‘జేఈఈ మెయిన్స్ 2026లో కాలిక్యులేటర్ ఉండదు’ - ఎన్టీఏ స్పష్టత!
జేఈఈ మెయిన్స్ 2026లో కాలిక్యులేటర్ ఉండదని ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం రాత్రి కీలక సమాచార బులిటెన్‌ని విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు.. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షలో ఎలాంటి కాలిక్యులేటర్ అందుబాటులో ఉండదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తేల్చిచెప్పింది. ఈ మేరకు, అభ్యర్థులకు ఆన్‌స్క్రీన్ వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుందని రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంది.

'టైపోగ్రాఫిక్ లోపం'గా పేర్కొన్న ఎన్టీఏ..
సమాచార బులిటెన్‌లో ఆన్‌స్క్రీన్ స్టాండర్డ్ కాలిక్యులేటర్ గురించి మునుపటి ప్రస్తావన "టైపోగ్రాఫిక్ లోపం" కారణంగానే వచ్చిందని ఎన్టీఏ ఆదివారం రాత్రి విడుదల చేసిన నోటీసులో తెలిపింది. ఏజెన్సీ సాధారణ పరీక్షా వేదికలో కాలిక్యులేటర్ సదుపాయం ఉన్నప్పటికీ, జేఈఈ మెయిన్స్‌లో మాత్రం దానిని ఉపయోగించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
"ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జేఈఈ మెయిన్స్ – 2026 సమాచార బులిటెన్‌లోని 'కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)' గురించిన అపెండిక్స్-VIII లో, పరీక్ష సమయంలో ఆన్‌స్క్రీన్ స్టాండర్డ్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుందని పేర్కొని ఉంది. అయితే, ఈ సదుపాయం కేవలం సాధారణ పరీక్షా నిర్వహణ వేదికలో భాగం మాత్రమే. ఈ పరీక్షలో ఎలాంటి కాలిక్యులేటర్ వినియోగానికి అనుమతి లేనందున, ఎన్టీఏ నిర్వహించే జేఈఈ మెయిన్స్‌కు ఇది వర్తించదు," అని ఎన్టీఏ తన తాజా నోటీసులో వివరించింది.
సవరించిన బులిటెన్ విడుదల..
జేఈఈ మెయిన్స్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31న ప్రారంభమై నవంబర్ 27 వరకు కొనసాగనుంది. పరీక్షల మొదటి సెషన్ 2026 జనవరి 21 నుంచి 30 వరకు జరగనుంది, ఫలితాలు ఫిబ్రవరి 26న విడుదల అవుతాయి.
శుక్రవారం రాత్రి విడుదల చేసిన సమాచార బులిటెన్‌లో ఎన్టీఏ, "కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) అంతటా ఆన్‌స్క్రీన్ స్టాండర్డ్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. కూడిక, తీసివేత, భాగహారం, గుణకారం వంటి లెక్కల కోసం ఈ ప్రాథమిక కాలిక్యులేటర్‌ను ఆన్‌లైన్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ కాలిక్యులేటర్‌లో వర్గమూలం, శాతం వంటి ఫంక్షన్లు కూడా ఉంటాయి," అని పేర్కొంది.
అయితే, ఈ టైపోగ్రాఫిక్ లోపం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆదివారం రాత్రి ఎన్టఏ విడుదల చేసిన సవరించిన బులిటెన్‌లో ఆన్‌స్క్రీన్ స్టాండర్డ్ కాలిక్యులేటర్‌కు సంబంధించిన విభాగాన్ని తొలగించింది.
"జేఈఈ మెయిన్స్ 2026కు సంబంధించిన సవరించిన సమాచార బులిటెన్ అప్‌లోడ్ చేశాము. అభ్యర్థులు దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించడమైనది. జేఈఈ మెయిన్స్ 2026 సమాచార బులిటెన్‌లో జరిగిన టైపోగ్రాఫిక్ లోపం పట్ల, అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి ఎన్టీఏ చింతిస్తోంది," అని సంస్థ తెలిపింది.
పరీక్ష స్వరూపం వివరాలు..
జేఈఈ మెయిన్స్ పరీక్షను సంవత్సరానికి రెండు సార్లు—జనవరి, ఏప్రిల్‌లో నిర్వహిస్తారు.
పేపర్ 1 (బీఈ./బీటెక్): ఇది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ). ఇందులో 75 ప్రశ్నలకు గాను మొత్తం 300 మార్కులు ఉంటాయి.
పేపర్ 2ఏ (బీఆర్క్): ఇది సీబీటీ, పెన్-అండ్-పేపర్ డ్రాయింగ్ సెక్షన్ల కలయిక. ఇందులో 400 మార్కులు ఉంటాయి.
పేపర్ 2B (బీప్లాన్): ఇది పూర్తిగా సీబీటీ. ఇందులో సుమారు 100 ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి.
ప్రతి తప్పు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నకు 1 మార్కు తీసేస్తారు.
దివ్యాంగుల (పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు, పరీక్ష సమయం ప్రతి గంటకు 20 నిమిషాల చొప్పున అదనపు సమయం లభిస్తుంది.
2024లో సుమారు 14.15 లక్షల మంది విద్యార్థులు, 2025లో సుమారు 14.75 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు హాజరయ్యారు.














