NEET UG 2026 : బ్రేకింగ్ న్యూస్! మే 3న నిర్వహించిన నీట్​ యూజీ పరీక్ష రద్దు..

NEET UG 2026 : మే 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పేపర్​ లీక్ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు ఎలాంటి అదనపు భారం లేకుండా త్వరలోనే రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ఎన్టీఏ పేర్కొంది.

Published on: May 12, 2026, 12:27:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

NEET exam cancelled 2026 : దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం మే 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది విద్యార్థులు ఎన్నో నెలల పాటు కఠోర శ్రమతో చదువుకుని, హాజరైన ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల వచ్చిన పేపర్​ లీక ఆరోపణలే ఇందుకు కారణం. భారత ప్రభుత్వ ఆమోదంతో, దర్యాప్తు సంస్థలు అందించిన సమగ్ర సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

గురుగ్రామ్​లోని ఒక నీట్​ ఎగ్జామ్ సెంటర్.. (HT_PRINT)
గురుగ్రామ్​లోని ఒక నీట్​ ఎగ్జామ్ సెంటర్.. (HT_PRINT)

నీట్​ యూజీ 2026 రద్దు- ఆ నివేదికతో సంచలనం..

మే 10న విడుదల చేసిన పత్రికా ప్రకటనకు కొనసాగింపుగా ఎన్టీఏ తాజా వివరాలను వెల్లడించింది. పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని మే 8వ తేదీనే ఎన్టీఏ కేంద్ర ఏజెన్సీలను కోరింది. చట్టాల అమలు సంస్థలు సేకరించిన ఆధారాలు, దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలను ఎన్టీఏ విశ్లేషించింది. ఈ క్రమంలో, మే 3న జరిగిన పరీక్షా ప్రక్రియ విశ్వసనీయత దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. దీనితో నీట్​ యూజీ 2026 పరీక్షను రద్దు చేయడం మినహా మరో మార్గం లేదని ప్రభుత్వం భావించింది.

నీట్​ యూజీ 2026 రద్దు- సీబీఐ విచారణకు ఆదేశం..

ఈ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులను, వ్యవస్థలోని లోపాలను గుర్తించేందుకు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కి అప్పగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. విచారణలో భాగంగా సీబీఐకి కావాల్సిన అన్ని రికార్డులను, డాక్యుమెంట్లను అందజేయడానికి, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించడానికి ఎన్టీఏ సిద్ధమైంది.

నీట్​ యూజీ 2026 రద్దు- విద్యార్థుల కోసం ప్రత్యేక వెసులుబాట్లు..

పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే అసౌకర్యంపై ఎన్టీఏ స్పందించింది. పరీక్షల పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ, విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అవి..

మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు: మే 2026 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల డేటా, అభ్యర్థిత్వం, వారు గతంలో ఎంచుకున్న పరీక్షా కేంద్రాల వివరాలు అలాగే కొనసాగుతాయి.

అదనపు ఫీజు లేదు: తిరిగి నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు పరీక్షా రుసుము వసూలు చేయరు.

ఫీజు రీఫండ్: అభ్యర్థులు ఇప్పటికే చెల్లించిన ఫీజును రీఫండ్ చేయాలని ఎన్టీఏ నిర్ణయించింది. మళ్లీ నిర్వహించే పరీక్ష ఖర్చులను ఎన్టీఏ తన సొంత వనరుల నుంచే భరిస్తుంది.

రీ-ఎగ్జామ్ నిర్వహించే కొత్త తేదీలను, అడ్మిట్ కార్డుల జారీ షెడ్యూల్‌ను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్, ఛానెళ్ల ద్వారా వచ్చే సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.

మే 3న జరిగిన నీట్​ యూజీ పరీక్షకు 22.79లక్షల మంది రిజిస్టర్​ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లో 14 ప్రాంతాల్లో, మొత్తం మీద 5,432 సెంటర్లలో ఈ పరీక్ష జరిగింది. మే 6న నీట్​ యూజీ ఆన్సర్​ కీని కూడా ఎన్టీఏ విడుదల చేసింది. కానీ ఇప్పుడు పరీక్ష మొత్తానికే రద్దు అయిపోయింది.

దిల్లీలో నిరసనలు..

నీట్​ యూజీ 2026 రద్దు గురించి ఎన్టీఏ ప్రకటించిన కొద్దిసేపటితే దేశ రాజధాని దిల్లీలో నిరసనలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పరీక్ష ప్రక్రియలో పారదర్శకతకు డిమాండ్​ చేస్తూ ఎన్​ఎస్​యూఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్​ ఇండియా) ఆందోళనలు చేపట్టింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More