Stock market : షేర్లను ఒక డీమ్యాట్​ అకౌంట్​ నుంచి మరొక ఖాతాకు మార్చడం ఎలా?

How to transfer shares : షేర్లను ఒక డీమ్యాట్​ అకౌంట్​ నుంచి మరొక అకౌంట్​కి ఎలా మార్చాలి? ఉన్న ఆప్షన్స్​ ఏంటి? చార్జీలు పడతాయా? ఎంత వసూలు చేస్తారు?

Published on: Jun 2, 2026, 09:08:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

How to transfer shares : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తరచుగా తమ బ్రోకర్లను మార్చడం, షేర్లను ఇతరులకు బహుమతిగా ఇవ్వడం లేదా తమకున్న మల్టిపుల్ అకౌంట్లను ఒకే చోట ఏకీకృతం (కన్సావిడేట్) చేస్తుంటారు. ఫలితంగా ఒక డీమ్యాట్ అకౌంట్​ నుంచి మరొక ఖాతాలోకి షేర్లు బదిలీ అవుతుంటాయి. షేర్లను విక్రయించకుండానే ఎలక్ట్రానిక్ పద్ధతిలో బదిలీ చేసుకునేందుకు డిపాజిటరీలు అనుమతిస్తాయి. అయితే ఈ ప్రక్రియకు బ్రోకర్లు రూ. 10 నుంచి రూ. 50 వరకు నామినల్ చార్జీలు వసూలు చేస్తారు. షేర్ల బదిలీకి సంబంధించిన ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల పూర్తి వివరణలు ఇక్కడ చూద్దాం.

షేర్లను ఎలా ట్రాన్స్​ఫర్​ చేయాలి?
షేర్లను ఎలా ట్రాన్స్​ఫర్​ చేయాలి?

డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్ల బదిలీ రెండు పద్ధతుల్లో జరుగుతుంది..

1. ఆఫ్‌మార్కెట్ బదిలీ : ఈ పద్ధతిలో షేర్లను స్టాక్ మార్కెట్​లో విక్రయించకుండా నేరుగా ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక ఖాతాలోకి (మీ సొంత అకౌంట్ లేదా ఇతరుల అకౌంట్) బదిలీ చేయవచ్చు. ఇందుకోసం డిలివరీ ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్) ద్వారా బ్రోకర్‌కు అనుమతి ఇవ్వాలి. మీ సొంత అకౌంట్ల మధ్య బదిలీకి లేదా గిఫ్ట్ ఇవ్వడానికి ఈ ఆప్షన్ ఉత్తమం.

2. ఆన్‌మార్కెట్ బదిలీ : ఈ విధానం స్టాక్ ఎక్స్​ఛేంజ్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ కొనుగోలుదారులు, విక్రేతలు మార్కెట్ సైకిల్ ప్రకారం లావాదేవీలు జరుపుతారు. ఇది షేర్లను విక్రయించడంతో సమానం కాబట్టి, లాభనష్టాలు లెక్కిస్తారు.

షేర్ల ట్రాన్స్​ఫర్ చార్జీలు ఎంత?

క్లియర్‌టాక్స్ నివేదిక ప్రకారం.. సాధారణంగా బ్యాంకులు లేదా బ్రోకర్లు ప్రతి బదిలీకి లేదా ప్రతి రకమైన షేరుకు రూ. 10 నుంచి రూ. 50 వరకు రుసుము వసూలు చేస్తారు. ఒకే డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) పరిధిలోని ఖాతాల మధ్య బదిలీ కొన్నిసార్లు ఉచితం కావచ్చు. గిఫ్ట్ లేదా అమ్మకాల రూపంలో బదిలీ చేస్తే స్టాంప్ డ్యూటీ, పన్ను నిబంధనలు వర్తిస్తాయి.

షేర్లను ట్రాన్స్​ఫర్​ చేసే ప్రక్రియలు..

1. మాన్యువల్ / ఆఫ్‌లైన్ బదిలీ విధానం..

ఆఫ్‌లైన్ పద్ధతిలో షేర్లను బదిలీ చేయడానికి మీ ప్రస్తుత బ్రోకర్ నుంచి డిలివరీ ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్) బుక్‌లెట్ పొందాలి. అందులో కింది వివరాలను జాగ్రత్తగా పూరించాలి:

బెనిఫిషియరీ బ్రోకర్ ఐడీ : ఇది బ్రోకర్ లేదా బ్యాంకులకు సంబంధించిన 16 అంకెల ప్రత్యేక ఐడీ. మీ ప్రస్తుత బ్రోకర్ మరియు కొత్త బ్రోకర్ ఐడీలను స్లిప్‌లో నమోదు చేయాలి.

ఐఎస్ఐఎన్ (ISIN - International Securities Identification Number): మీ ఖాతాలోని ప్రతి షేరును గుర్తించడానికి ఉండే ప్రత్యేక నంబర్ ఇది. దీనితో పాటు బదిలీ చేయాలనుకుంటున్న షేర్ల పరిమాణాన్ని స్పష్టంగా రాయాలి.

మోడ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ : ఒకే డిపాజిటరీ పరిధిలో బదిలీ అయితే 'ఆఫ్-మార్కెట్' ఎంచుకోవాలి. వేర్వేరు డిపాజిటరీలు (ఉదాహరణకు సీడీఎస్​ఎల్ నుంచి ఎన్​ఎస్​డీఎల్) అయితే 'ఇంటర్-డిపాజిటరీ' ఆప్షన్ ఎంచుకోవాలి.

ఇక వివరాలను నింపిన తర్వాత, డిలివరీ ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్) పై సంతకం చేసి మీ ప్రస్తుత బ్రోకర్‌కు సమర్పించాలి. బ్రోకర్ మీ వివరాలను ధృవీకరించి (వెరిఫై), వర్తించే చార్జీలను మినహాయించుకుని షేర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తారు.

2. ఆన్‌లైన్ బదిలీ విధానం..

సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్​ఎల్) ఇన్వెస్టర్ల కోసం ఆన్‌లైన్​లో సులభంగా షేర్లను బదిలీ చేసుకునేందుకు EASIEST (Electronic Access to Securities Information and Execution of Secured Transactions) సౌకర్యాన్ని కల్పిస్తోంది.

లాగిన్ అవ్వండి: ముందుగా సీడీఎస్​ఎల్ అధికారిక ప్లాట్‌ఫారమ్‌ను ఓపెన్ చేసి మీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.

రిజిస్ట్రేషన్: హోంపేజీలో 'Register Online' పై క్లిక్ చేయండి.

ఆప్షన్ ఎంపిక: అందులో అందుబాటులో ఉన్న ఆప్షన్లలో 'EASIEST' ని ఎంచుకోండి.

వివరాల నమోదు: పోర్టల్‌లో అడిగిన అవసరమైన వివరాలన్నింటినీ పూర్తి చేయండి.

డీపీకి సమర్పణ: ఆ వివరాల కాపీని మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) కు పంపాలి.

దీని తర్వాత, మీ బ్రోకర్ (డీపీ) ఆ పత్రాలను సెంట్రల్ డిపాజిటరీ ధృవీకరణకు ఫార్వార్డ్ చేస్తారు. వివరాలన్నీ సరిగ్గా ఉంటే 1-2 రోజుల్లో మీకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ అందుతాయి. ఆ తర్వాత మీరు లాగిన్ అయి, రిజిస్టర్డ్ బెనిఫిషియరీ అకౌంట్‌ను ఎంచుకుని డిజిటల్‌గా షేర్లను బదిలీ చేయవచ్చు.

మరింత సమాచారం కోసం మీరు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More