మున్సిపల్ ఎన్నికల కోసం స్టాక్ మార్కెట్లకు సెలవా? నితిన్ కామత్ ఘాటు విమర్శలు

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు (BSE, NSE) మూసివేయడంపై జెరోధా సీఈఓ నితిన్ కామత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంబంధాలున్న మార్కెట్లను స్థానిక ఎన్నికల కోసం మూసివేయడం 'సరియైన ప్రణాళిక లేకపోవడమేనని' ఆయన విమర్శించారు.

Published on: Jan 15, 2026, 11:47:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహారాష్ట్రలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి స్టాక్ మార్కెట్ వర్గాలకు కూడా తాకింది. ఈ ఎన్నికల దృష్ట్యా గురువారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లకు సెలవు ప్రకటించారు. అయితే, ఒక స్థానిక సంస్థల ఎన్నికల కోసం దేశీయ స్టాక్ మార్కెట్లను పూర్తిగా స్తంభింపజేయడంపై జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ తీవ్రంగా స్పందించారు.

మున్సిపల్ ఎన్నికల కోసం స్టాక్ మార్కెట్లకు సెలవా? నితిన్ కామత్ ఘాటు విమర్శలు (X/@Nithin0dha)
మున్సిపల్ ఎన్నికల కోసం స్టాక్ మార్కెట్లకు సెలవా? నితిన్ కామత్ ఘాటు విమర్శలు (X/@Nithin0dha)

"ఇది సరైన ప్రణాళిక కాదు"

నితిన్ కామత్ సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. "భారత స్టాక్ ఎక్స్ఛేంజీలకు అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధాలు ఉంటాయి. అలాంటి కీలక వ్యవస్థలను ఒక స్థానిక మున్సిపల్ ఎన్నికల కోసం మూసివేయడం అనేది సరైన ప్రణాళిక లేకపోవడమే. భవిష్యత్తులో దీనివల్ల కలిగే పరిణామాలపై అవగాహన లోపానికి ఇది నిదర్శనం" అని నితిన్ కామత్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.

ప్రముఖ అమెరికన్ ఇన్వెస్టర్ చార్లీ ముంగర్ చెప్పిన "ప్రయోజనం (Incentive) ఎక్కడుంటుందో చూపిస్తే.. ఫలితం (Outcome) ఎలా ఉంటుందో నేను చూపిస్తా" అనే కోట్‌ను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందు మన పరపతి ఏంటి?

మార్కెట్ సెలవుపై మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. "ప్రస్తుతం ఈ సెలవును అడ్డుకోవడానికి ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టే ఈ సెలవు అమల్లో ఉంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మన మార్కెట్లను సీరియస్‌గా తీసుకోవాలంటే.. మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఈ సంఘటన చెబుతోంది" అని నితిన్ కామత్ అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

కామత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన వాదనతో ఏకీభవిస్తుండగా, మరికొందరు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

"భారత ఈక్విటీ మార్కెట్ అంటే కేవలం స్థానిక మార్కెట్ కాదు. ఇందులో ఎఫ్‌పీఐలు (FPIs), సావరిన్ ఫండ్స్ వంటి అంతర్జాతీయ పెట్టుబడులు ఉన్నాయి. ప్రభుత్వం ఓటు వేయడానికి ఉద్యోగులకు సగం రోజు సెలవు ఇస్తే సరిపోయేది. మిగతా సమయంలో మార్కెట్లు నడిచేవి" అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"విదేశీ మార్కెట్లు మూసి ఉన్నప్పుడు మనం మన మార్కెట్లను మూసివేస్తున్నామా? అంతర్జాతీయ అనుసంధానం ఉన్నప్పుడు ఇలాంటి సెలవులు ఎంతవరకు సమంజసం?" అని మరొకరు ప్రశ్నించారు.

మరికొందరు మాత్రం, రాజ్యాంగపరమైన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు అవసరమని వాదించారు.

మహారాష్ట్రలో 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ట్రేడింగ్‌ను నిలిపివేశారు. తిరిగి శుక్రవారం (జనవరి 16) మార్కెట్లు యధావిధిగా ప్రారంభం కానున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More