మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్: 90% మందికి 5% కంటే తక్కువ జీతాల పెంపు

మైక్రోసాఫ్ట్ ఇండియాలో పనిచేస్తున్న 90 శాతానికి పైగా ఉద్యోగులకు ఈ ఏడాది 5 శాతం లేదా అంతకంటే తక్కువ శాతమే జీతాలు పెరిగాయి. కంపెనీ లాభాల్లో రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, వేతన పెంపు విషయంలో నిరాశే మిగిలిందని 'బ్లైండ్' ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది.

Published on: Nov 3, 2026, 15:12:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ఉద్యోగులకు ఈ ఏడాది అప్రైజల్స్ తీవ్ర నిరాశను మిగిల్చాయి. వృత్తిపరమైన నెట్‌వర్కింగ్ వేదిక 'బ్లైండ్' (Blind) నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతదేశంలోని 90 శాతానికి పైగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు 2026 అప్రైజల్ సైకిల్‌లో కేవలం 5 శాతం లేదా అంతకంటే తక్కువ శాతమే వేతన పెంపు లభించింది.

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్: 90% మందికి 5% కంటే తక్కువ జీతాల పెంపు
మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్: 90% మందికి 5% కంటే తక్కువ జీతాల పెంపు

ఈ సర్వేలో పాల్గొన్న 2,178 మంది భారతీయ ఐటీ నిపుణులలో, 91 శాతం మంది మైక్రోసాఫ్ట్ సిబ్బంది తమకు 5 శాతం లేదా అంతకంటే తక్కువ పెంపు మాత్రమే వచ్చిందని చెప్పారు. గతేడాది ఈ సంఖ్య 45 శాతంగా ఉండగా, ఈసారి అమాంతం పెరిగింది. 10 శాతానికంటే ఎక్కువ పెంపు పొందిన ఉద్యోగుల సంఖ్య గతేడాది ఉన్న 27 శాతం నుండి ఈ ఏడాది కేవలం 5 శాతానికి పడిపోయింది.

రికార్డు లాభాలు ఒకవైపు.. ఉద్యోగుల ఆవేదన మరోవైపు

కంపెనీ ఆర్థికంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ముగిసిన జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ నికర ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే 32 శాతం పెరిగి 36.6 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ మొత్తం రాబడి 19 శాతం వృద్ధితో 92.3 బిలియన్ డాలర్లను తాకింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రాబడి 30 శాతం పెరిగి 63.9 బిలియన్ డాలర్లకు చేరుకోగా, యాజూర్ (Azure) విభాగం రాబడి ఏకంగా 48 శాతం వృద్ధి చెందింది.

రాబోయే త్రైమాసికంలో రాబడి 97.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్న మైక్రోసాఫ్ట్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 50 బిలియన్ డాలర్లకు పైగా మూలధన వ్యయాన్ని కేటాయించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంతటి భారీ రాబడులు వస్తున్నప్పటికీ, వేతన పెంపుపై 86 శాతం మంది మైక్రోసాఫ్ట్ సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితంగా, జోహో (Zoho) తర్వాత అత్యంత తక్కువ రేటింగ్ పొందిన రెండో ఐటీ యజమానిగా మైక్రోసాఫ్ట్ నిలిచింది.

స్వచ్ఛంద విరమణల భయం.. మారిన ఉద్యోగుల ప్రాధాన్యతలు

మరోవైపు, మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మన్ ఇటీవల గ్లోబల్ వ్యాప్తంగా దాదాపు 60,000 మంది ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ (VEO) ప్రకటించారు. భారతదేశం, అమెరికా, కెనడా, బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న లెవెల్ 70, అంతకంటే తక్కువ స్థాయి అర్హత కలిగిన ఉద్యోగులు డిసెంబర్ ప్రారంభం వరకు ఈ ప్రోగ్రామ్‌లో చేరేందుకు అవకాశం ఉంది.

ఈ స్వచ్ఛంద విరమణ ఆఫర్ల నేపథ్యంలో ఉద్యోగుల దృష్టి వేతన పెంపు నుండి ఉద్యోగ రక్షణ వైపు మళ్లింది. గడిచిన ఏడాది కాలంలో భారతీయ వినియోగదారులు బైఅవుట్‌లు, వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన సమాచారం కోసం చేసిన సెర్చ్‌లు 60 శాతం పెరిగినట్లు బ్లైండ్ నివేదించింది. అలాగే లేఆఫ్‌లు, సెవెరెన్స్ ప్యాకేజీల వెతుకులాట 16 శాతం నుంచి 21 శాతానికి పెరగ్గా, జీతాల పెంపుపై ఆసక్తి 7 శాతం తగ్గింది.

ఐటీ రంగాన్ని ఏలుతున్న ఏఐ, ఖర్చుల కోతలు

ఈ ధోరణి కేవలం ఒక్క కంపెనీకే పరిమితం కాకుండా మొత్తం భారత ఐటీ రంగంలోని ఆందోళనలను ప్రతిబింబిస్తోంది. కంపెనీలు తమ వ్యక్తిగత ప్రతిభ కంటే కార్పొరేట్ ప్రాధాన్యతలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు.

సర్వే ప్రకారం, 41 శాతం మంది ఉద్యోగులు తమ అప్రైజల్ ఫలితాలకు కంపెనీల ఆర్థిక ప్రదర్శన, ఖర్చుల కోతలే కారణమని పేర్కొన్నారు. మరో 18 శాతం మంది ఏఐ, ఆటోమేషన్ దిశగా మారుతున్న వ్యాపార ప్రాధాన్యతలను బాధ్యులను చేయగా, కేవలం 22 శాతం మంది మాత్రమే తమ వ్యక్తిగత ప్రతిభే పెంపునకు ప్రధాన కారణమని భావించారు.

మొత్తంగా చూస్తే, ఈ ఏడాది భారత ఐటీ ఉద్యోగుల్లో 35 శాతం మందికి ఎలాంటి పెంపు లభించలేదు లేదా జీతాల్లో కోత పడింది. 59 శాతం మందికి 5 శాతం లేదా అంతకంటే తక్కువ పెంపు దక్కింది. దాదాపు మూడింట రెండొంతుల మంది ఐటీ సిబ్బంది తమ వార్షిక అప్రైజల్స్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More