Fireworks Factory Blast in Tamilnadu : తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కట్టనార్‌పట్టి గ్రామం వద్ద ఉన్న ఒక టపాసుల తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ధాటికి ఫ్యాక్టరీలోని షెడ్లు కుప్పకూలిపోగా…. అక్కడ పనిచేస్తున్న 16 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక మరియు సహాయక సిబ్బంది ఘటనా స్థలం నుండి ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. ఫ్యాక్టరీ శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు.
సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి…
ఈ ఘోర ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, తంగం తెన్నరసులను వెంటనే ఘటనా స్థలానికి పంపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని…. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని విరుదునగర్ జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
"ఇప్పటివరకు, సంఘటనా స్థలం నుండి 8 మృతదేహాలను వెలికితీశాం" అని అగ్నిమాపక, రెస్క్యూ శాఖ అధికారి ఒకరు ధృవీకరించారు, లోపల చిక్కుకున్న వ్యక్తులను రక్షించే ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.
విరుదునగర్ జిల్లాలో టపాసుల తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు వరుసగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో భారీ ప్రమాదం. ఈ నెల 13న సాత్తూరు సమీపంలోని మదత్తుపట్టిలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో కూడా భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. బాణాసంచా తయారీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.