NEET UG Re Exam 2026 : నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులు.. త్వరలోనే!
జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామ్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులకు అనుకూలంగా ఉండే పలు కీలక మార్పులను ప్రకటించింది. అంతేకాదు ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు సైతం త్వరలోనే విడుదలకానున్నాయి.
మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష ‘నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ ’ రాసే విద్యార్థులకు ఊరటనిచ్చేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 21న (జూన్ 21, 2026) జరగబోయే నీట్ యూజీ రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేలా సరికొత్త మార్పులను ప్రవేశపెట్టింది. పరీక్షను అత్యంత పారదర్శకంగా, పటిష్టమైన భద్రతతో పాటు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

పెరిగిన పరీక్ష సమయం.. ఇక టెన్షన్ లేదు!
అధికారిక ప్రకటన ప్రకారం.. నీట్ యూజీ రీ-ఎగ్జామ్ సింగిల్ షిఫ్ట్‌లో మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. గతంతో పోలిస్తే ఈసారి పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు అదనంగా పెంచారు. పరీక్షా కేంద్రంలో హాజరు పట్టికపై సంతకాలు చేయడం, బయోమెట్రిక్ నమోదు వంటి తప్పనిసరి అధికారిక ప్రక్రియల వల్ల విద్యార్థుల సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఈ అదనపు సమయాన్ని కేటాయించారు. దీనివల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్ష రాయడానికి వీలవుతుంది.
రఫ్ వర్క్ కోసం డబుల్ పేజీలు.. ఎడమచేతి వాటం వారికి పెద్ద ఊరట!
ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్కలు చేయడం కోసం క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్‌లో ఇచ్చే రఫ్ వర్క్ స్థలాన్ని కూడా ఎన్టీఏ పెంచింది. ఇప్పటివరకు కేవలం 2 పేజీలు మాత్రమే ఉండగా.. ఈసారి వాటిని 4 పేజీలకు పెంచారు. దీనివల్ల డయాగ్రామ్‌లు వేసుకోవడానికి, లెక్కల క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి విద్యార్థులకు తగినంత స్థలం దొరుకుతుంది.
అంతేకాదు, బుక్‌లెట్ డిజైన్‌లో ఒక అద్భుతమైన మార్పు చేశారు. ఎడమచేతి వాటం ఉన్న అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. 4 రఫ్ పేజీలలో 2 పేజీలను బుక్‌లెట్ ప్రారంభంలో (ఇన్‌స్ట్రక్షన్ పేజీ తర్వాత), మిగిలిన 2 పేజీలను బుక్‌లెట్ చివరన కేటాయించారు. ఇంగ్లీష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాషల క్వశ్చన్ పేపర్లలోనూ ఈ కొత్త లేఅవుట్‌ను అమలు చేస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన పేజీని రఫ్ వర్క్ కోసం ఉపయోగించుకోవచ్చు.
"పెద్ద పరీక్షలు రాసేటప్పుడు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. పరీక్ష విధానంలో చేసే చిన్నపాటి మార్పులైనా వారిపై సానుకూల ప్రభావం చూపుతాయని ఎన్టీఏ బలంగా నమ్ముతోంది. అందుకే భద్రతా ప్రమాణాలు ఎక్కడా తగ్గకుండా, విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఈ మార్పులు చేశాము," అని ఎన్టీఏ తన ప్రెస్ నోట్‌లో పేర్కొంది.
త్వరలోనే అడ్మిట్ కార్డులు విడుదల..
నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్‌లను ఎన్టీఏ ఇప్పటికే విడుదల చేసింది. అభ్యర్థులు జూన్ 14 లోపు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత మే 3న జరిగిన నీట్ ప్రధాన పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఆ పరీక్షను రద్దు చేసి, ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళన, అలసట, పరీక్షపై నమ్మకం కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కష్టసమయంలో ఎన్టీఏ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పులు విద్యార్థులకు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయని విద్యా రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించవచ్చు.
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


