France vs Morocco : ఎంబాపె మ్యాజిక్! ఫిఫా వరల్డ్ కప్ సెమీస్‌లోకి ఫ్రాన్స్..
France vs Morocco match : ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ పవర్‌ఫుల్ ప్రదర్శనతో మొరాకోను 2-0 తేడాతో చిత్తు చేసింది. కిలియన్ ఎంబాపె మెరుపు గోల్, ఉస్మాన్ డెంబెలే అదిరిపోయే ముగింపుతో ఫ్రాన్స్ వరుసగా మూడోసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్ మరోసారి తన క్లాస్ చూపించింది. ఆఫ్రికన్ దిగ్గజం మొరాకోతో జరిగిన హోరాహోరీ పోరులో 2-0 తేడాతో ఘన విజయం సాధించి, సగర్వంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్ వరుసగా సెమీస్‌కు చేరడం ఇది మూడోసారి కావడం విశేషం.

ఖతార్ వేదికగా జరిగిన 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ మొరాకోను 2-0తో ఓడించిన ఫ్రాన్స్, 2026లోనూ అదే స్కోరుతో నెగ్గి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం విశేషం. దీనితో వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్ చేరిన మూడో జట్టుగా రికార్డు సృష్టించేందుకు ఫ్రాన్స్ అడుగు దూరంలో నిలిచింది.
తొలి అర్ధభాగంలో పెనాల్టీ మిస్.. మొరాకో డిఫెన్స్ అదుర్స్..
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె నేతృత్వంలో వరుస అటాక్స్ చేసినప్పటికీ, మొరాకో డిఫెండర్లు అంతే దీటుగా తిప్పికొట్టారు. మ్యాచ్ 28వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని భావించారు. బాక్స్ లోపల ఎంబాపెను మొరాకో ఆటగాడు కింద పడేయడంతో రెఫరీ పెనాల్టీ ప్రకటించారు. అయితే, ఎంబాపె కొట్టిన పవర్‌ఫుల్ షాట్‌ను మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బౌనో అద్భుతమైన డైవ్‌తో అడ్డుకున్నాడు. యూరో 2020 తర్వాత ఎంబాపె అంతర్జాతీయ మ్యాచ్‌లో పెనాల్టీ మిస్ చేయడం ఇదే తొలిసారి. ఈ అద్భుతమైన రక్షణతో మొరాకో జట్టులో ఉత్సాహం రెట్టింపైంది. ఎలాంటి గోల్ నమోదు కాకుండానే మొదటి అర్ధభాగం ముగిసింది.
రెండో అర్ధభాగం ప్రారంభంలో మొరాకో అగ్రెసివ్ ఆటతీరుతో ఫ్రాన్స్‌ను కాసేపు ఒత్తిడిలోకి నెట్టింది. కానీ, ఎక్కువ సమయం ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది.
ఎంబాపె విశ్వరూపం.. డెంబెలే సంచలనం!
పెనాల్టీ మిస్సయిన నిరాశను పక్కనబెట్టి ఎంబాపె సెకండ్ హాఫ్‌లో విశ్వరూపం చూపించాడు. మ్యాచ్ 60వ నిమిషంలో మొరాకో డిఫెండర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఎంబాపె క్లాసిక్ గోల్ సాధించి ఫ్రాన్స్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో ఎంబాపె ప్రపంచకప్ చరిత్రలో తన 20వ గోల్‌ను పూర్తి చేసుకుని, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి (21 గోల్స్) రికార్డుకు చేరువయ్యాడు.
ఆ తర్వాత కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే (66వ నిమిషంలో) ఉస్మాన్ డెంబెలే మైదానాన్ని షేక్ చేశాడు. ఎంబాపె ఎడమ వైపు నుంచి బంతిని పాస్ చేయగా, డెంబెలే 20 గజాల దూరం నుంచి కుడికాలి వాలీతో మెరుపు షాట్ కొట్టాడు. మొరాకో కీపర్ బౌనో చేతికి బంతి తగిలినప్పటికీ స్పీడ్ ఎక్కువగా ఉండటంతో నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో డెంబెలేకు ఇది ఐదో గోల్.
ఈ గోల్‌తో ఫ్రాన్స్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లి, విజయాన్ని ఖరారు చేసుకుంది.
గోల్డెన్ బూట్ రేసులో మెస్సితో సమానంగా ఎంబాపె..
ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో కిలియన్ ఎంబాపె ప్రస్తుత ప్రపంచకప్‌లో మొత్తం 8 గోల్స్‌తో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి కూడా 8 గోల్స్‌తోనే ఉండటంతో, గోల్డెన్ బూట్ అవార్డు కోసం ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్ల మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు సెమీఫైనల్స్ వేదికగా మరింత హీటెక్కనుంది.
ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న ఫ్రాన్స్ జట్టు ఫేవరెట్‌గా సెమీస్ బరిలోకి దిగుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


