ఎన్‌ఐటీ రూర్కెలాలో ప్లేస్‌మెంట్స్ జోరు.. ₹1.31 కోట్ల అత్యధిక ప్యాకేజ్
జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్‌ఐటీ) రూర్కెలా 2025-26 ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. బీటెక్ విద్యార్థి సాధించిన ₹1.31 కోట్ల అత్యధిక ప్యాకేజీతో పాటు 83 మందికి పైగా విద్యార్థులు రూ.30 లక్షలకు పైగా వార్షిక వేతనాలు దక్కించుకోవడం విశేషం.
ప్రసిద్ధ జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్‌ఐటీ) రూర్కెలా 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి మైండ్ బ్లాకింగ్ ఆఫర్లను దక్కించుకున్నారు. ఈ ఏడాది క్యాంపస్ డ్రైవ్‌లో ఒక బీటెక్ విద్యార్థి ఏకంగా రూ.1.31 కోట్ల భారీ ప్యాకేజీని సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.

బీటెక్, ఎమ్‌టెక్ ఆఫర్ల వివరాలు
బీటెక్ కోర్సులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్) విభాగానికి చెందిన విద్యార్థి రూ.83.60 లక్షల వార్షిక ప్యాకేజీని సాధించారు. బీటెక్ విభాగంలో సగటు వేతనం (Average CTC) రూ.15.33 లక్షలుగా నమోదు కాగా, మధ్యస్థ వేతనం (Median CTC) రూ.12.50 లక్షలుగా ఉంది.
మరొకవైపు ఎమ్‌టెక్ కోర్సుల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ఆఫర్లు సాధించారు. ఎమ్‌టెక్ సీఎస్ విభాగానికి చెందిన విద్యార్థికి అత్యధికంగా రూ.46.38 లక్షల ప్యాకేజీ లభించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ) విభాగంలో అత్యధికంగా రూ.44.00 లక్షల ఆఫర్ వచ్చింది. ఎమ్‌టెక్ కోర్సులో సగటు వేతనం రూ.11.90 లక్షలు, మధ్యస్థ వేతనం రూ.9.00 లక్షలుగా నమోదయ్యాయి.
మొత్తం ఆఫర్లు.. రూ.30 లక్షలకు పైగా ప్యాకేజీలు
ఈ ఏడాది నిర్వహించిన ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో మొత్తం 1,340 ఉద్యోగ ఆఫర్లు నమోదయ్యాయి. వీటితో పాటు 364 మంది విద్యార్థులు ఆరు నెలల ఇంటర్న్‌షిప్ ఆఫర్లను దక్కించుకున్నారు. ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇవి ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లుగా (PPO) మారే అవకాశం ఉంది.
మొత్తం ప్రక్రియలో 83 మందికి పైగా విద్యార్థులు రూ.30 లక్షలకు పైగా వార్షిక వేతనంతో (LPA) ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.
రంగాలవారీగా కంపెనీలు
ఈసారి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 374 కంపెనీలు పాల్గొన్నాయి. వీటిలో దాదాపు 50 శాతం కంపెనీలు ఎన్‌ఐటీ రూర్కెలాలో తొలిసారిగా నియామకాలు చేపట్టడం గమనార్హం. ఎక్కువ శాతం కంపెనీలు సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల రంగానికి చెందినవి కాగా.. మాన్యుఫ్యాక్చరింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ (BFSI), ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్ రంగాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఆదిత్య బిర్లా గ్రూప్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, ఎల్‌అండ్‌టీ (L&T), జెడ్ఎస్ అసోసియేట్స్, వేదాంత రిసోర్సెస్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎక్సాన్ మొబిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ (NQT), డెలాయిట్ USI, కేర్న్ ఆయిల్ అండ్ గ్యాస్, హెచ్‌పీసీఎల్, యాక్సెంచర్, డ్యుయిష్ ఇండియా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, క్వాల్కమ్, ఫ్లక్సియాన్, టెరాడేటా, నాట్‌వెస్ట్, జిందాల్ స్టెయిన్‌లెస్, టాటా మోటార్స్, ఐసర్వ్‌యు వంటి దిగ్గజ సంస్థలు విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాయి.
డైరెక్టర్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ఏమన్నారంటే..
"పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలు, ఆవిష్కరణలపై బలమైన పునాది, భిన్నంగా ఆలోచించే తత్వాన్ని విద్యార్థులలో పెంపొందించడానికి ఎన్‌ఐటీ రూర్కెలా కట్టుబడి ఉంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో రాణించేలా నిపుణులను తీర్చిదిద్దాం. ప్రపంచ ఉద్యోగ విపణిలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, మా విద్యార్థుల అంకితభావం, కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ సహకారం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయి. భవిష్యత్తు గ్లోబల్ ఎకానమీ అవసరాలకు అనుగుణంగా ప్రతిభావంతులను తీర్చిదిద్దడం కొనసాగిస్తాం" అని ఎన్‌ఐటీ రూర్కెలా డైరెక్టర్ ప్రొఫెసర్ కే. ఉమామహేశ్వరరావు తెలిపారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


