Instagram new feature : ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్​- ఇక ఆ పని చాలా ఈజీ..

Instagram edit comment feature : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా సంస్థ అదిరిపోయే వార్త అందించింది. ఇప్పటివరకు కామెంట్లలో ఏవైనా తప్పులు దొర్లితే డిలీట్ చేయడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. కానీ, ఇకపై పంపిన కామెంట్లను ఎడిట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ అప్‌డేట్‌ను విడుదల చేసింది. పూర్తి వివరాలు..

Published on: Apr 11, 2026, 10:03:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ కింద కామెంట్ పెట్టినప్పుడు.. ఆత్రుతలో కొన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ దొర్లడం సహజం. పోస్ట్ చేసిన మరుక్షణమే ఆ తప్పును గమనించి, "అయ్యో.. పొరపాటు జరిగిందే" అని కంగారుపడే వారు చాలా మందే ఉన్నారు. అందుకోసమే చాలా ప్లాట్​ఫామ్స్​లో ఎడిట్​ ఆప్షన్​ ఉంటుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఇప్పటివరకు అటువంటి ఫఈచర్​ లేదు. తప్పు సరిదిద్దుకోవాలంటే, దాన్ని పూర్తిగా డిలీట్ చేసి మళ్లీ కొత్తగా రాయాల్సి వచ్చేది. కానీ, యూజర్ల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న మెటా ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ 'ఎడిట్ కామెంట్' అనే కొత్త ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.

ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్​ ఇదే.. (Pexels)
ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్​ ఇదే.. (Pexels)

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి సాధారణ యూజర్ల వరకు అందరికీ ఈ అప్‌డేట్ ఎంతో ఊరటనిస్తోంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ అకౌంట్స్ నిర్వహించే వారికి ఇది ఒక వరమనే చెప్పాలి.

15 నిమిషాల గడువు.. అపరిమిత అవకాశాలు

అయితే, ఇన్​స్టాగ్రామ్ కొత్త ఎడిట్​ కామెంట్ ఫీచర్‌లో ఒక చిన్న మెలిక ఉంది. మీరు చేసిన కామెంట్‌ను ఎడిట్ చేయాలంటే, ఆ కామెంట్ పోస్ట్ చేసిన 15 నిమిషాల లోపు మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. ఆ సమయం దాటిపోతే మాత్రం, పాత పద్ధతిలోనే కామెంట్‌ను డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ 15 నిమిషాల వ్యవధిలో మీరు ఎన్నిసార్లయినా కామెంట్‌ను మార్చుకోవచ్చు. ఎడిట్ చేసిన కామెంట్ పక్కన 'Edited' అనే లేబుల్ కనిపిస్తుంది. దీనివల్ల ఆ కామెంట్‌లో మార్పులు జరిగాయని ఇతర యూజర్లకు అర్థమవుతుంది. యాపిల్ ఐ-మెసేజ్ తరహాలో ఇక్కడ 'ఎడిట్ హిస్టరీ'ని చూసే వీలుండదు, ఇది యూజర్ల ప్రైవసీకి మేలు చేసే అంశం.

ఏవి మార్చొచ్చు? ఏవి మార్చలేము?

ఈ అప్‌డేట్ కేవలం టెక్ట్స్, ఎమోజీలకు మాత్రమే పరిమితం!

మీరు రాసిన మాటల్లో తప్పులున్నా, లేదా అదనంగా ఎమోజీలు చేర్చాలనుకున్నా ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది.

కానీ, మీరు కామెంట్‌లో ఏదైనా వీడియో, జిఫ్ లేదా మీ అవతార్ రియాక్షన్‌ను పంపితే వాటిని ఎడిట్ చేయడం సాధ్యం కాదు.

ఒకవేళ వీటిని మార్చాలనుకుంటే, పాత కామెంట్‌ను డిలీట్ చేయాల్సిందే.

"డిజిటల్ కమ్యూనికేషన్‌లో స్పష్టత ఎంత ముఖ్యమో ఈ ఫీచర్ నిరూపిస్తోంది. తప్పులను సరిదిద్దుకోవడానికి 15 నిమిషాల సమయం ఇవ్వడం అనేది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను పెంచుతుంది," అని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024లో డైరెక్ట్ మెసేజ్ (డీఎం)లలో ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్, ఇప్పుడు దాన్ని కామెంట్​ సెక్షన్​కి కూడా విస్తరించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్‌ను ఎడిట్ చేయడం ఎలా?

ఈ ప్రక్రియ చాలా సులభం. మీరు చేసిన కామెంట్‌ను సరిదిద్దడానికి ఈ కింది స్టెప్స్​ని అనుసరించండి..

  • మీరు చేసిన కామెంట్ దగ్గరికి వెళ్లి, దానిపై లాంగ్ ప్రెస్ చేయండి లేదా పక్కన ఉండే మూడు చుక్కల మెనూని క్లిక్ చేయండి.
  • అక్కడ మీకు కనిపించే 'Edit' బటన్‌పై టాప్ చేయండి.
  • ఇప్పుడు తప్పుగా ఉన్న టెక్ట్స్​ని సరిచేసి లేదా కొత్తగా ఏదైనా జోడించి 'Done' పై క్లిక్ చేయండి.
  • అంతే! మీ కామెంట్ తక్షణమే అప్‌డేట్ అవుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. ఇన్‌స్టాగ్రామ్ కామెంట్‌ను ఎడిట్ చేయడానికి ఎంత సమయం ఉంటుంది?

మీరు కామెంట్ పోస్ట్ చేసిన సమయం నుంచి కేవలం 15 నిమిషాల వరకు మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

2. ఎడిట్ చేసిన కామెంట్‌ను ఇతరులు గుర్తుపడతారా?

అవును, మీరు ఎడిట్ చేసిన కామెంట్ పక్కన 'Edited' అనే ట్యాగ్ కనిపిస్తుంది. అయితే మీరు గతంలో ఏం రాశారు అనేది (Edit History) ఎవరికీ కనిపించదు.

3. నేను జిఫ్ లేదా వీడియో కామెంట్లను కూడా ఎడిట్ చేయవచ్చా?

లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం టెక్ట్స్​, ఎమోజీలకు మాత్రమే వర్తిస్తుంది. వీడియోలు లేదా జిఫ్‌లను మార్చాలంటే పాత కామెంట్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుంది.

4. నా స్నేహితుల పోస్ట్‌లపై నేను చేసిన కామెంట్లను కూడా ఎడిట్ చేయవచ్చా?

అవును, మీ సొంత పోస్ట్‌లే కాకుండా, మీరు ఫాలో అయ్యే వ్యక్తుల పోస్ట్‌లపై లేదా రీల్స్‌పై మీరు చేసిన కామెంట్లను కూడా 15 నిమిషాల లోపు ఎడిట్ చేసుకోవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More