MS Dhoni Mentor: ముగిసిన ధోనీ శకం.. ఐపీఎల్‌కు గుడ్‌బై.. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్
MS Dhoni Mentor: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్ ఎంతోకాలంగా భయపడుతున్న క్షణం రానే వచ్చింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా ఐపీఎల్‌కు అధికారికంగా వీడ్కోలు పలికారు. ఐపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా విడుదల కావడానికి సరిగ్గా గంట ముందు మంగళవారం (నవంబర్ 17) సీఎస్కే యాజమాన్యం ఈ ప్రకటన చేసింది.
MS Dhoni Mentor: ఐపీఎల్ కు కూడా ధోనీ గుడ్ బై చెప్పేశారు. ప్లేయర్ గా ఇక ధోనీ ఫీల్డ్ లో కనిపించరు. అయితే ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ, ధోని చెన్నై జట్టును వీడి వెళ్లడం లేదు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆయన చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా సరికొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.

‘ధోని లేని సీఎస్కే లేదు’: ఎన్. శ్రీనివాసన్ భావోద్వేగ సందేశం
2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు అన్నీ తానై నిలిచిన ధోని.. ఆ జట్టుకు తిరుగులేని వారసత్వాన్ని నిర్మించారు. ధోని రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా సీఎస్కే ఓనర్ ఎన్. శ్రీనివాసన్ భావోద్వేగపూరిత ప్రకటన విడుదల చేశారు.
"ఎంఎస్ ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా విజయాలు, పరాజయాలు.. ఇలా ప్రతి మలుపులోనూ మేము కలిసి నడిచాము. మా బంధం ఇంత బలంగా ఉండటానికి ఒకే ఒక్క కారణం నమ్మకం. 2008లో ధోని కచ్చితంగా సీఎస్కేలో ఉండాలని నేను పట్టుబట్టాను. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అదే. కేవలం ఆయన సాధించిన ట్రోఫీల వల్ల కాదు, ఆయనొక అద్భుతమైన వ్యక్తి కాబట్టే మా జట్టు గుర్తింపులో ధోని ఎప్పటికీ భాగమై ఉంటారు. చెన్నై ఎల్లప్పుడూ ఆయన ఇల్లు" అని శ్రీనివాసన్ కొనియాడారు.
మైదానంలో పసుపు జెర్సీలో ధోనిని మిస్ అవుతామని, అయితే డగౌట్ నుంచి కుర్రాళ్లకు ఆయన మార్గనిర్దేశం చేయనుండటం సంతోషంగా ఉందని సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.
గాయాల వేధింపు, మెడికల్ టెస్టుల తర్వాతే తుది నిర్ణయం
గత రెండేళ్లుగా ధోని మైదానంలో కనిపించడం తగ్గిపోవడంతో ఆయన రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ధోని చివరిసారిగా ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడి 14 మ్యాచ్‌లలో 196 పరుగులు చేశారు. ఆ తర్వాత ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి గాయం కారణంగా ఆయన దూరమయ్యారు.
ఐపీఎల్ కఠినమైన షెడ్యూల్‌ను తన శరీరం తట్టుకోగలదో లేదో తెలుసుకోవడానికి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని నెల రోజుల క్రితం ధోని స్వయంగా వెల్లడించారు. ఆ పరీక్షల అనంతరం ఆటగాడిగా కొనసాగడం సాధ్యం కాదని తేలడంతో, జట్టు ప్రయోజనాల దృష్ట్యా మెంటార్‌గా మారేందుకు ఆయన నిర్ణయించుకున్నారు.
తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు: ఐపీఎల్ చరిత్రలో ‘తలా’ ముద్ర
ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మతో కలిసి అత్యధికంగా 5 టైటిళ్లు గెలిచిన జాయింట్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోని నిలిచారు. కనీసం 100 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్లలో అత్యధిక గెలుపు శాతం (57.87%) ధోని పేరిటే ఉంది.
ధోనీ మొత్తంగా 278 మ్యాచ్ లు ఆడి 5439 రన్స్ చేశారు. కెప్టెన్ గా 235 మ్యాచ్ లు ఆడటం విశేషం. అందులో 136 విజయాలు సాధించారు. ఐపీఎల్లో 2010, 2011, 2018, 2021, 2023లో ట్రోఫీలు అందుకున్నారు.
బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా, అసాధారణ వ్యూహకర్తగా మైదానంలో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన ఎంఎస్ ధోని.. ఇకపై ఐపీఎల్ 2027లో మెంటార్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరో టైటిల్ దిశగా ఎలా నడిపిస్తారో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


