Investing tips : స్టాక్ మార్కెట్లో నష్టపోకూడదు అంటే బిగినర్లు ఇవి తెలుసుకోవాలి..
Stock market investing tips : మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
Stock market investing tips for beginners : భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈక్విటీ మార్కెట్లలోకి సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం భారీగా పెరిగింది. 'ఆనంద్ రాఠీ వెల్త్' సేకరించిన ఇటీవలి గణాంకాల ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2022లో 9 కోట్లుగా ఉన్న భారతదేశ డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య.. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 22.5 కోట్లకు (225 మిలియన్లు) చేరుకుంది. డిజిటల్ విప్లవం, మొబైల్ యాప్‌ల ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్ సులభతరం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, మార్కెట్లోకి వస్తున్న ఈ కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లు విచక్షణారహితంగా ట్రేడింగ్ చేస్తూ డబ్బులు నష్టపోకుండా ఉండాలంటే.. ఇన్వెస్టింగ్ ప్రాథమిక సూత్రాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనితో పాటు బిగినర్లు డీమ్యాట్ ఖాతా ఎలా తెరవాలో తెలుసుకోవడం ఎంతో అవసరం.

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభించే ముందు మార్కెట్‌ను శాసించే రెండు ప్రధాన ఇండెక్స్‌ల గురించి తెలుసుకోవాలి. అవి..
సెన్సెక్స్, నిఫ్టీ అంటే ఏంటి?
సెన్సెక్స్ (Sensex): ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బెంచ్‌మార్క్ సూచీ. ఇందులో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆర్థికంగా పటిష్టమైన 30 పెద్ద కంపెనీలు ఉంటాయి. ఈ ఇండెక్స్ కదలికలను బట్టి దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అంచనా వేయవచ్చు.
నిఫ్టీ 50 (Nifty 50): ఇది నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు చెందిన కీలక సూచీ. ఇందులో బ్యాంకింగ్, ఐటీ, కెమికల్స్, సిమెంట్ వంటి వివిధ రంగాలకు చెందిన 50 అగ్రగామి కంపెనీలు ఉంటాయి. భారత ఈక్విటీ మార్కెట్ పనితీరును కొలవడానికి దీనిని ప్రధానంగా ఉపయోగిస్తారు.
కొత్త ఇన్వెస్టర్ల కోసం ప్రాథమిక సూత్రాలు..
స్టాక్ మార్కెట్లో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే భ్రమతో వస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొత్తగా వచ్చే వారు ఈ కింది విషయాలను గుర్తుంచుకోవాలి:
దీర్ఘకాలిక పెట్టుబడి - క్రమశిక్షణ : ఎమోషనల్ ట్రేడింగ్ (ఆవేశంతో లేదా భయంతో ట్రేడింగ్ చేయడం), అప్పులు తెచ్చి మార్కెట్లో పెట్టడం, సోషల్ మీడియా లేదా మార్కెట్ పుకార్లను నమ్మి షేర్లు కొనడం వంటి పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. త్వరితగతిన లాభాలు రావాలని కాకుండా, దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెట్టాలి.
మ్యూచువల్ ఫండ్స్ / ఎస్‌ఐపీ: స్టాక్స్ గురించి అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్‌లో ఎస్‌ఐపీ పద్ధతి ద్వారా ప్రతి నెలా క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి.
డైవర్సిఫికేషన్ (వైవిధ్యం): మీ డబ్బునంతటినీ ఒకే కంపెనీ లేదా ఒకే రంగంలో పెట్టకుండా.. మీ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వేర్వేరు రంగాల కంపెనీలలో విస్తరించాలి.
ప్రాథమిక విశ్లేషణ: మార్కెట్ క్యాపిటలైజేషన్, పి/ఇ రేషియో (P/E Ratio), పి/బి రేషియో (P/B Ratio), రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి కనీస ఆర్థిక భావనలను నేర్చుకోవాలి. వ్యక్తిగత ఫైనాన్స్ పుస్తకాలు చదవడం లేదా సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేవి ఎల్లప్పుడూ మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. అందువల్ల క్రమశిక్షణ, సహనం, సరైన పరిశోధన, పట్టుదలతో మార్కెట్‌ను సమీపిస్తేనే దీర్ఘకాలంలో ఆశించిన ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు.
డీమ్యాట్ ఖాతా తెరవడానికి 5 సులువైన స్టెప్స్..
సాధారణంగా బ్యాంక్ ఖాతాలో డబ్బును దాచుకున్నట్లే, మనం కొనే షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచడానికి 'డీమ్యాట్ అకౌంట్' ఉపయోగపడుతుంది. అలాగే షేర్లను కొనడానికి, అమ్మడానికి 'ట్రేడింగ్ అకౌంట్' అవసరమవుతుంది.
స్టెప్ 1 (బ్రోకర్‌ను ఎంచుకోండి): మొదట సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ లేదా ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకుని, వారి క్రెడెన్షియల్స్ తనిఖీ చేయండి.
స్టెప్ 2 (పత్రాలను సిద్ధం చేసుకోండి): మీ పాన్ కార్డ్, ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఉదాహరణకు ఆధార్ కార్డ్), బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్‌ను సిద్ధంగా ఉంచుకోండి.
స్టెప్ 3 (ఆన్‌లైన్ కేవైసీ): అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన వివరాలను పూరించి, ఓటీపీ లేదా వీడియో వెరిఫికేషన్ ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.
స్టెప్ 4 (డాక్యుమెంట్లు & ఈ-సైన్): అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫారమ్‌ను క్రాస్-చెక్ చేసుకున్న తర్వాత డిజిటల్‌గా ఈ-సైన్ చేయండి. అప్లికేషన్ ఆమోదం కోసం వేచి ఉండండి.
స్టెప్ 5 (ట్రేడింగ్ ప్రారంభించండి): బ్రోకర్ నుంచి అనుమతి లభించిన తర్వాత మీ ఈమెయిల్ మరియు ఫోన్‌కు డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి. వాటితో లాగిన్ అయి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


