తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12 తర్వాత రాజ్ భవన్ లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

ఏ శాఖ…?
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తిరంగా మారింది. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అయితే అలా కాకుండా మరేదైనా కీలక శాఖ కూడా అప్పగించే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహముద్ అలీ హోంశాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.
అజారుద్దీన్ ప్రమాణస్వీకారంతో ప్రస్తుత కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా 16 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో మరో ఇద్దరు సభ్యులకు ఇంకా అవకాశం ఉంది.
ఇక రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతోంది. ఇక్కడ భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్ల ఆధారంగా గెలుపోటములు డిసైడ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ గెలవటం అధికార కాంగ్రెస్ కు అతిపెద్ద సవాల్ గా మారింది. పైగా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. దీంతో ముస్లింల ఓట్లు ఏటువైపు ఉంటాయన్న ఆందోళన కూడా ఉంది. అయితే అజారుదీన్ కు కేబినెట్ లోకి తీసుకోవటం వల్ల పార్టీకి లాభం చేకూరవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక అజారుద్దీన్ పేరును కాంగ్రెస్ పార్టీ మరో కోణంలో కూడా ఎంపిక చేసిందన్న చర్చ కూడా వినిపిస్తోంది. బీహార్ ఎన్నికల వేళ ఈ నిర్ణయం కలిసిరావొచ్చని కూడా అంచనా వేసినట్లు తెలుస్తోంది.
గత ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ ను శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా నామినేట్ చేసింది. అయితే గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇంకా ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే అజారుద్దీన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ చివరికి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారైంది. అయితే ఆయనకు కేబినెట్ చోటు కల్పించటంపై హామీ ఇవ్వటంతో… వెనక్కి తగ్గారనే చర్చ కూడా వినిపించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

