ఫిజికల్ ఇంటెలిజెన్స్ విస్తరణకు ఎంఈఐఎల్–అనలాగ్ వ్యూహాత్మక భాగస్వామ్యం

దేశంలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ (Physical Intelligence) సాంకేతికతను విస్తృత స్థాయిలో అమలు చేయడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), యూఏఈ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అనలాగ్ (Analog) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.

Published on: Jul 1, 2026, 16:09:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్, జూలై 1: ఫిజికల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను విస్తృత స్థాయిలో అమలు చేయడానికి ఎంఈఐఎల్, అనలాగ్ (Analog) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా మౌలిక సదుపాయాలు, రవాణా, పారిశ్రామిక వ్యవస్థలు, ప్రజా భద్రత, పట్టణ నవీకరణ, మేధో ఆధారిత కార్యకలాపాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నాయి.

కార్యక్రమంలో పీవీ కృష్ణారెడ్డి, అలెక్స్ కిప్‌మాన్
కార్యక్రమంలో పీవీ కృష్ణారెడ్డి, అలెక్స్ కిప్‌మాన్

ఫిజికల్ ఇంటెలిజెన్స్ అనేది యంత్రాలు వాస్తవ ప్రపంచాన్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలను కల్పించే ఆధునిక సాంకేతికత. ఇది ముందుగా నిర్దేశించిన ప్రోగ్రామింగ్‌పైనే ఆధారపడకుండా, ప్రతి పరస్పర చర్య ద్వారా నిరంతరం నేర్చుకుంటూ, ప్రపంచాన్ని ప్రతిబింబించే సజీవ డిజిటల్ నమూనాను (లివింగ్ మోడల్) రూపొందించుకుంటూ మరింత మేధోసామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది.

ఈ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులను అమలు చేసే సామర్థ్యం, విస్తృత పరిధి ఎంఈఐఎల్ అందించగా, అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అనలాగ్ అందించనుంది. ఈ రెండు సంస్థలు కలిసి మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్మార్ట్ మొబిలిటీ, పరిశ్రమల ఆధునికీకరణ, ప్రజా భద్రత, స్మార్ట్ నగరాల నిర్మాణం, ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేసి అమలు చేయనున్నాయి.

ఈ ఒప్పందం భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య సాంకేతిక రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా కూడా నిలుస్తుందని రెండు సంస్థలు పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, "మౌలిక సదుపాయాలే అభివృద్ధికి పునాది. భవిష్యత్తులో మౌలిక సదుపాయాలు మరింత మేధోసామర్థ్యంతో, పరస్పర అనుసంధానంతో, పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే విధంగా రూపాంతరం చెందనున్నాయి. ఆ దిశగా ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశానికి ఫిజికల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకురావడంలో అనలాగ్‌తో కలిసి పనిచేయడం పట్ల మాకు ఎంతో గర్వంగా ఉంది" అని తెలిపారు.

అనలాగ్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) అలెక్స్ కిప్‌మన్ మాట్లాడుతూ, "ప్రపంచంలో అత్యంత కీలకమైన సాంకేతిక అవకాశాలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఇక్కడి ఇంజినీరింగ్ ప్రతిభ అసాధారణం. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దేశం చూపుతున్న దృక్పథం విశేషం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ఉన్న వ్యాపార స్ఫూర్తి కూడా అపూర్వం. ఫిజికల్ ఇంటెలిజెన్స్‌కు ఇదే సరైన సమయం. దీన్ని భారతదేశంలో సాకారం చేయడానికి ఎంఈఐఎల్ సరైన భాగస్వామి. కలిసి పరిమితులు లేని భవిష్యత్తును నిర్మించబోతున్నాం" అని పేర్కొన్నారు.

ఈ భాగస్వామ్యంతో మేధో ఆధారిత మౌలిక సదుపాయాలు, స్మార్ట్ మొబిలిటీ వ్యవస్థలు, స్మార్ట్ అర్బన్ సొల్యూషన్స్, అధునాతన సెన్సింగ్ సాంకేతికతలు, ఆపరేషనల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, స్పేషియల్ కంప్యూటింగ్, పారిశ్రామిక రూపాంతరం, ప్రజా భద్రత, కృత్రిమ మేధస్సు ఆధారిత వాస్తవ ప్రపంచ అనువర్తనాల అమలుకు వేగం చేకూరనుంది.

ప్రాజెక్టుల అమలుతో పాటు, భారతదేశంలో దీర్ఘకాలిక సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు, ప్రతిభాభివృద్ధి, టెక్నాలజీ ఎకోసిస్టమ్ నిర్మాణంపై కూడా ఈ రెండు సంస్థలు సంయుక్తంగా పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఈ ప్రకటనతో అధునాతన సాంకేతిక పెట్టుబడులకు హైదరాబాద్, తెలంగాణలు ప్రముఖ గమ్యస్థానంగా మరింత బలోపేతం అవుతున్నాయని సంస్థలు తెలిపాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కుదిరిన ప్రాథమిక ఒప్పందాల అనంతరం భారత్‌లో అనలాగ్ విస్తరిస్తున్న కార్యకలాపాలకు ఈ భాగస్వామ్యం మరింత బలాన్ని చేకూర్చనుందని వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఐ ఎల్ డైరెక్టర్స్ పీవీ ప్రణవ్ రెడ్డి , మానస్ రెడ్డి , అనలాగ్ సీఓఓ యెన్సీ స్మిత్ తదితరులు పాల్గొన్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More