NSE IPO : మచ్ అవైటెడ్ ఎన్​ఎస్​ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్ షురూ- జీఎంపీ ఎంత! అప్లై చేయాలా? వద్దా?

దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్​ఛేంజ్ ఎన్ఎస్ఈ ఐపీఓ ఈరోజు (సెప్టెంబర్ 17) సబ్‌స్క్రిప్షన్‌కు తెరుచుకుంది. షేరు ప్రైజ్ బ్యాండ్, మార్కెట్లో నడుస్తున్న గ్రే మార్కెట్ ప్రీమియం, ఈ మెగా ఐపీఓలో పెట్టుబడి పెట్టొచ్చా లేదా అనే దానిపై మార్కెట్ నిపుణుల విశ్లేషణల పూర్తి వివరాలు తెలుసుకోండి..

Published on: Sep 17, 2026, 10:02:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) గురువారం (సెప్టెంబర్ 17) ఉదయం 10 గంటలకు ఓపెన్ అయ్యింది. సెప్టెంబర్ 21వ తేదీ (సోమవారం) వరకు ఈ ఎన్​ఎస్​ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ ప్రైజ్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.1,700 నుంచి రూ.1,785గా నిర్ణయించారు. దీని ఫేస్ వ్యాల్యూ రూపాయిగా ఉంది. కనీస లాట్ సైజును 8 షేర్లుగా నిర్ధారించారు. అంటే రీటైల్ ఇన్వెస్టర్లు కనీసం 8 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది, ఆపై 8 మల్టిపుల్స్​లో ఎంతైనా బిడ్ వేసుకోవచ్చు.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ లేటెస్ట్ అప్డేట్స్..
ఎన్​ఎస్​ఈ ఐపీఓ లేటెస్ట్ అప్డేట్స్..

ఎన్​ఎస్​ఈ ఐపీఓకు జీఎంపీ.. పడిపోతున్న క్రేజ్!

గత కొద్ది రోజులుగా గ్రే మార్కెట్​లో ఎన్ఎస్ఈ షేరుపై ఆసక్తి కాస్త తగ్గుముఖం పట్టింది. తాజా సమాచారం ప్రకారం.. ఎన్ఎస్ఈ ఐపీఓ జీఎంపీ ప్రస్తుతం రూ.125 వద్ద ట్రేడ్ అవుతోంది. అప్పర్ ప్రైజ్ బ్యాండ్ రూ.1,785కి ఈ ప్రీమియం కలుపుకుంటే, షేరు రూ.1,910 వద్ద మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఎన్​ఎస్​ఈ ఐపీఓతో ఇన్వెస్టర్లకు కేవలం 7 శాతం మాత్రమే లాభం రావొచ్చని అంచనా వేస్తున్నారు.

గత 14 సెషన్ల ట్రేడింగ్ డేటాను గమనిస్తే.. మార్కెట్లో ఈ ఐపీఓ క్రేజ్ క్రమంగా తగ్గుతూ వస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రెండు వారాల్లో జీఎంపీ అత్యల్పంగా రూ.125 నుంచి అత్యధికంగా రూ.310 మధ్య తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ- అలాట్‌మెంట్, లిస్టింగ్ తేదీలు..

దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 22న (మంగళవారం) షేర్ల అలాట్‌మెంట్‌ను ఖరారు చేస్తారు. షేర్లు దక్కని ఇన్వెస్టర్లకు సెప్టెంబర్ 23 నుంచి డబ్బులు రీఫండ్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే రోజున అలాట్‌మెంట్ పొందిన వారి డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లను జమ చేస్తారు. ఇక సెప్టెంబర్ 24న (గురువారం) బీఎస్ఈలో ఈ ఎన్​ఎస్​ఈ షేర్లు అధికారికంగా లిస్ట్ అవుతాయి.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ- ఇతర వివరాలు..

ఎన్ఎస్ఈ యాజమాన్యం తమ ఐపీఓ పరిమాణాన్ని అనూహ్యంగా తగ్గించింది. తొలుత 14.89 కోట్ల షేర్లను విక్రయించాలని భావించినా, ఇటీవలే ఫైల్ చేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్​హెచ్​పీ) ప్రకారం ఆ సంఖ్యను 12.644 కోట్లకు కుదించింది. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీ మూలధనంలో 5.1 శాతానికి సమానం.

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఐపీఓ పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (ఓఎఫ్ఎస్) పద్ధతిలో వస్తోంది. అంటే, కంపెనీ కొత్త షేర్లను జారీ చేయడం లేదు. ఇప్పటికే షేర్లు ఉన్న ప్రమోటర్లు, ఇతర పెట్టుబడిదారులు తమ వాటాను అమ్ముకుంటున్నారు. కాబట్టి, ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులన్నీ ఆయా వాటాదారులకే వెళతాయి తప్ప, ఎన్ఎస్ఈ ఖాతాలోకి చేరవు. ప్రధానంగా బీఎస్ఈలో తమ షేర్లను లిస్ట్ చేసుకునే ఉద్దేశంతోనే ఎన్ఎస్ఈ ఈ ఐపీఓకు వచ్చింది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ- అప్లై చేయాలా? వద్దా?

స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్ఈకి ఉన్న గుత్తాధిపత్యం నేపథ్యంలో ఈ ఐపీఓపై బ్రోకరేజ్ సంస్థలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి:

ఎస్‌బీఐ సెక్యూరిటీస్ : ఫ్యూచర్ గ్రోత్ పరంగా ఎన్ఎస్ఈకి మంచి భవిష్యత్తు ఉందని ఎస్బీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద కంపెనీ పీఈ రేషియో 42.9x గా ఉందని పేర్కొంది. భారత్‌లో మూలధన మార్కెట్లు విస్తరిస్తుండటం, కొత్త టెక్నాలజీతో మరిన్ని ప్రొడక్ట్స్ తీసుకురావడం ఈ ఎక్స్​ఛేంజ్​కు కలిసి వచ్చే అంశాలని తెలిపింది.

రేలిగేర్ బ్రోకింగ్ : ఈ సంస్థ కాస్త ఆచితూచి స్పందించింది. 42.9x పీఈ వ్యాల్యూయేషన్ సహేతుకమే అయినా, భవిష్యత్తులో ఆదాయం తగ్గితే ఈ వ్యాల్యూయేషన్ ఇబ్బందికరంగా మారుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా సెబీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై తీసుకువస్తున్న కొత్త నిబంధనల వల్ల ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వాల్యూమ్స్ పడిపోయే ప్రమాదం ఉందని గుర్తుచేసింది. అందుకే ఈ ఐపీఓకు 'న్యూట్రల్' రేటింగ్ ఇచ్చింది.

ఏంజెల్ వన్ : ఎన్ఎస్ఈ ఐపీఓకు ఏంజెల్ వన్ సబ్‌స్క్రైబ్ రేటింగ్ ఇచ్చింది. రూ.1,785 ధర వద్ద చూసుకుంటే ఎన్ఎస్ఈ పీఈ రేషియో 35.4x గా ఉంటుందని, అదే సమయంలో దీని ప్రధాన పోటీదారు బీఎస్ఈ పీఈ రేషియో 54.2x గా ఉందని పోల్చి చూపింది. బీఎస్ఈ కంటే ఎన్ఎస్ఈ షేరు చౌకగా లభిస్తోందని, మార్కెట్లో ఉన్న ఆధిపత్యం దృష్ట్యా ఇందులో నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టొచ్చని ఏంజెల్ వన్ సలహా ఇచ్చింది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొదించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More