నెలవారీ బడ్జెట్‌లో కొత్త సవాలు: ఏఐ ఖర్చులకూ ఒక పద్దు
ఓటీటీల డిజిటల్ విప్లవం తర్వాత భారతీయ కుటుంబాల నెలవారీ బడ్జెట్‌లో కొత్తగా ‘డిజిటల్ యుటిలిటీ’ ఖర్చులు వచ్చి చేరుతున్నాయి. ఆపిల్ ఐక్లౌడ్, గూగుల్ వన్ వంటి క్లౌడ్ స్టోరేజ్ సేవలతో పాటు చాట్‌జీపీటీ ప్లస్, క్లాడ్ ప్రొ వంటి ఏఐ టూల్స్ కోసం ఇన్వెస్టర్లు, ఉద్యోగులు ప్రతినెలా వేల రూపాయలు కేటాయిస్తున్నారు.
కరెంట్ బిల్లు, కేబుల్ టీవీ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల తరహాలోనే భారతీయ కుటుంబాల నెలవారీ బడ్జెట్‌లో మరొక కొత్త ఖర్చు వచ్చి చేరింది. అదే ‘డిజిటల్ యుటిలిటీ’ బిల్లు. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లలో డేటా నిల్వ చేసుకునే క్లౌడ్ స్టోరేజ్ సేవలతో పాటు ఆఫీసు, వ్యక్తిగత పనులను వేగంగా పూర్తి చేసే కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్ కోసం భారతీయ నిపుణులు ప్రతినెలా వేల రూపాయలు వెచ్చిస్తున్నారు.

తప్పనిసరిగా మారిన డిజిటల్ ఖర్చు
చెన్నైకి చెందిన 24 ఏళ్ల జొమాటో గ్రోత్ కన్సల్టెంట్ టీ. ప్రణవ్ ప్రతి నెలా దాదాపు రూ.2,300 వరకు ఏఐ, క్లౌడ్ సేవల కోసం ఖర్చు చేస్తున్నారు. "ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్ల కోసం డబ్బులు పెట్టాలంటే ఆలోచించేవాడిని. కానీ ఇప్పుడు నా బడ్జెట్‌లో తప్పనిసరిగా మారిన కరెంట్ బిల్లు లాంటిది" అని ప్రణవ్ వ్యాఖ్యానించారు. క్లాడ్ ప్రొ (Claude Pro), ఆపిల్ ఐక్లౌడ్ (Apple iCloud), గూగుల్ డ్రైవ్ వంటి సేవలను ఆయన క్రమం తప్పకుండా వాడుతున్నారు. "గతంలో రోజంతా పట్టే పిచ్ డెక్ తయారీ, డ్యాష్‌బోర్డ్‌ల పని ఇప్పుడు గంటలోనే పూర్తవుతోంది. సమయం ఆదా అవ్వడం కన్నా మించిన లాభం లేదనిపిస్తోంది, అని ఆయన స్పష్టం చేశారు.
ముంబైకి చెందిన 25 ఏళ్ల ఫిట్‌నెస్ ట్రైనర్ రాహుల్ కుమార్ కథ కూడా ఇంతే. తన క్లయింట్ల వర్కవుట్ షెడ్యూళ్లు, సమాచారం నిల్వ చేయడానికి నెలకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ వన్, ఐక్లౌడ్ సేవలకు వెచ్చిస్తున్నారు. "మనం ప్రతిదీ కొనుగోలు చేసే రోజుల్లో ఉన్నాం. ఉచిత వర్షన్ల ద్వారా కూడా పనులు చేసుకునే వీలున్నా, ఎక్కువ వెసులుబాటు కోసం సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటున్నారు" అని రాహుల్ తెలిపారు.
భారత్‌లో వినియోగం ఎక్కువ.. రాబడి తక్కువ
యాంత్రోపిక్ ఎకనామిక్ ఇండెక్స్ డేటా ప్రకారం, క్లాడ్ ఏఐని అత్యధికంగా వాడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఐటీ నిపుణులు, డెవలపర్లు ఏఐ సేవలను విరివిగా వాడుతుండగా, క్లౌడ్ స్టోరేజ్‌ను మాత్రం కాలేజీ విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరూ ఉపయోగిస్తున్నారు.
భారతీయ వినియోగదారుల మనస్తత్వంపై 'ఏఐ అండ్ బియాండ్' సంస్థ వ్యవస్థాపకుడు జస్ప్రీత్ బ్రాంద్రా స్పందిస్తూ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. "భారత్‌లో ప్రతి ఒక్కరికీ సేవలు ఉచితంగా కావాలి. ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులు ఉన్న మార్కెట్ భారత్ అయినప్పటికీ, రాబడి పరంగా మాత్రం చాలా చిన్న మార్కెట్‌గా ఉండిపోయింది. ఏఐ విషయంలోనూ ఇదే జరుగుతోంది" అని జస్ప్రీత్ తెలిపారు.
ఉచిత ఏఐ సేవలతో డేటా భద్రతకు ముప్పు
ఉచితంగా లభించే ఏఐ సేవలు వాడేటప్పుడు తీవ్రమైన డేటా భద్రతా ప్రమాదాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "ఉచిత వర్షన్లలో మీరే ఒక ప్రాడక్ట్ అనే విషయాన్ని గ్రహించాలి. డబ్బు చెల్లించే పెయిడ్ సేవల్లో ప్రైవసీ రక్షణతో పాటు ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. అదే ఉచిత సేవల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆ ఏఐ టూల్స్ తమ మోడళ్లను ట్రైన్ చేసుకోవడానికి వాడుకుంటాయి" అని జస్ప్రీత్ వివరించారు.
వెల్త్ క్రాఫ్ట్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకుడు వివేక్ ఎస్.జి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. "ఈ రోజుల్లో చాలామంది బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఆర్థిక వివరాలను ఉచిత ఏఐ టూల్స్‌లో అప్‌లోడ్ చేసి విశ్లేషిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. మీ ఆర్థిక డేటా ఎవరి చేతుల్లోకి వెళ్తుందో తెలియదు" అని వివేక్ హెచ్చరించారు.
అనవసర ఖర్చులకు చెక్ పెట్టే చిట్కాలు
డిజిటల్ యుటిలిటీ బిల్లులు పెరిగిపోకుండా ఉండటానికి ఫైనాన్షియల్ ప్లానర్లు కొన్ని విలువైన సూచనలు చేస్తున్నారు.
ఆటో డెబిట్ నిలిపివేయండి: బ్యాంక్ ఖాతాల నుంచి క్రమం తప్పకుండా ఆటో డెబిట్ అయ్యే సబ్‌స్క్రిప్షన్లను ఎప్పటికప్పుడు సమీక్షించండి. వాడని సేవలను వెంటనే రద్దు చేయండి.
ఒకే రకం టూల్స్ వద్దు: వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో ఒకే రకమైన సేవలు అందించే సబ్‌స్క్రిప్షన్లు తీసుకోకండి. మీకు అవసరమైన ఒకే ఒక ఉత్తమమైన సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోండి.
ఆదాయం పెరిగితేనే ప్రొ వర్షన్: సబ్‌స్క్రిప్షన్ల వల్ల సమయం ఆదా అయి, అది మీ ఆదాయాన్ని పెంచేలా ఉంటేనే పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవాలి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


