ఈసీ అంతర్గత విభేదాలపై అనుమానాలు తీర్చండి: ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల డిమాండ్
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సభ్యుల మధ్య విభేదాలు వచ్చినట్లు వెలువడిన నివేదికలపై స్పష్టత ఇవ్వాలని ఎన్‌డీఏ కూటమిలోని మూడు కీలక భాగస్వామ్య పక్షాలు కోరాయి. సందేహాలను నివృత్తి చేయాలని చిరాగ్ పాశ్వాన్, టీడీపీ, ఆర్‌ఎల్‌ఎం నేతలు డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్లు వ్యక్తంచేసిన అభ్యంతరాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఎన్‌డీఏ కూటమికి చెందిన ముగ్గురు కీలక భాగస్వామ్య పక్షాల నేతలు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందంటూ లోక్‌జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లోక్‌సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) అధినేత ఉపేంద్ర కుష్వాహా వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది?
ఇటీవల 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తమకు తెలియకుండా జారీ చేసిన పలు నిర్ణయాలు, ఉత్తర్వులపై గత 10 నెలల్లో దాదాపు 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫారమ్-6 మార్పులు, ఓటర్ల జాబితాలో పేర్ల చేరికలు-తొలగింపులు, అలాగే ఓటర్ల డేటాబేస్‌ను కేంద్రీకృతం చేయడం వంటి కీలక అంశాలపై ఈ విభేదాలు వచ్చినట్లు సదరు నివేదిక పేర్కొంది. ఈ కథనం ఆధారంగా ప్రతిపక్షాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రజల్లో నమ్మకం దెబ్బతినకూడదు: చిరాగ్ పాశ్వాన్
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రాజ్యాంగబద్ధ వ్యవస్థను సమర్థించడం తమ ఉద్దేశం కాదని, అలాగే రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేసే ఆరోపణల గురించి తాము పట్టించుకోవడం లేదని చిరాగ్ పాసవాన్ స్పష్టం చేశారు.
"ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సడలితే అది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. అందుకే ఈసీ మరింత బలంగా ప్రజల ముందుకు వచ్చి తమ వివరణ ఇవ్వాలి. ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారనే దానికి బదులివ్వాల్సిన అవసరం లేదు గానీ, సామాన్య ప్రజల మనస్సుల్లో తలనెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
పారదర్శకతే ప్రధానం: టీడీపీ, ఆర్‌ఎల్‌ఎం
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ప్రతీ ఓటరుకు తగిన సమయం, అవకాశం లభించాయని, ఏపీలో ప్రతిపక్షాలు కూడా ఈ ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలనూ రుజువు చేయలేకపోయాయని అన్నారు. అయినప్పటికీ, ఈసీలాంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థపై ప్రశ్నలు ఎదురైనప్పుడు సరైన వివరణ ఇవ్వడం ద్వారా ప్రజాస్వామిక వ్యవస్థలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఈ వివాదం ప్రజల్లో తీవ్ర అయోమయానికి దారితీసిందని ఆర్‌ఎల్‌ఎం అధినేత, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఈసీ వెంటనే స్పందించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.
ఈసీ, బీజేపీ స్పందన ఇది
ఈ వివాదంపై స్పందించిన ఎన్నికల కమిషన్, కమిషన్ సమావేశాల్లో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం సహజ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని తెలిపింది. ఎస్‌ఐఆర్ సహా నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని, ఇద్దరు కమిషనర్లు ఇచ్చిన సూచనలు నియమ నిబంధనలు మెరుగుపరచడానికేనని స్పష్టం చేసింది. ఇక అధికార బీజేపీ కూడా ఈ పరిణామాలను తేలిగ్గా తీసుకుంది. అంతర్గత చర్చల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవ్వడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతమని బీజేపీ స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


