జూబ్లీహిల్స్ నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం - కేటీఆర్
కాంగ్రెస్ మోసాలకు ప్రజలు చెక్ పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారుయ జూబ్లీహిల్స్ నుంచి బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 11న జరిగే పోలింగ్‌లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు.
రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పలువురు బీజేపీ నేతలు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయని గుర్తుచేశారు. 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 కే భోజనం, పింఛన్లు, రంజాన్ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను కూడా తీసేశామని వివరించారు.
“పేదలను కడుపులో పెట్టుకొని కేసీఆర్ చూసుకున్నారు. షేక్‌పేటలో పెద్ద ఫ్లైఓవర్‌ను నిర్మించాం. జీహెచ్‌ఎంసీలో, హైదరాబాద్‌లో ప్రతి ఎన్నికలోనూ ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసింది. వృద్ధులు, రైతులు, మహిళలు అందరిని కాంగ్రెస్ మోసం చేసింది” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మేం మోసపోయాం.. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోవద్దు. అరచేతిలో స్వర్గం చూపిస్తే ఊళ్లలో కొందరు మోసపోయారు. అందుకే గ్రామాల నుంచి రైతులు, ప్రజలు వచ్చి జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తామని చెబుతున్నారు" అని కేటీఆర్ అన్నారు.
"18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ. 2500 ఇస్తామని చెప్పారు. యువతులకు స్కూటీలు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాం అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షనే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. రెండేళ్లలో రేవంత్ ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక కొత్త పునాది లేదు. తెల్లారి లేస్తే మైకు పట్టుకొని కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు" అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
"ఏదైనా అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చాం కదా అని చెబుతున్నారు. ఆడవాళ్లకు ఫ్రీ ఇస్తున్నారు.. మగవాళ్లకు డబుల్ రేటు పెట్టారు. కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇంటికి వస్తే బాకీ కార్డు చూపించి ప్రజలు హామీ గురించి ప్రశ్నించాలి" అని కేటీఆర్ కోరారు.
“కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే చిన్న షాక్ ఇవ్వాల్సిందే.. లేదంటే వాళ్లు దారికి రారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మేం ఏం చేయకపోయినా.. మోసం చేసినా మాకే ఓటేస్తున్నారని వాళ్లు భావిస్తారు. ఇన్ని రకాలుగా మోసం చేసినా.. మళ్లీ మాకే ఓటేస్తున్నారంటే మేమే కరెక్ట్ అని వాళ్లు అనుకుంటారు” అని కేటీఆర్ హెచ్చరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

