ముంబైలో ఘోరం.. ప్రజలపైకి దూసుకెళ్లిన బస్సు- నలుగురు దుర్మరణం
ముంబైలోని భాండూప్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనక్కి వస్తున్న 'బెస్ట్' బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో రద్దీగా ఉండే భాండూప్ సబర్బన్ రైల్వే స్టేషన్ వెలుపల బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో డ్రైవర్ రివర్స్ చేస్తుండగా, ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి అక్కడే నిలబడి ఉన్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.

ముంబై బస్సు ప్రమాదం జరిగిన తీరు..
విఖ్రోలి డిపోకు చెందిన ఈ ఎలక్ట్రిక్ బస్సు (రూట్ నంబర్ ఏ 606) భాండూప్ వెస్ట్ స్టేషన్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో ఉంది. 52 ఏళ్ల డ్రైవర్ సంతోష్ రమేష్ సావంత్ బస్సును వెనక్కి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనతో అక్కడ హాహాకారాలు మిన్నంటాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం డ్రైవర్ సంతోష్ సావంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌తో పాటు కండక్టర్ భగవాన్ భావు ఘరే కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
ముంబై బస్సు ప్రమాదానికి కారణం ఏంటి?
భాండూప్ వెస్ట్ స్టేషన్ వద్ద బస్సులు తిరగడానికి తగినంత స్థలం లేకపోయినప్పటికీ, బస్సుల కొరత కారణంగా అధికారులు ఒలెక్ట్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులను అక్కడ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బస్సు ప్రమాదం కేవలం డ్రైవర్ పొరపాటో లేదా యాంత్రిక లోపమో కాదు.. దాని వెనుక వ్యవస్థీకృత లోపాలు కూడా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భాండూప్ రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న రహదారి ఆ శివారు ప్రాంతంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రదేశమని స్థానిక పోలీస్ అధికారి ఒకరు వివరించారు. ఈ ప్రాంతంలో ఫుట్‌పాత్‌ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటమే తాజా ప్రమాదానికి ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. రోడ్డు పక్కన ఉండాల్సిన ఫుట్‌పాత్‌లన్నీ వీధి వ్యాపారుల కబ్జాలో ఉన్నాయని ఆరోపించారు. "నడవడానికి దారి లేక ప్రయాణికులంతా రోడ్డు మధ్యలోకి వస్తున్నారు. ఫుట్‌పాత్‌లు ఖాళీగా ఉంటే అసలు ఈ ప్రాణనష్టం జరిగేదే కాదు," అని వారు పేర్కొన్నారు.
భాండూప్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న సైమిని ముదలియార్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. స్టేషన్ వెలుపల ఉండే విపరీతమైన రద్దీ, హాకర్ల వల్ల బస్సులు యూ-టర్న్ తీసుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతుందని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ఆమె తెలిపారు.
రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన..
ఈ ముంబై బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
"ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను," అని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలపై విపక్షాల విమర్శలు..
ఈ బస్సు ప్రమాదంపై ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎంపీ వర్షా గైక్వాడ్ మండిపడ్డారు. ముంబైకి గర్వకారణమైన 'బెస్ట్' వ్యవస్థను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని ఆమె ఆరోపించారు.
"ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన 'వెట్ లీజింగ్' మోడల్ వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజా రవాణాను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల ముంబై ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి," అని ఆమె విమర్శించారు.
ముంబై బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
'బెస్ట్' బస్సుల వల్ల జరుగుతున్న ప్రమాదాలకు డిసెంబర్ నెల శాపంగా మారింది. గతేడాది డిసెంబర్ 9న కుర్లాలో జరిగిన బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో 9 మంది మరణించగా, 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత, మళ్లీ అదే డిసెంబర్లో మరో ఘోర ప్రమాదం జరగడం ముంబై ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


