Unified Welfare Card : తెలంగాణలో ‘సమగ్ర సంక్షేమ కార్డు’ - ఒకే ఐడీతో అన్ని పథకాల డేటా..! ఆధార్ తరహాలో నెంబర్ కూడా

Unified Welfare Card Telangana : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు ఒకే కార్డు ద్వారా అందించేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు’ను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు.

Published on: May 29, 2026, 09:36:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Unified Welfare Card Telangana : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే చోట లభించేలా ఒక విప్లవాత్మకమైన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్న ప్రభుత్వ సాయాన్ని ఒకే గొడుగు కిందికి తెస్తూ ‘సమగ్ర సంక్షేమ కార్డు’ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా సమగ్రమైన నివేదికను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో ‘సమగ్ర సంక్షేమ కార్డు
తెలంగాణలో ‘సమగ్ర సంక్షేమ కార్డు

డేటా సేకరణకు ప్రత్యేక డ్రైవ్ - సీఎం

తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని… అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు.

ఈ విధానం అనుసరించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరుతాయని… అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు…. ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సూచించారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు.

ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, బీమా పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ఆలోచించాలన్నారు.

ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల SEEEPC సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు.ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ జరగాలని సూచించారు.

ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే…. ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని సీఎం ఆదేశించారు. వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలని చెప్పారు.

కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే…. అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా,….ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More