...
...
Next Story

నెలకు రూ. 30 వేల జీతం.. ఇప్పుడు రోజుకు లక్షల్లో సంపాదన: మిలన్ ర్యాంప్‌పై..

ముంబైలో సివిల్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించి, నెలకు 30 వేల రూపాయల జీతానికి పనిచేసిన శుభమ్ వైద్కర్.. ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ 'అర్మానీ'కి మోడల్‌గా మారి లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఒక సాధారణ యువకుడి అసాధారణ ప్రయాణం ఇది.

Published on: Feb 10, 2026, 16:43:16 IST
Advertisement

ముంబైలోని తరగతి గదుల నుంచి పారిస్, మిలన్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ నగరాల ర్యాంప్‌ల వరకు.. శుభమ్ వైద్కర్ ప్రయాణం ఒక సినిమాను తలపిస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని, ఆఫీసు ఫైళ్లతో కుస్తీ పట్టాల్సిన ఈ 24 ఏళ్ల యువకుడు.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ 'జార్జియో అర్మానీ' (Giorgio Armani) కి మోడల్‌గా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్ మార్చిన జీవితం

నెలకు రూ. 30 వేల జీతం.. ఇప్పుడు రోజుకు లక్షల్లో సంపాదన: మిలన్ ర్యాంప్‌పై.. (Instagram/@shubham_vaidkar)
నెలకు రూ. 30 వేల జీతం.. ఇప్పుడు రోజుకు లక్షల్లో సంపాదన: మిలన్ ర్యాంప్‌పై.. (Instagram/@shubham_vaidkar)

ముంబైలో పుట్టి పెరిగిన శుభమ్.. సివిల్ ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ఉన్నప్పుడు కేవలం సరదా కోసం మోడలింగ్‌పై దృష్టి పెట్టాడు. "చాలా యాదృచ్ఛికంగా ఇది జరిగింది. ఒకరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో మోడలింగ్‌కు సంబంధించిన రీల్ చూసి, నాకూ ఆసక్తి కలిగింది. అప్పట్లో నేను 84 కిలోల బరువుతో కాస్త లావుగా ఉండేవాణ్ణి. అసలు మోడల్ ఎలా అవ్వాలో గూగుల్‌లో వెతికి, కొన్ని ఏజెన్సీలకు నా ఫోటోలు పంపాను" అని శుభమ్ తన ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నాడు.

అయితే, ఒక ఏజెన్సీ అతన్ని కలిసి.. మోడల్ అవ్వాలంటే బరువు తగ్గాలని స్పష్టంగా చెప్పింది. పట్టుదలతో శ్రమించిన శుభమ్, కేవలం నెల రోజుల్లోనే బరువు తగ్గి ఆ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఇంజనీరింగ్ ఉద్యోగం నుంచి రాజీనామా వరకు

చదువు పూర్తయ్యాక శుభమ్ ఒక సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాడు. అప్పట్లో అతని జీతం నెలకు కేవలం రూ. 30,000 (ఏడాదికి రూ. 3.6 లక్షలు). ఓవైపు ఉద్యోగం చేస్తూనే మోడలింగ్‌ను కొనసాగించాడు. జనవరి 2024లో మొదటిసారి అర్మానీ షో కోసం ఇటలీలోని మిలన్ నగరం వెళ్లే అవకాశం వచ్చింది. విదేశాలకు వెళ్లడం అతనికి అదే మొదటిసారి. ఆ తర్వాత మోడలింగ్‌లో అవకాశాలు పెరగడంతో, ఆరు నెలల క్రితం తన ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి మోడల్‌గా మారిపోయాడు.

ఆదాయం.. అక్షరాలా లక్షల్లో!

వచ్చిన ఆదాయంలో 30 శాతం ఏజెన్సీ కమీషన్‌గా తీసుకుంటుందని, మిగిలిన 70 శాతం మోడల్‌కు దక్కుతుందని అతను వివరించాడు. ఇప్పటివరకు ఐదుసార్లు అర్మానీ ర్యాంప్‌పై నడిచిన శుభమ్, ఒక భారీ క్యాంపెయిన్‌లో కూడా భాగమయ్యాడు.

గ్లామర్ వెనుక కఠిన శ్రమ

బయట ప్రపంచానికి మోడలింగ్ రంగం చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది కానీ, దీని వెనుక ఎంతో ఒత్తిడి ఉంటుందని శుభమ్ అంటున్నాడు. "సరైన డైట్ పాటించడం, క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేయడం ఒక ఎత్తు అయితే.. మానసిక ఒత్తిడిని తట్టుకోవడం మరో ఎత్తు. వందలాది మందిలో ఒకరిగా ఎంపికైన తర్వాత కూడా, చివరి నిమిషంలో షో నుంచి తొలగించే అవకాశాలు ఉంటాయి. అవకాశాలు లేనప్పుడు డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంది" అని మోడలింగ్‌లోని చీకటి కోణాన్ని బయటపెట్టాడు.

ముంబైలోని తన చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ తనను చూసి ఆశ్చర్యపోతుంటారని, కానీ ఈ స్థాయికి చేరడానికి పడిన కష్టం, ఎదుర్కొన్న తిరస్కరణలు తనకే తెలుసని శుభమ్ వైద్కర్ గర్వంగా చెబుతున్నాడు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe