మధ్యతరగతి కుటుంబాల కోసం 7 సీటర్ ఎంపీవీ- నిస్సాన్ గ్రావిటే హైలైట్స్ ఇవి..
నిస్సాన్ నుంచి వస్తున్న సరికొత్త 7-సీటర్ ఎంపీవీ ‘గ్రావిటే’పై మంచి బజ్ నెలకొంది. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న ఈ కారు టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
భారత మార్కెట్‌పై నిస్సాన్ ఇండియా తన పట్టును మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రానున్న సంవత్సరాల్లో వరుస లాంచ్‌లను ప్లాన్ చేస్తోంది. వీటిల్లో సరికొత్త 7-సీటర్ ఎంపీవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాని పేరు నిస్సాన్ గ్రావిటే. మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ ధరలో లగ్జరీ అనుభూతిని ఈ కారు అందిస్తుందని తెలుస్తోంది. కాగా ఈ ఎంపీవీకి సంబంధించిన మోడల్ ఒకటి భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కారులోని కొన్ని కొత్త విషయాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ- ఇండియా లాంచ్..
రోడ్లపై ప్రత్యక్షమైన గ్రావిటే ఎంపీవీ.. వచ్చే ఏడాది, అంటే మార్చి 2026లో లాంచ్ అవుతుంది. అదే సమయంలో ఈ కారు ధరలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే, అఫీషియల్ లాంచ్‌కు ముందే ఈ కారు టెస్టింగ్ దశలో కెమెరా కంటికి చిక్కింది. జాతీయ రహదారిపై వెళుతున్న ఈ టెస్ట్ మోడల్‌ను వివేక్ ఆర్ అనే వ్యక్తి వీడియో తీశారు. కారు మొత్తం కామోఫ్లాజ్తో ఉన్నప్పటికీ, దీని రూపం చూస్తుంటే ఇది రెనాల్ట్ ట్రైబర్‌ను పోలి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యంలో వస్తున్న ఈ కారు సీఎంఫ్-ఏ+ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటోంది.
నిస్సాన్ గ్రావిటే- డిజైన్ ఎలా ఉండబోతోంది?
గ్రావిటే కారు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండనుంది. ముందు భాగంలో సన్నని ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, బోనెట్‌పై ‘GRAVITE’ అనే పేరు స్పష్టంగా కనిపించనున్నాయి. మధ్యలో పెద్ద గ్రిల్, సీ-షేప్ బంపర్ ఈ 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవీకి ఒక రగ్గడ్ లుక్‌ను ఇస్తున్నాయి.
నిస్సాన్ ఈ కారు కోసం ప్రత్యేకంగా ‘టీల్’ రంగును పరిచయం చేస్తోంది. అంతేకాదు స్పోర్టీ అలాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ కారుకి ఒక ఎస్‌యూవీ తరహా రాజసాన్ని జోడిస్తాయి. వెనుక వైపు కూడా సీ-షేప్ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ టచ్‌తో ప్రీమియం లుక్ ఇచ్చారు.
నిస్సాన్ గ్రావిటే- ఇంజిన్, పనితీరు..
ఈ కారులో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను వాడుతున్నారు. ఇది 76 బీహెచ్పీ పవర్‌ని, 95 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. గేర్‌బాక్స్ విషయంలో కూడా కస్టమర్లకు రెండు ఆప్షన్లు ఉండనున్నాయి. ఒకటి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, రెండోది 5-స్పీడ్ ఏఎంటీ. సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించే వారికి ఏఎంటీ వేరియంట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
నిస్సాన్ గ్రావిటే- లోపల ఫీచర్లు ఇవే..
రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లను చాలా వరకు ఈ గ్రావిటే ఎంపీవీలోనూ చూడవచ్చు. 8-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఇందులో ఉంటాయి. భద్రత విషయంలో రాజీ పడకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-వ్యూ కెమెరాను కూడా నిస్సాన్ అందిస్తోంది. నిస్సాన్ బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఇంటీరియర్ కలర్స్, సీట్ అప్‌హోల్‌స్టరీని మరింత కొత్తగా డిజైన్ చేస్తున్నారు. సెకండ్, థర్డ్- రో ప్రయాణికులకు కూడా ఏసీ వెంట్స్ ఉండటం వల్ల పెద్ద కుటుంబాలకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇక్కడ నిస్సాన్ గ్రావిటే ప్రైజింగ్ కీలకంగా మారనుంది. దేశంలో తక్కువ ధరకు లభిస్తున్న ఫ్యామిలీ ఎంపీవీల్లో రెనాల్ట్ ట్రైబర్ ఒకటి. ఈ గ్రావిటేని కూడా అందుబాటు ధరలో తీసుకొస్తే.. ఎక్కువ సీటింగ్ కెపాసిటీ, ఆధునిక ఫీచర్లు కోరుకునే భారతీయ కుటుంబాలకు ఈ నిస్సాన్ గ్రావైట్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


