Microsoft : ‘వెళ్లిపోతాము అంటే డబ్బులిస్తాము’- 60వేల మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ

ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వ్యయాలను తగ్గించుకుని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిశగా రీస్ట్రక్చరింగ్ చేపట్టేందుకు ఏకంగా 60,000 మంది ఉద్యోగులకు వాలంటరీ బైఅవుట్ ప్యాకేజీని ప్రకటించింది. విండోస్, ఎక్స్‌బాక్స్, కోపైలట్ విభాగాల్లో పనిచేస్తున్న భారత్ సహా పలు దేశాల టెక్కీలపై దీని ప్రభావం పడనుంది.

Published on: Oct 27, 2026, 05:28:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న దిగ్గజ సంస్థ 'మైక్రోసాఫ్ట్' టెక్ ప్రపంచంలో మరో పెద్ద సంచలనానికి తెరతీసింది! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగానికి అనుగుణంగా తమ సంస్థను పునర్వ్యవస్థీకరించే క్రమంలో, అలాగే ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు సుమారు 60,000 మంది ఉద్యోగులకు ‘బైఅవుట్ ప్యాకేజీ’ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.

మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ ఆఫర్.. (REUTERS)
మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ ఆఫర్.. (REUTERS)

హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ టెక్కీలను ఈ నిర్ణయం ప్రభావితం చేయనుంది. అమెరికా, కెనడా, బ్రిటన్, భారత్‌లోని వైస్ ప్రెసిడెంట్ (వీపీ) స్థాయి, ఆ దిగువ స్థాయిలో ఉన్న అర్హులైన ఉద్యోగులకు ఈ బైఅవుట్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి వెల్లడించారు.

ఈ బైఅవుట్ ప్యాకేజీని తీసుకునే వారు మైక్రోసాఫ్ట్​ నుంచి వాలంటరీగా ఎగ్జిట్​ అవుతున్నట్టు అర్థం!

ఎవరెవరిపై ప్రభావం? ఎవరికి మినహాయింపు?

ఈ బైఅవుట్ ప్రోగ్రామ్‌లో మైక్రోసాఫ్ట్‌కు చెందిన అత్యంత కీలకమైన విభాగాలైన ఎక్స్‌బాక్స్ (గేమింగ్), విండోస్, కోపైలట్ (ఏఐ విభాగం), ఫైనాన్స్ విభాగాలు పూర్తిగా భాగస్వామ్యం కానున్నాయి. అంటే ఈ విభాగాల్లోని సీనియర్, మిడ్-లెవెల్ ఉద్యోగులు కంపెనీని వీడటానికి స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే, సంస్థ భవిష్యత్తుకు అత్యంత అవసరమైన కొన్ని విభాగాల ఉద్యోగులకు ఈ ఆఫర్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. డేటా సెంటర్లు, సేల్స్, మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ బైఅవుట్ వర్తించదని సమాచారం.

‘కంపెనీ వీడేందుకు గొప్ప అవకాశం’

మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ (సీపీఓ) అమీ కోల్‌మన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్‌లో ఈ పరిణామాన్ని ధ్రువీకరించారు.

"కంపెనీ బయట తమ భవిష్యత్తును వెతుక్కుందామనుకునే అర్హులైన ఉద్యోగులు, తగినంత ఆర్థిక సపోర్ట్‌తో సులువుగా బయటకు వెళ్లేందుకు ఈ ఆఫర్ ఒక మంచి అవకాశం ఇస్తుంది," అని అమీ కోల్‌మన్ పేర్కొన్నారు.

సాధారణంగా లే-ఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) సమయంలో ఇచ్చే సెవరెన్స్ ప్యాకేజీ తరహాలోనే, ఈ వాలంటరీ ఎగ్జిట్​ ఎంచుకునే వారికి కూడా అంతే స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

ఏఐ రేసు.. మారుతున్న ఐటీ స్వరూపం!

2022లో చాట్‌జీపీటీ రూపంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ భారీగా ఏఐ మౌలిక వసతులు, డేటా సెంటర్లపై వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. 2022 నుంచి ఏఐపై విపరీతంగా ఖర్చు చేస్తుండటంతో, ఇతర విభాగాలలో కొత్త నియామకాలపై కోతలు పడుతున్నాయి.

జూన్ నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,23,000గా ఉంది.

కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా గూగుల్, మెటా వంటి ఇతర బిగ్ టెక్ కంపెనీలు కూడా తమ బడ్జెట్‌లను ఏఐ ఇంజనీరింగ్ వైపు మళ్లిస్తూ సాంప్రదాయ ఐటీ ఉద్యోగాల సంఖ్యను వేగంగా తగ్గిస్తున్నాయి. మెటా గత రెండేళ్లలో 20,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించుకోగా, గూగుల్ కూడా గతంలో ఇలాంటి వాలంటరీ ఎగ్జిట్ పథకాలను ప్రవేశపెట్టింది.

మైక్రోసాఫ్ట్ ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న తరుణంలో, ఏఐపై పెడుతున్న భారీ పెట్టుబడులు కంపెనీకి ఎంతవరకు లాభాలను తెచ్చిపెడుతున్నాయనే దానిపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ తాజా వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ వార్త అనంతరం అమెరికా స్టాక్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ స్టాక్ స్వల్పంగా 1% లాభపడింది.

కాగా కంపెనీ వీడటానికి సిద్ధపడే సీనియర్ ఉద్యోగుల్లో అత్యంత ముఖ్యమైన ప్రతిభావంతులు ఉంటే, వారిని నిలుపుకునేందుకు మైక్రోసాఫ్ట్ ప్రత్యేకంగా ప్రయత్నిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More