అమెరికాలో తుఫాన్ బీభత్సం: నీటమునిగిన న్యూజెర్సీ తీర పట్టణాలు

థ్యాంక్స్ గివింగ్ పండుగ వేళ అమెరికా తూర్పు తీరాన్ని 'నార్‌ఈస్టర్' తుఫాన్ ముంచెత్తింది. న్యూజెర్సీలోని పోర్ట్ నోరిస్, ఓషన్ సిటీ, స్టోన్ హార్బర్ పట్టణాలు నీటమునిగాయి. పలు చోట్ల 2012 శాండీ తుఫాన్ రికార్డులను దాటి సముద్రపు నీరు పోటెత్తింది.

Published on: Nov 27, 2026, 07:05:53 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అమెరికా తూర్పు తీర ప్రాంతాలను శక్తిమంతమైన 'నార్‌ఈస్టర్' తుఫాన్ అతలాకుతలం చేసింది. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే థ్యాంక్స్ గివింగ్ పండుగ సంబరాలను ఈ ఆకస్మిక వరదలు నీరుగార్చాయి. తుఫాన్ ప్రభావంతో న్యూజెర్సీ, న్యూయార్క్, మేరీల్యాండ్, వర్జీనియా, డెలావేర్, వాషింగ్టన్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు తూర్పు ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో తీవ్ర వరదలు ముంచెత్తాయి. వీటిలో న్యూజెర్సీ రాష్ట్రం అత్యధికంగా ప్రభావితమైంది. అక్కడి ప్రధాన పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వీధులు, నివాసాలు, వ్యాపార సముదాయాల్లోకి భారీగా వరద నీరు చేరింది.

అమెరికాలో తుఫాన్ బీభత్సం: నీటమునిగిన న్యూజెర్సీ తీర పట్టణాలు (@Zeke_O on X)
అమెరికాలో తుఫాన్ బీభత్సం: నీటమునిగిన న్యూజెర్సీ తీర పట్టణాలు (@Zeke_O on X)

అట్లాంటిక్ మహాసముద్ర తీరం వెంబడి ఏర్పడే నార్‌ఈస్టర్ తుఫాన్లు బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలు, సముద్రపు అలల ఉద్ధృతిని తీసుకొస్తాయి. తాజా తుఫాన్ ముప్పును పసిగట్టిన నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యూఎస్) న్యూజెర్సీలోని అట్లాంటిక్, కేప్ మే, అట్లాంటిక్ కోస్టల్ కేప్ మే, కోస్టల్ అట్లాంటిక్, ఆగ్నేయ బర్లింగ్టన్ ప్రాంతాలకు మధ్యాహ్నం 3 గంటల (ఈటీ కాలమానం) వరకు వరద హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో నేల మట్టానికి మూడు అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు.

నీటమునిగిన స్టోన్ హార్బర్, ఓషన్ సిటీ వీధులు

మధ్యాహ్నం ఒంటి గంట ఈటీ సమయానికే నీటి మట్టాలు వేగంగా పెరిగి పలు పట్టణాలు నీటమునిగాయి. కేప్ మే కౌంటీలోని స్టోన్ హార్బర్ పట్టణంలో మధ్యాహ్నం నుంచే ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. గురువారం ఉదయం గంటకు 60 మైళ్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. స్టోన్ హార్బర్ వీధులు, ఫుట్‌పాత్‌లు నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాలు, ఇళ్లలోకి వరద నీరు చొచ్చుకువచ్చింది. "స్టోన్ హార్బర్ తీవ్ర వరద స్థాయికి చేరుకుంది, మరిన్ని నీళ్లు వచ్చే అవకాశం ఉంది" అని జేక్ ఓర్జెక్ నవంబర్ 26న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.

కేప్ మే కౌంటీకి మరోవైపు ఉన్న ఓషన్ సిటీలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నడుము లోతు నీటిలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓషన్ సిటీలోని బే అవెన్యూ వెంబడి వీధులను తీవ్ర తీరప్రాంత వరద ముంచెత్తినట్లు 'వెదర్ మానిటర్' విడుదల చేసిన దృశ్యాలు స్పష్టం చేశాయి.

పోర్ట్ నోరిస్‌లోనూ అదే దుస్థితి

కంబర్‌ల్యాండ్ కౌంటీలోనూ వరద ప్రభావం తీవ్రంగా కనిపించింది. పోర్ట్ నోరిస్ ప్రాంతంలో నీటి మట్టాలు అమాంతం పెరిగిపోవడంతో వీధులన్నీ చెరువులను తలపించాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాల్లోకి వరద నీరు పోటెత్తింది. "న్యూజెర్సీలోని పోర్ట్ నోరిస్‌లో భారీ తీరప్రాంత వరదలు ముంచెత్తాయి. వాహనదారులు ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరగండి, నీటిలో చిక్కుకుపోకండి" అని వాతావరణ నిపుణుడు మ్యాక్స్ వెలాసిటీ హెచ్చరించారు.

2012 శాండీ తుఫాన్ రికార్డులను దాటిన సముద్ర మట్టం

మిడ్-అట్లాంటిక్ తీరప్రాంతంలోని పలు చోట్ల సముద్రపు నీటి మట్టం గత రికార్డులను తిరగరాసింది. కొన్ని ప్రాంతాల్లో 2012 నాటి సూపర్ స్టార్మ్ 'శాండీ' తుఫాన్ సమయం కంటే ఎక్కువ ఎత్తుకు నీరు చేరినట్లు ఎన్‌బీసీ న్యూస్ నివేదించింది.

మిడ్-అట్లాంటిక్ తీరం వెంబడి వర్జీనియాలో అత్యధిక నీటి మట్టం నమోదైంది. వర్జీనియాలోని వాచాప్రీగ్‌లో సముద్రపు నీరు 9.94 అడుగుల ఎత్తుకు చేరింది. న్యూజెర్సీలోని కేప్ మేలో నీటి మట్టం 9.41 అడుగులకు ఎగబాకింది. 2012లో శాండీ తుఫాన్ తాకినప్పటి కంటే ఇది అర అడుగుకు పైగా ఎక్కువ. అట్లాంటిక్ సిటీలోనూ నీటి మట్టం 8.28 అడుగులకు చేరి, శాండీ తుఫాన్ తర్వాత కొత్త రికార్డు నమోదు చేసింది. పండుగ వేళ విరుచుకుపడిన ఈ తుఫాన్ కారణంగా తీరప్రాంత పట్టణాల్లో జనజీవనం స్తంభించగా, వరద నీరు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

Cumberland County also saw flooding, with water levels rising significantly in Port Norris. The streets were submerged, with water entering residential and commercial areas.

Also read: Macy’s Thanksgiving Day Parade in NYC postponed to Saturday due to bad weather forecast

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.