H-1B వీసా నిబంధనలు: చిన్న ఐటీ కంపెనీలకు గడ్డుకాలమేనా? నాస్కామ్ ఆందోళన
అమెరికా హెచ్-1బి వీసా ఎంపిక ప్రక్రియలో లాటరీ పద్ధతిని రద్దు చేసి, వేతన ఆధారిత విధానాన్ని తీసుకురావాలని ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయని, నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు, అక్కడ సేవలందిస్తున్న చిన్న తరహా కంపెనీలకు గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయా? అంటే అవుననే అంటోంది ఐటీ దిగ్గజ సంస్థల సమాఖ్య 'నాస్కామ్' (Nasscom). ఇప్పటివరకు అనుసరిస్తున్న హెచ్-1బి (H-1B) వీసా లాటరీ పద్ధతిని రద్దు చేసి, అధిక వేతనాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చేలా ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న కొత్త నిబంధనలపై నాస్కామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

చిన్న కంపెనీల ప్రణాళికలు అస్తవ్యస్తం
"అకస్మాత్తుగా వేతన ఆధారిత విధానానికి మారడం వల్ల ఐటీ రంగంలో అనిశ్చితి నెలకొంటుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కంపెనీలు తమ నియామక ప్రక్రియను విద్యాసంవత్సరం, క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాయి. కొత్త నిబంధనలతో వారి పనితీరు దెబ్బతింటుంది" అని నాస్కామ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధిక వేతనం ఇచ్చే నిపుణులకే వీసాలు దక్కే అవకాశం ఉండటంతో, పరిమిత బడ్జెట్ ఉన్న చిన్న సంస్థలు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
విద్యార్థుల ఆసక్తి తగ్గే అవకాశం
ఈ మార్పు కేవలం కంపెనీలకే కాకుండా, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులపై కూడా ప్రభావం చూపుతుందని నాస్కామ్ హెచ్చరించింది. కొత్త విధానం వల్ల ఎంట్రీ లెవల్ (ప్రారంభ స్థాయి) ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. దీనివల్ల విదేశీ విద్యార్థులు అమెరికా వైపు చూడటం మానేస్తే, ఆ దేశానికే మేధో సంపత్తి పరంగా పెద్ద నష్టం వాటిల్లుతుందని విశ్లేషించింది. అమెరికా తన పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను కాపాడుకోవాలంటే ప్రతిభను గౌరవించే విధానం ఉండాలని సూచించింది.
అమలులోకి వచ్చేది ఎప్పుడు?
కొత్త హెచ్-1బి వీసా నిబంధనలు 2026, ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వీసా రిజిస్ట్రేషన్ల నుంచే ఈ కొత్త పద్ధతి వర్తిస్తుంది. అయితే, ఈ మార్పును తక్షణమే అమలు చేయకుండా దశలవారీగా చేపట్టాలని, కనీసం 2028 ఆర్థిక సంవత్సరం వరకు గడువు ఇవ్వాలని నాస్కామ్ కోరింది. అప్పుడే కంపెనీలు కొత్త నిబంధనలకు అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకోగలవని తెలిపింది.
ఐటీ వ్యవస్థకు దెబ్బ
ట్రంప్ ప్రభుత్వం వలసలను నియంత్రించే క్రమంలో భాగంగా హెచ్-1బి వీసాపై నిఘా పెంచింది. ముఖ్యంగా భారతీయుల వాటా ఎక్కువగా ఉండే ఈ వీసా విభాగంలో మార్పులు తేవడం ద్వారా స్థానిక అమెరికన్లకు ప్రయోజనం చేకూర్చాలని చూస్తోంది. కానీ, నిపుణుల అవసరమున్న ఐటీ రంగంలో ఇటువంటి కఠిన నిర్ణయాలు అంతర్జాతీయంగా ఐటీ వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉందన్నది నాస్కామ్ ప్రధాన ఆందోళన.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


