Nepal floods : నేపాల్‌లో విలయం- 275 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భయానక ఆకస్మిక వరదల్లో 275 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభించలేదు. కాగా 166మందిని ఇప్పటివరకు సురక్షింతా రక్షించారు. సహాయక చర్యల వివరాలను విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది.
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఆగస్టు 26న మంచుకొండలు విరిగిపడటంతో ఒక్కసారిగా ఆకస్మాత్తుగా ఉప్పొంగిన ప్రళయ వరదలు హిమాలయ లోయలను అతలాకుతలం చేశాయి. ఈ జలప్రళయం సంభవించి వారం రోజులు గడిచినా బాధితుల స్థితిగతులు ఇంకా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషాద ఘటనలో చిక్కుకున్న భారతీయులకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం కీలక వివరాలను వెల్లడించింది. నేపాల్ వరదల్లో 275మంది భారతీయులు గల్లంతయ్యారని, ఇప్పటివరకు 166మంది పౌరులను రక్షించామని పేర్కొంది.

దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. "మా వద్ద ఉన్న సమగ్ర సమాచారం ప్రకారం ఇప్పటివరకు 275 మంది భారత పౌరులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం నేపాల్ ప్రభుత్వం, మన దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం," అని తెలిపారు.
అయితే, ఇప్పటివరకు 166 మంది భారతీయులను సురక్షితంగా రక్షించామని ఆయన స్పష్టం చేశారు. టిబెట్వైపు చిక్కుకున్న 1,907 మంది భారతీయ ప్రయాణికులు సురక్షితంగా నేపాల్ సరిహద్దు దాటారని, ప్రస్తుతం టిబెట్ ప్రాంతంలో ఏ ఒక్క భారతీయ పర్యాటకుడు కూడా చిక్కుకుపోలేదని అధికారులు ధ్రువీకరించినట్లు వెల్లడించారు.
నేపాల్‌కు భారత్ భారీ సహాయం..
నేపాల్ వరదల కారణంగా ఇప్పటివరకు కనీసం 1,295 మంది మరణించినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించగా, సుమారు 5,000 మందికి పైగా ఆచూకీ దొరకడం లేదని వివరించారు.
వరదల ధాటికి త్రిశూలి నది ఉప్పొంగి ప్రధాన రహదారులు, విద్యుత్ కేంద్రాలు, గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరోవైపు క్షతగాత్రులను కాపాడేందుకు, బాధితులకు అండగా నిలిచేందుకు భారత్ తక్షణమే స్పందించింది. ఇప్పటివరకు 7 ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 95 టన్నుల సహాయ సామగ్రిని నేపాల్‌కు పంపించినట్లు రణధీర్ జైస్వాల్ వివరించారు.
కేవలం సహాయ సామగ్రినే కాకుండా, రంగంలోకి నిపుణులను కూడా దించింది.
- 30 మంది టన్నెల్ రెస్క్యూ నిపుణులు: జలవిద్యుత్ ప్రాజెక్టులు, సొరంగాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు.
- 19 మంది ఫోరెన్సిక్ నిపుణులు: మృతదేహాల గుర్తింపు, డీఎన్ఏ పరీక్షల ప్రక్రియను వేగవంతం చేసేందుకు.
- 5 మంది సభ్యుల వైద్య బృందం: అత్యవసర వైద్య సేవలు అందించేందుకు.
మొత్తం 54 మంది నిపుణుల బృందం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో నేపాల్ అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటోంది. నేపాల్ విజ్ఞప్తి మేరకు రానున్న రోజుల్లో మరింత ఫోరెన్సిక్ కిట్లు, తాత్కాలిక వారధులు (బేలీ బ్రిడ్జిలు) పంపేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది.
కూలిపోయిన మౌలిక వసతులు..
నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ ప్రళయం వల్ల 32,000 మందికి పైగా ప్రజలు, వారి ఆస్తులు దెబ్బతిన్నాయి. మౌలిక సదుపాయాలు ఘోరంగా ధ్వంసమయ్యాయి:
- 35 వాహన రహదారి వంతెనలు పూర్తిగా కొట్టుకుపోయాయి.
- 45 ప్రధాన సస్పెన్షన్ వంతెనలు తెగిపోయాయి.
- 40 కిలోమీటర్ల మేర బిటుమిన్ (తార్) రహదారులు దెబ్బతిన్నాయి.
ఇప్పటివరకు 12,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడటం, నదీ ప్రవాహాలు ఉధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది.
నేపాల్ వరదలకు సంబంధించిన ఆస్తి నష్టంపై పూర్తిస్థాయి నివేదిక వెలువడాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


