Puducherry Elections : పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం.. ప్రీ పోల్ సర్వేలో వెల్లడి!

Puducherry Elections : పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం రానుందని ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది. 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

Published on: Mar 29, 2026, 15:50:33 IST
By , Puducherry
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఎన్డీయే 14-17, ఎస్పీయే 9-11, సినీ నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2-4, ఇతరులు 1-2 సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది.

పుదుచ్చేరి ప్రీ పోల్ సర్వే
పుదుచ్చేరి ప్రీ పోల్ సర్వే

9-11 స్థానాలు కైవసం చేసుకుని ఎన్.ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5-7, ఎస్పీఏలో భాగస్వాములైన కాంగ్రెస్ 3-5, డీఎంకే 6-8 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.

పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీయే 34-36 శాతం, ఎస్పీఏ 30-32 శాతం, టీవీకే 16-18 శాతం, ఎన్టీకే 4-6 శాతం, వీసీకే 1-3 శాతం, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు 2-5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది.

పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఈ సర్వేను 16-23 మార్చి, 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకుని, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్‌ను సేకరించారు. ఈ సర్వేలో కులం, మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే జరిగింది.

ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీయే కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా... ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోకపోవడంతో ఎస్పీఏకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్... డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీయేకు సానుకూలంగా మారాయి.

ఎన్డీయే కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తుల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ... దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండటం సానుకూలంగా మారింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీయేకూ సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎస్పీయేలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలిస్తే అవి ఎన్డీయేకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఎన్డీయే ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా? అని అడిగినప్పుడు, 55 శాతం మంది ఇస్తామని, 41 శాతం మంది ఇవ్వమని, 4 శాతం మంది చెప్పలేం అని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అభివృద్ధి చెందడం సాధ్యం కాదని నమ్ముతున్నట్లు దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పరిశీలిస్తే కేంద్రంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే కూటమిని గెలిపించుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ఎన్నికల్లో మీరు ఓటే వేసే ముందు ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తారు? అని ప్రశ్నించినప్పుడు 40 శాతం మంది అభ్యర్థి, 30 శాతం మంది పార్టీ, కులం, మతానికి 10 శాతం, డబ్బు 10 శాతం, మిగిలినవారు ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు 62 శాతం మంది ఎన్. రంగస్వామికి మద్దతిచ్చారు. దీంతో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రధాన అంశం... ఏమిటని ప్రశ్నించినప్పుడు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేకపోవడం, అధికార యంత్రాంగంలో అవినీతి, విచ్చలవిడి మద్యం అమ్మకాలు ప్రధాన సమస్యలు అని ఈ సర్వేలో ప్రజలు వెల్లడించారు.

రాష్ట్ర హోదా డిమాండ్, లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, యువతలో నిరుద్యోగం, వరదలు, రోడ్ల దుస్థితి, నీటి కొరత, స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. కానీ వీటికి కౌంటర్‌గా ప్రచార వ్యూహాల్లో ఎన్డీయే సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉచిత బియ్యం, పాలు, విద్యుత్ సబ్సిడీలు, మహిళలకు నెలకు రూ. 2000 ఆర్థిక సహాయం వంటి పథకాలతో ప్రచారం చేస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా తీసుకుని ఎస్పీయే కూటమి రాష్ట్ర హోదా, పాలనా లోపాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ప్రచారం చేస్తోంది.

మరోవైపు టీవీకే యువతను ఆకర్షించే ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తోంది. అభ్యర్థుల ఎంపికలో మత, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎన్డీయే ప్రధానంగా హిందూ ఓటర్లపై ఆధారపడి, వ్యూహాత్మకంగా మైనారిటీ అభ్యర్థులను కూడా నిలబెట్టింది. ఎస్పీయేకి క్రైస్తవులు, ముస్లింలలో బలమైన మద్దతు ఉంది. ఎన్టీకే 50 శాతం మహిళలకు టికెట్లు కేటాయించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో స్థానిక అంశాలు, అభ్యర్థుల బలం, ఓట్ల విభజన వంటి అంశాలే ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయేకి స్వల్ప ఆధిక్యం తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అభ్యర్థులు ఉపసంహరణ చివరి తేది అయిన మార్చి 16 నుంచి 23వ తేది వరకు ఈ సర్వే నిర్వహించడం జరిగింది. రానున్న 10 రోజుల్లో సంభవించే రాజకీయ పరిణామాలు తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏప్రిల్ 9వ తేదిన పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలకు ముగియనున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More