను మరింత మెరుగుపరుస్తున్నారు.

ఐఫోన్ 18 ప్రో- డిస్‌ప్లేలో అదిరిపోయే మార్పులు..

ఐఫోన్ 18 ప్రో డిజైన్ పాత ఫోన్‌లాగే అనిపించినప్పటికీ.. డిస్‌ప్లే పరంగా మాత్రం పెద్ద అప్‌గ్రేడ్లు ఉండబోతున్నాయి. యాపిల్ ఈసారి ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్లలో సరికొత్త ఎల్‌టీపీఓ ప్లస్ ఓఎల్ఈడీ ప్యానెళ్లను ఉపయోగించనుంది. ఇవి స్క్రీన్ కలర్స్‌ను చాలా కచ్చితత్వంతో చూపించడమే కాకుండా బ్యాటరీని చాలా తక్కువగా వినియోగించుకుంటాయి. అంతేకాదు, డిస్‌ప్లే పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజును ఈసారి మరింత తగ్గించనున్నారు. దీనివల్ల స్క్రీన్ స్పేస్ మరింత ఎక్కువగా దొరుకుతుంది. అయితే స్క్రీన్ సైజుల్లో ఎలాంటి మార్పు లేదు. ఐఫోన్ 18 ప్రో 6.3 ఇంచులు, ఐఫోన్ 18 ప్రో మాక్స్ 6.9 ఇంచుల స్క్రీన్ సైజుతోనే రానున్నాయి.

ఐఫోన్ 18 ప్రో- పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్..!

యాపిల్ తన ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో నెక్స్ట్ జనరేషన్ ప్రొసెసర్ ‘ఏ20 ప్రో’ చిప్‌ను ఉపయోగించబోతోంది. ఈ సరికొత్త చిప్‌ను అత్యంత అధునాతన 2ఎన్‌ఎమ్ ప్రాసెస్‌పై తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ఐఫోన్ 17 ప్రోలోని ఏ19 ప్రో చిప్‌తో పోలిస్తే ఇది 15 శాతం వేగవంతమైన పర్ఫార్మెన్స్, 30 శాతం మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది.

దీనితో పాటు ప్రొసెసర్‌కు మరింత దగ్గరగా మెమరీని అమర్చే టీఎస్ఎమ్‌సీ వేఫర్-లెవెల్ మల్టీ-చిప్ మాడ్యూల్ టెక్నాలజీని ఆపిల్ వాడుతోంది. దీనివల్ల ఫోన్ ఓవరాల్ స్పీడ్ పెరగడమే కాకుండా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టాస్క్‌లు చాలా వేగంగా జరుగుతాయి. ఈ ప్రో మోడల్స్ ఏకంగా 12జీబీ ర్యామ్ సామర్థ్యంతో రాబోతున్నాయి.

ఐఫోన్ 18 ప్రో- బ్యాటరీ లైఫ్, కెమెరా విశేషాలు..

ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో గతంలో కంటే పెద్ద బ్యాటరీలను అమర్చబోతున్నారు. ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్ ఏకంగా 5,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పెద్ద బ్యాటరీ కేవలం ఈ-సిమ్ మాత్రమే ఉండే గ్లోబల్ మోడళ్లలోనే వచ్చే ఛాన్స్ ఉంది. మన భారతీయ వేరియంట్‌లో బ్యాటరీ సైజ్ కొంచెం తక్కువగా ఉండవచ్చు. బ్యాటరీ సైజ్ పెరగడం వల్ల ఫోన్ మందం 8.75ఎమ్‌ఎమ్ నుంచి 8.8ఎమ్‌ఎమ్‌కు, అలాగే ప్రో మాక్స్ బరువు సుమారు 243 గ్రాములకు పెరిగే అవకాశం ఉంది.

కెమెరా విభాగంలో ఈసారి యాపిల్ ఒక పెద్ద విప్లవాత్మక మార్పు చేయబోతోంది. ఐఫోన్ 18 ప్రో మెయిన్ కెమెరా కోసం ‘వేరియబుల్ అపెర్చర్ సిస్టమ్’ను యాపిల్ పరీక్షిస్తోంది. దీనివల్ల లెన్స్‌లోకి ఎంత కాంతి వెళ్లాలో యూజర్లే కంట్రోల్ చేయవచ్చు. ఇది తక్కువ వెలుతురులో ఫోటోలు తీయడానికి, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీలో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌ను అడ్జస్ట్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే, నాయిస్ తగ్గించి ఫోటో క్వాలిటీ పెంచే సరికొత్త త్రీ-లేయర్ స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్‌ను వాడుతున్నారు. అయితే, కెమెరా సెటప్ మాత్రం పాత పద్ధతిలోనే మూడు 48-మెగాపిక్సెల్ సెన్సార్లతో (మెయిన్, అల్ట్రావైడ్, 4x టెలిఫోటో) వచ్చే అవకాశం ఉంది.

ఐఫోన్ 18 ప్రో- లాంచ్ టైమ్, ఇండియాలో ధర (అంచనా)

ఐఫోన్ లాంచ్ విషయంలో యాపిల్ ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరించబోతోంది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో పాటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ఫోల్డబుల్ ఐఫోన్’ కూడా 2026 సెప్టెంబర్‌లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే బేస్ మోడల్ అయిన సాధారణ ఐఫోన్ 18 లాంచ్‌ను మాత్రం 2027 ప్రారంభానికి వాయిదా వేయనున్నారు. అప్పుడు ఐఫోన్ 18తో పాటు ఐఫోన్ 18ఇ, నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్ మోడళ్లు విడుదలవుతాయి.

ధర విషయానికి వస్తే.. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న మెమరీ చిప్స్ కొరత కారణంగా ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఇటీవల మాట్లాడుతూ “ధరల పెరుగుదల అనివార్యం” అని అంగీకరించారు. నివేదికల ప్రకారం.. అమెరికాలో ఐఫోన్ 18 ప్రో ధర దాదాపు 1,299 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.1,22,500) ఉండే అవకాశం ఉంది. ఇది పాత ఐఫోన్ 17 ప్రో ధర (1,099 డాలర్లు) కంటే 200 డాలర్లు (సుమారు రూ.18,880) ఎక్కువ.

ఇదే గనుక నిజమైతే భారతదేశంలోనూ ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ.1,34,900 గా ఉండగా, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర రూ.1,49,900 గా ఉంది. కాబట్టి రాబోయే కొత్త మోడళ్ల ధరలు వీటికి మరింత ప్రీమియం జోడించి మార్కెట్లోకి రానున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More