NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల- రిజిస్ట్రేషన్లు, రౌండ్ల వారీగా వివరాలు..
NEET UG 2026 counselling : నీట్ యూజీ 2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ వివరాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) వెల్లడించింది. ఆగస్టు 5 నుంచి మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రౌండ్ల వారీగా ముఖ్యమైన తేదీలు, వెబ్‌సైట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) కీలకమైన సమాచారాన్ని అందించింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఎంసీసీ అధికారికంగా విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న 15 శాతం ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) సీట్లతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జిప్‌మర్ (జిప్‌మర్ పుదుచ్చేరి, కారైకాల్) సంస్థల్లో ఉన్న 100 శాతం సీట్ల భర్తీకి ఈ షెడ్యూల్ వర్తిస్తుంది.
రౌండ్ 1 (మొదటి విడత) కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ే షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 4న ఆయా విద్యాసంస్థల్లో అందుబాటులో ఉండే సీట్ల మ్యాట్రిక్స్ తనిఖీ జరుగుతుంది.
రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపుకు ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చారు.
వెబ్ ఆప్షన్లు : ఆగస్టు 6 నుంచి 13వ తేదీ ఉదయం 11 గంటల వరకు కళాశాలలను ఎంచుకోవచ్చు. ఆగస్టు 12 సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 11 గంటల మధ్య ఆప్షన్లను లాక్ చేసే వెసులుబాటు ఉంటుంది.
సీట్ల కేటాయింపు, ఫలితాలు: ఆగస్టు 13 నుంచి 16 వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ సాగుతుంది. రౌండ్ 1 ఫలితాలను ఆగస్టు 17న ప్రకటిస్తారు.
రిపోర్టింగ్: సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 18 నుంచి 22 మధ్య కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
రౌండ్ 2 (రెండో విడత) కౌన్సెలింగ్..
రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24న సీట్ల మ్యాట్రిక్స్ పరిశీలనతో ప్రారంభమవుతుంది.
రిజిస్ట్రేషన్: ఆగస్టు 25 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు (ఫీజు చెల్లింపు సాయంత్రం 6 వరకు) అవకాశం ఉంటుంది.
వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 25 నుంచి 30 వరకు కళాశాలలను ఎంచుకోవచ్చు.
ఫలితాలు, రిపోర్టింగ్: ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో సీట్ల కేటాయింపు జరిపి, సెప్టెంబర్ 2న ఫలితాలు వెల్లడిస్తారు. సీటు లభించిన వారు సెప్టెంబర్ 3 నుంచి 8వ తేదీ మధ్య కళాశాలల్లో చేరాలి.
రౌండ్ 3 (మూడో విడత) కౌన్సెలింగ్..
రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 11 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది.
వెబ్ ఆప్షన్లు: సెప్టెంబర్ 11 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్ల నమాజుకు గడువు ఇచ్చారు.
ఫలితాలు, రిపోర్టింగ్: సెప్టెంబర్ 18న ఫలితాలు విడుదలవుతాయి. విద్యార్థులు సెప్టెంబర్ 19 నుంచి 26 మధ్య కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ (చివరి విడత)..
నీట్ యూజీ 2026 కోసం మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం నిర్వహించే స్ట్రే వేకెన్సీ రౌండ్ ప్రక్రియ సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది.
రిజిస్ట్రేషన్. ఆప్షన్లు: సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్‌తో పాటు ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఫలితాలు, అడ్మిషన్లు: అక్టోబర్ 3న తుది ఫలితాలు ప్రకటిస్తారు. సీటు సాధించిన విద్యార్థులు అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ మధ్య కేటాయించిన మెడికల్/డెంటల్ కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసేందుకు వీలుగా శని, ఆదివారాలు. ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా కార్యాలయాలు, కళాశాలలు యథావిధిగా పనిచేస్తాయని ఎంసీసీ స్పష్టం చేసింది. అర్హులైన విద్యార్థులు సమాచారం కోసం నిరంతరం ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


