NPS నిబంధనల్లో కీలక మార్పులు- నగదు విత్‌డ్రా గురించి ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) నిబంధనల్లో పీఎఫ్ఆర్డీఏ కీలక మార్పులు చేసింది. ప్రైవేట్ రంగ చందాదారులు తమ రిటైర్మెంట్ ఫండ్‌లో ఇక 80% వరకు నగదును ఒకేసారి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. మునుపటి 60% పరిమితిని పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణయం ఇన్వెస్టర్లకు పెద్ద ఊరట అని చెబుతున్నారు.
రిటైర్మెంట్ అనంతర జీవితం కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో పొదుపు చేసుకుంటున్న వారికి కేంద్రం తీపి కబురు అందించింది! ప్రభుత్వేతర (ప్రైవేట్ రంగ) చందాదారులు ఇకపై తమ మొత్తం నిధిలో 80 శాతం వరకు నగదును ఒకేసారి (లంప్సమ్) విత్‌డ్రా తీసుకోవచ్చు. ఈ మేరకు పీఎఫ్ఆర్డీఏ కొత్త సవరణలను ఇటీవలే నోటిఫై చేసింది. ఎన్‌పీఎస్ నిబంధనల్లో ఈ మార్పులు ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు, 'ఆల్ సిటిజన్ మోడల్' కింద ఉన్నవారికి వర్తిస్తాయి.

ఎన్‌పీఎస్ నిబంధనల్లో మార్పులేంటి? ఎవరికి లాభం?
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. పదవీ విరమణ సమయంలో మొత్తం నిధిలో 60 శాతం మాత్రమే నగదుగా తీసుకునే వీలుండేది. మిగిలిన 40 శాతాన్ని తప్పనిసరిగా 'యాన్యుటీ' (నెలవారీ పెన్షన్ ఇచ్చే పథకం) లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది.
తాజా సవరణల ప్రకారం.. ఈ 40 శాతం యాన్యుటీ నిబంధనను 20 శాతానికి తగ్గించారు. అంటే, మీరు 80 శాతం వరకు నగదును నేరుగా మీ చేతికి తీసుకోవచ్చు! అయితే, ఈ వెసులుబాటు మీ రిటైర్మెంట్ నిధి రూ. 12 లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
"ప్రస్తుతం ఉన్న పీపీఎఫ్, ఈపీఎఫ్లతో పోలిస్తే ఎన్‌పీఎస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది! పెట్టుబడి మొత్తం, అసెట్ మిక్స్, మెరుగైన రిటర్న్స్ విషయంలో ప్రైవేట్ ఉద్యోగులకు ఇది ఎంతో అనువైనది," అని బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ ఛైర్మన్ శిఖర్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఫండ్‌ని బట్టి విత్‌డ్రా రూల్స్ ఇలా ఉన్నాయి:
మీ దగ్గర ఉన్న రిటైర్మెంట్ ఫండ్ బట్టి పీఎఫ్ఆర్డీఏ మూడు రకాల వెసులుబాట్లు కల్పించింది:
మీ ఎన్‌పీఎస్ ఖాతాలో మొత్తం పొదుపు రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉంటే, ఆ మొత్తాన్ని (100%) మీరు ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి యాన్యుటీ అవసరం లేదు.
అదే మీ ఫండ్‌లో రూ. 8 లక్షల నుంచి 12 లక్షల మధ్య ఉంటే గరిష్టంగా రూ. 6 లక్షల వరకు నగదును ముందే తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని కనీసం ఆరేళ్ల కాలపరిమితి ఉండేలా యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఫండ్ ఉంటే కనీసం 20 శాతాన్ని పెన్షన్ కోసం యాన్యుటీలో ఉంచి, మిగిలిన 80 శాతాన్ని నగదుగా పొందవచ్చు.
పన్ను చిక్కులు ఉండొచ్చా?
80 శాతం విత్ డ్రా విషయంలో పన్ను రాయితీలపై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, 60 శాతం విత్‌డ్రా వరకు పన్ను మినహాయింపు ఉంది.
"పరిమితి 80 శాతానికి పెరిగినందున, పన్ను విషయంలో అధికారిక మార్గదర్శకాలు వచ్చే వరకు ఇన్వెస్టర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో నగదు తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం," అని ఆర్థిక సంస్థ విభావంగల్ అనుకూలకార ఎండీ సిద్ధార్థ్ మౌర్య సూచించారు.
వయస్సు పరిమితిపై క్లారిటీ:
ఎన్‌పీఎస్ కొత్త నిబంధనల ప్రకారం.. చందాదారులు తమ 85 ఏళ్ల వయస్సు వరకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు కొనసాగించవచ్చు. 15 ఏళ్ల చందా కాలం పూర్తయినా లేదా 60 ఏళ్ల వయస్సు వచ్చినా సాధారణ ఎగ్జిట్ ఆప్షన్‌ను వాడుకోవచ్చు.
"ఒకేసారి భారీ నగదు చేతికి రావడం వల్ల ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుంది. అయితే ఆ డబ్బును జాగ్రత్తగా మేనేజ్ చేయకపోతే త్వరగా ఖర్చయ్యే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా, ఈ కొత్త నిబంధనల వల్ల ఎంపిక చేసుకునే హక్కు వ్యవస్థ చేతిలో కాకుండా చందాదారుడి చేతిలోకి రావడం శుభపరిణామం," అని లీగల్ సపోర్ట్ ప్లాట్‌ఫామ్ 'రెస్ట్ ది కేస్' ఫౌండర్ శ్రేయా శర్మ అన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


