Azharuddin Siraj: మహమ్మద్ సిరాజ్‌పై వేటు- మంత్రి అజారుద్దీన్ అసహనం- దేశం కోసం ఎప్పుడు ముందున్నాడు, ఆదుకున్నాడంటూ!

Mohammad Azharuddin On Mohammed Siraj Exclusion: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టు నుంచి మహ్మద్ సిరాజ్‌ను తప్పించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టుకు అవసరమైన ప్రతిసారీ అండగా నిలిచిన సిరాజ్‌కు తగిన గౌరవం దక్కలేదని మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published on: Nov 21, 2026, 13:28:15 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mohammad Azharuddin On Mohammed Siraj Exclusion: న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో భారత తుది జట్టు ఎంపిక ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనుభవజ్ఞుడైన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడాన్ని మాజీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

మహమ్మద్ సిరాజ్‌పై వేటు- మంత్రి అజారుద్దీన్ అసహనం- దేశం కోసం ఎప్పుడు ముందున్నాడు, ఆదుకున్నాడంటూ!
మహమ్మద్ సిరాజ్‌పై వేటు- మంత్రి అజారుద్దీన్ అసహనం- దేశం కోసం ఎప్పుడు ముందున్నాడు, ఆదుకున్నాడంటూ!

గురువారం (నవంబర్ 19) బేసిన్ రిజర్వ్ మైదానంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సిరాజ్ స్థానంలో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌కు అవకాశం ఇవ్వడంపై మాజీ కెప్టెన్, తెలంగాణ మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు.

సిరాజ్ పట్ల వివక్ష తగదు: అజారుద్దీన్

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన అజారుద్దీన్, తన నగరానికి చెందిన పేసర్‌కు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేని సమయాల్లో సిరాజ్ ఒంటిచేత్తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

"భారత జట్టులో మహ్మద్ సిరాజ్ లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. బుమ్రా అందుబాటులో లేని క్లిష్ట సమయాల్లో సిరాజ్ తన అంకితభావం, పోరాట పటిమతో జట్టును ఆదుకున్నాడు. దేశం కోసం ఎప్పుడూ ముందుండి బాధ్యత తీసుకున్నాడు. యువ ఆటగాడు కాంబోజ్‌కు నా శుభాకాంక్షలు చెబుతూనే, సిరాజ్ విషయంలో మేనేజ్‌మెంట్ మరింత బాధ్యతగా ఆలోచించాల్సిందని భావిస్తున్నాను. కనీసం ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని సిరాజ్‌కు స్పష్టంగా, గౌరవప్రదంగా వివరించి ఉంటారని ఆశిస్తున్నాను" అని అజారుద్దీన్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

గవాస్కర్, రవిశాస్త్రి సైతం విస్మయం

అజారుద్దీన్ కంటే ముందే భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి సైతం సిరాజ్‌ను పక్కన పెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌లోని బౌన్సీ పిచ్‌లపై సిరాజ్ లాంటి అనుభవజ్ఞుడైన బౌలర్ జట్టుకు ఎంతో అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"సిరాజ్ అంకితభావాన్ని ఎవరూ ప్రశ్నించలేరు" అని గవాస్కర్ స్పష్టం చేశారు. మరోవైపు "సిరాజ్ అనుభవం, దూకుడు, బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యాన్ని విస్మరించలేం" అని మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. గత ఏడాది ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో అద్భుత ప్రదర్శనతో భారత్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సిరాజ్‌ను ఇలా హఠాత్తుగా పక్కన పెట్టడం అభిమానులకు మింగుడుపడటం లేదు.

తొలి రోజు కివీస్ పోరాటం.. నికోల్స్ సెంచరీ

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.

బుమ్రా ధాటికి న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ (0), డారిల్ మిచెల్ (1), టామ్ బ్లండెల్ (5) పెవిలియన్ బాట పట్టారు. యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ డెవాన్ కాన్వే (4) వికెట్ తీయగా, ఆకాశ్ దీప్ రచిన్ రవీంద్ర (15)ను అవుట్ చేశాడు. దీంతో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

5 వికేట్లకు 243 పరుగులు

అయితే ఆ దశలో క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఆరో వికెట్‌కు వీరిద్దరూ అభేద్యంగా 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. నికోల్స్ (113 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగగా, ఫిలిప్స్ (94 నాటౌట్) సెంచరీకి చేరువయ్యాడు.

దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలను విడదీసే సిరాజ్ లాంటి బౌలర్ జట్టులో ఉండి ఉంటే కివీస్ ఇంతలా కోలుకునేది కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.