Stock market : 2ఏళ్ల ముందు 26000 దగ్గర నిఫ్టీ.. ఇప్పుడు 2900 పాయింట్లు డౌన్- ఇన్వెస్టర్ల పరిస్థితేంటి?
సరిగ్గా రెండేళ్ల క్రితం నిఫ్టీ 26,000 చారిత్రాత్మక మార్కును తాకింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత రెండేళ్లుగా నిఫ్టీ50లో రిటర్నులే లేవు! ప్రస్తుతం అమెరికా-ఇరాన్ యుద్ధం, ఆయిల్ సంక్షోభం వల్ల మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది?
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డు నమోదై సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. 2024 సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ తొలిసారిగా 26,000 చారిత్రాత్మక మైలురాయిని దాటింది. ఆ తర్వాత కూడా దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు కొనసాగి, 2026 జనవరి 2న నిఫ్టీ 26,340 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, ప్రస్తుతం దలాల్ స్ట్రీట్‌లో ఆనాటి ఉత్సాహం తగ్గుముఖం పట్టి, ప్రధాన సూచీలు తీవ్ర ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. 26,000 మార్క్ నుంచి ప్రస్తుతం నిఫ్టీ50 దాదాపు 2,900 పాయింట్లు డౌన్లో ఉంది.

ఇంకా చెప్పాలంటే.. దేశంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు గడ్డు కాలం నడుస్తోందనే చెప్పాలి!
ఆయిల్ మంటలు.. క్రూడాయిల్ కష్టాలు
ప్రస్తుతం మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం సుదీర్ఘంగా సాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం. హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బారెల్‌కు 100 డాలర్ల మార్కు దాటి స్థిరంగా కొనసాగుతోంది. ముడిచమురు ధరల భారంతో కంపెనీల తయారీ వ్యయం పెరిగిపోయి, లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం భయాలు పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) నిధులను ఉపసంహరించుకోవడంతో భారత మార్కెట్ ఇబ్బందుల్లో పడింది.
హార్ముజ్ జలసంధి ఓపెన్ అయితేనే లబ్ధి!
అమెరికా-ఇరాన్ యుద్దాన్ని మార్కెట్ ఇప్పటికే జీర్ణించుకుందని, గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ ఇలాగే జరిగిందని బాసవ్ క్యాపిటల్ కో-ఫౌండర్ సందీప్ పాండే విశ్లేషించారు.
"అమెరికా-ఇరాన్ యుద్ధం ముగియడం ఒక్కటే మార్కెట్లకు సరిపోదు. హార్ముజ్ జలసంధి తెరుచుకుని, పూర్వ స్థితికి వస్తేనే ఇంధన సంక్షోభం సమసిపోతుంది. యుద్ధం ముగిసినా ఇంధన లభ్యత సాధారణ స్థాయికి రావడం చాలా ముఖ్యం," అని సందీప్ పాండే స్పష్టం చేశారు.
అమెరికా బాండ్ ఈల్డ్స్ మ్యాజిక్ చేస్తాయా?
అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ (10-ఏళ్ల ఈల్డ్స్) విపరీతంగా పెరగడం, డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటమే ప్రస్తుత ఒత్తిడికి మరొక కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.5 శాతం లేదా 5 శాతం కంటే ఎక్కువ కాలం కొనసాగడాన్ని అమెరికా ప్రభుత్వం తట్టుకోలేదు.
రాబోయే మిడ్-టర్మ్ ఎన్నికల నేపథ్యంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ బాండ్ ఈల్డ్స్‌ను 5 శాతం నుంచి 6 శాతం మధ్య నిగ్రహించేందుకు లేదా కుదించేందుకు ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు ఉన్నాయని జెఫ్రీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ క్రిస్ వుడ్ వివరించారు. ఒకవేళ అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గి, డాలర్ బలహీనపడితే, ఆ నిధులన్నీ మళ్లీ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు పోటెత్తుతాయి.
భారత్ వైపే విదేశీ ఇన్వెస్టర్ల చూపు!
గతంలో అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభంలో ఎఫ్‌ఐఐలు భారత్‌లో షేర్లను విక్రయించి, దక్షిణ కొరియా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారని సెబీ నమోదిత విశ్లేషకుడు అనుజ్ గుప్తా గుర్తుచేశారు.
"ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మందగమనం రావడం వల్ల దక్షిణ కొరియాలోని 'కాస్పీ' తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీనితో అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గగానే, విదేశీ నిధులు నేరుగా భారత మార్కెట్లకే తరలివస్తాయి," అని అనుజ్ గుప్తా వెల్లడించారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


