WWDC 2026 : సిరి ఏఐ నుంచి ఐఓఎస్ 27 వరకు- యాపిల్ ఈవెంట్‌లో 10 క్రేజీ అనౌన్స్మెంట్స్ ఇవే..
WWDC 2026 date : యాపిల్ వార్షిక ఈవెంట్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 ఘనంగా ప్రారంభమైంది. గంటన్నర పాటు సాగిన కీనోట్ అడ్రస్‌లో ఐఓఎస్ 27, గూగుల్ జెమినీ పవర్డ్ ‘సిరి ఏఐ’తో పాటు ఫొటోస్, సఫారీ యాప్స్‌ను పూర్తిగా మార్చేసే విప్లవాత్మక ఫీచర్లను యాపిల్ ప్రకటించింది. పూర్తి వివరాలు..
టెక్ దిగ్గజం యాపిల్ తన వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026)లో సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది. గంటకు పైగా సాగిన కీనోట్ ప్రసంగంలో కంపెనీ అనేక సంచలన ఫీచర్లను యూజర్ల ముందుకు తెచ్చింది. ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణలుగా సరికొత్త ఐఓఎస్ 27, మ్యాక్ ఓఎస్ గోల్డెన్ గేట్, మునుపెన్నడూ లేని విధంగా అప్‌గ్రేడ్ చేసిన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు నిలిచాయి. వీటితో పాటు ఐఫోన్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సరికొత్త ‘సిరి’ని యాపిల్ పరిచయం చేసింది. అలాగే రోజువారీగా వాడే ఫొటోస్, సఫారీ బ్రౌజర్, మెసేజెస్, క్యాలెండర్, హోమ్, షార్ట్‌కట్స్ వంటి యాప్స్‌ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హంగులతో పూర్తిగా మార్చివేసింది.

ఈ మెగా ఈవెంట్‌లో యాపిల్ ప్రకటించిన టాప్ 10 మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు, అప్‌డేట్ల వివరాలు ఇవే:
1. సరికొత్త అవతారంలో ‘సిరి ఏఐ’
డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026లో అందరి దృష్టిని ఆకర్షించింది సిరి వాయిస్ అసిస్టెంట్. వినియోగదారులు ఎప్పటినుంచో కోరుకుంటున్న పర్సనల్ కాంటెక్స్ట్, ఆన్-స్క్రీన్ అవేర్‌నెస్ (స్క్రీన్‌పై ఉన్న అంశాలను గుర్తించడం), ఇన్-యాప్ యాక్షన్స్ (యాప్స్ లోపల పనులు చేయడం) వంటి అద్భుతమైన ఫీచర్లు ఇప్పుడు యాపిల్‌కి చెందిన సిరిలో అందుబాటులోకి వచ్చాయి.
దీనితో పాటు సరికొత్త యానిమేషన్లతో డైనమిక్ ఐలాండ్ లోపల సిరి కొలువుదీరింది. మనం సిరితో మాట్లాడేటప్పుడు ఈ డైనమిక్ ఐలాండ్ స్క్రీన్‌పై విస్తరిస్తూ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. గూగుల్ కస్టమ్ జెమినీ మోడల్ మద్దతుతో పనిచేసే ఈ అసిస్టెంట్‌కు యాపిల్ అధికారికంగా ‘సిరి ఏఐ’ అని పేరు పెట్టింది. ఇకపై ఇది కేవలం వాయిస్ కమాండ్లకే పరిమితం కాకుండా, మీతో చాట్ చేస్తూ సరికొత్త ఐడియాలను ప్లాన్ చేయడానికి, ట్రిప్ షెడ్యూల్స్ క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. ఎప్పటిలాగే "హే సిరి" అని పిలిచినా లేదా డైనమిక్ ఐలాండ్‌ను కిందకు స్వైప్ చేసినా, పవర్ బటన్ నొక్కినా సిరి ఏఐ ప్రత్యక్షమవుతుంది. ఐప్యాడ్, మ్యాక్‌లలోని స్పాట్‌లైట్ సెర్చ్‌లో కూడా ఈ సిరి ఏఐ అందుబాటులో ఉంటుంది.
2. సిరి కోసం ప్రత్యేకమైన యాప్
మార్కెట్లో ఉన్న చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఇతర ఏఐ చాట్‌బాట్‌ల తరహాలోనే సిరి కోసం యాపిల్ ఒక ప్రత్యేకమైన స్టాండ్‌అలోన్ యాప్‌ను డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 వేదికగా తీసుకొచ్చింది. ఈ యాప్ ఓపెన్ చేయగానే మనం గతంలో సిరితో జరిపిన సంభాషణల జాబితా కనిపిస్తుంది. కింద ఉన్న పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసి సరికొత్త చాట్‌ను ప్రారంభించవచ్చు. ఈ యాప్ ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్, యాపిల్ విజన్ ప్రో, మ్యాక్‌లలో అందుబాటులో ఉంటుంది. అంటే మీరు ఐఫోన్‌లో ప్రారంభించిన చాటింగ్‌ను మ్యాక్ లేదా ఐప్యాడ్‌లో కూడా కంటిన్యూ చేయవచ్చు.
3. ఐఫోన్ కెమెరాకు సరికొత్త తెలివితేటలు
ఐఫోన్ కెమెరా యాప్‌లో యాపిల్ సరికొత్త 'సిరి మోడ్'ను ప్రవేశపెట్టింది. ఇకపై మీరు మీ కెమెరాను ఏదైనా వస్తువు, ప్రదేశం, డాక్యుమెంట్ లేదా ఆహార పదార్థాల వైపు చూపిస్తూ, వాటి గురించి సిరిని ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకోవచ్చు.
దీనికి తోడు కెమెరా యాప్‌లో మరో రెండు సూపర్‌ఫుల్ ఫీచర్లను చేర్చారు. మొదటిది, హోటల్ బిల్లులను కెమెరా ద్వారా స్కాన్ చేసి, మీ స్నేహితులతో సమానంగా బిల్లును పంచుకోవడానికి యాపిల్ క్యాష్ ద్వారా సిరి సహాయం చేస్తుంది. రెండవది, మీ ప్లేట్‌లో ఉన్న ఆహారాన్ని కెమెరాలో చూపిస్తే, అందులో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి, పోషక విలువలు ఎంత అనే వివరాలను సిరి తక్షణమే లెక్కిస్తుంది.
4. సిరి పవర్డ్ రైటింగ్ టూల్స్
ఐఫోన్, యాపిల్ ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సిస్టమ్-వైడ్ రైటింగ్ టూల్స్‌ను యాపిల్ తీసుకొచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు సాధారణ భాషలో అడిగి టెక్ట్స్‌ని జనరేట్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు. అంతేకాదు, ఏదైనా మెసేజ్ పంపే ముందు అందులో తప్పులు ఉంటే ఇది ఆటోమేటిక్‌గా సరిచేస్తుంది. యూజర్ ఎవరితో మాట్లాడుతున్నారు, వారి టోన్ ఎలా ఉంది, ఎలాంటి పంక్చుయేషన్స్ వాడుతున్నారు అనే విషయాలను బట్టి ఈ ఏఐ టూల్ యూజర్ రైటింగ్ స్టైల్‌కు తగినట్లుగా మారిపోతుంది.
5. ఫొటోస్ యాప్‌కు ఏఐ మేకోవర్
గ్యాలరీలోని ఫొటోస్ యాప్‌ను యాపిల్ మరింత స్మార్ట్‌గా మార్చేసింది. ఈ మేరకు డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026లో దీనికి తెచ్చిన మార్పులు ఇవే:
క్లీన్ అప్ : ఫొటోల వెనుక ఉన్న అవాంఛిత వస్తువులను తొలగించే ఈ ఫీచర్ మునుపటి కంటే మరింత స్పష్టంగా, సహజంగా బ్యాక్‌గ్రౌండ్‌ను ఫిల్ చేస్తుంది. ఎంత సంక్లిష్టమైన ఫొటో అయినా ఏఐ మ్యాజిక్‌తో క్లియర్ చేస్తుంది.
ఎక్స్‌పాండ్ : ఏదైనా ఒక ఫొటో సైజును దాని అసలు బోర్డర్ కంటే దాటించి, మిస్సింగ్ పీసెస్ ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఫొటోను పెద్దదిగా మార్చవచ్చు.
స్పేషియల్ రీఫ్రేమ్ : ఫొటో తీసిన తర్వాత కూడా దాని యాంగిల్ లేదా పెర్స్పెక్టివ్‌ను మార్చవచ్చు. వేరే యాంగిల్ నుంచి తీస్తే ఫొటో ఎలా ఉంటుందో జెనరేటివ్ ఏఐ సహాయంతో ఇది చూపిస్తుంది.
ఈ విధంగా ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ప్రతి ఫొటోకు బ్యాక్‌గ్రౌండ్‌లో 'SynthID' అనే హిడెన్ వాటర్‌మార్క్ పడుతుంది, దీనివల్ల అది ఏఐ ఫొటో అని సులభంగా గుర్తించవచ్చు.
6. సఫారీ బ్రౌజర్‌లో సరికొత్త విప్లవం
యాపిల్ సొంత బ్రౌజర్ 'సఫారీ' కి ఏఐ పవర్ తోడైంది. ఇకపై సఫారీలో ఓపెన్ చేసే ట్యాబ్‌లను వాటి సబ్జెక్టుల ఆధారంగా ఆటోమేటిక్‌గా వేర్వేరు గ్రూపులుగా ఆర్గనైజ్ చేస్తుంది. అలాగే "నోటిఫై మీ" అనే ఆప్షన్ ద్వారా మీకు నచ్చిన ఈ-కామర్స్ సైట్ లోని ప్రొడక్ట్ ధర తగ్గినా లేదా స్టాక్ లోకి వచ్చినా సఫారీ మీకు అలర్ట్ పంపుతుంది. బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఒకే ఒక్క ట్యాప్‌తో స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లుగా మార్చే ఏజెంటిక్ అప్‌గ్రేడ్‌ను కూడా తెచ్చారు. బ్రౌజర్‌లో కస్టమ్ ఎక్స్‌టెన్షన్స్ కావాలంటే జస్ట్ టైప్ చేసి అడిగితే ఏఐ క్రియేట్ చేసి ఇస్తుంది.
7. మరింత పవర్‌ఫుల్ గా ఇమేజ్ ప్లేగ్రౌండ్
డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 ప్రకటనల్లో భాగంగా.. యాపిల్ ఇమేజ్ ప్లేగ్రౌండ్‌ను సరికొత్త అధునాతన ఏఐ మోడల్‌తో రీడిజైన్ చేసింది. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ రక్షణతో పాటు, అత్యంత క్వాలిటీ గల ఫొటోరియలిస్టిక్ చిత్రాలను ఇది జనరేట్ చేస్తుంది. సాధారణ టెక్స్ట్ ప్రాంప్ట్స్ ద్వారా ఇమేజ్ ఎడిటింగ్, ఆబ్జెక్ట్ సెలెక్షన్, యాస్పెక్ట్ రేషియో మార్చడం, సరికొత్త వాల్‌పేపర్స్ క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది. ఈ చిత్రాలకు కూడా SynthID వాటర్‌మార్క్ ఉంటుంది.
8. మెసేజెస్, మెయిల్, క్యాలెండర్ అప్‌డేట్లు
యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇప్పుడు మెసేజెస్, మెయిల్, క్యాలెండర్, ఫోన్ యాప్‌లలోకి చేరిపోయాయి.
మెసేజెస్ యాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి రిమైండర్ సెట్ చేయడం లేదా నోట్ రాసుకోవడం వంటి సలహాలను ఏఐ ఇస్తుంది.
మెయిల్స్, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి 'స్మార్ట్ రిప్లై' ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
క్యాలెండర్‌లో కేవలం నోటితో చెప్తే చాలు, ఆటోమేటిక్‌గా కాంటాక్ట్స్, లొకేషన్ వివరాలను గుర్తించి ఈవెంట్ క్రియేట్ అవుతుంది.
ఫోన్ యాప్‌లో 'కాల్ కాంటెక్స్ట్' ఫీచర్ ద్వారా మీరు ఎవరికి కాల్ చేస్తున్నారో వారికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను స్క్రీన్‌పై చూపిస్తుంది.
9. షార్ట్‌కట్స్ క్రియేషన్ సులభతరం
ఇకపై కష్టమైన షార్ట్‌కట్లను కోడింగ్ లేదా ఇబ్బంది లేకుండా కేవలం సాధారణ భాషలో అడిగి క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. రేపటి క్యాలెండర్ షెడ్యూల్ ఆధారంగా ఈరోజు రాత్రే అలారం సెట్ చేయడం, ఫుడ్ డెలివరీ నోటిఫికేషన్ రాగానే ఇంటి బయట ఉన్న లైట్లను ఆటోమేటిక్‌గా ఆన్ చేయడం వంటి పనులను ఈ ఏఐ షార్ట్‌కట్స్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.
10. సరికొత్త ఐఓఎస్ 27
ఈ ఏడాది యాపిల్ తన లిక్విడ్ గ్లాస్ డిస్‌ప్లే రీడబిలిటీని మెరుగుపరిచింది. టెక్స్ట్ స్పష్టంగా కనిపించేలా ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ కంటెంట్‌ను చక్కగా వేరు చేస్తుంది. సెట్టింగ్స్‌లో ఒక స్లైడర్ ద్వారా లిక్విడ్ గ్లాస్ ట్రాన్స్‌పరెన్సీని 'అల్ట్రా క్లియర్' నుంచి ఫుల్లీ టింటెడ్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అన్నింటికంటే ముఖ్యంగా ఐఓఎస్ 27 ఓఎస్ మునుపటి కంటే 30% వేగంగా యాప్స్‌ను ఓపెన్ చేస్తుంది. ఫొటోలు తీసిన తర్వాత అవి 70% వేగంగా లోడ్ అవుతాయి. ఎయిర్‌డ్రాప్ ట్రాన్స్‌ఫర్ స్పీడ్ 80% పెరగగా, ఎక్స్‌టర్నల్ డ్రైవ్ డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. స్పాట్‌లైట్, ఫొటోస్, మెయిల్ యాప్స్‌లో సెర్చింగ్ ప్రాసెస్ మరింత సులభతరం అయిందని యాపిల్ పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


