Nvidia CEO : చైనా స్పైతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అఫైర్! అమెరికాలో తీవ్ర కలకలం- అసలేం జరిగింది?

చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఒ మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చిప్ దిగ్గజం 'ఎన్విడియా' సీఈఓ జెన్సన్ హువాంగ్ అంగీకరించారు. ఈ విషయంపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రకటించిన వేళ ఈ వ్యవహారం గ్లోబల్ టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది.

Published on: Nov 9, 2026, 09:11:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిప్ తయారీ సంస్థ 'ఎన్విడియా' సీఈఓ జెన్సన్ హువాంగ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాన్ని వెల్లడించారు. ఒక మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని బహిరంగంగా అగీకరించారు. ఈ మహిళ.. చైనా గూఢచార సంస్థకు పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న ఈ చైనా స్పై వ్యవహారంపై ఎన్విడియా బోర్డు అంతర్గత విచారణకు ఆదేశించిన వెంటనే, జెన్సన్ తన ఉద్యోగులకు ఈ మేరకు సుదీర్ఘమైన ఈమెయిల్ పంపారు.

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ (AFP)
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ (AFP)

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి మూలస్తంభంగా నిలిచిన ఎన్విడియా అధినేతే.. చైనా గూఢచర్యం వ్యవహారంలో చిక్కుకోవడం గ్లోబల్ టెక్ మార్కెట్లలోనే కాకుండా టెక్ కమ్యూనిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం.. అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

ఈ వివాదం నవంబర్ 7న వెలుగులోకి వచ్చింది. ఆసియాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ 'మెగాస్పీడ్ ఇంటర్నేషనల్' ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్‌ సన్నిహితంగా ఉన్నట్లు 'ది న్యూయార్క్ టైమ్స్' కథనాన్ని ప్రచురించింది. చైనాకు చెందిన 'మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ' (ఎంఎస్​ఎస్) తరుఫున ఎన్విడియా ఏఐ సాంకేతిక రహస్యాలు, కీలక డేటాను సేకరించడానికే ఆలిస్ హువాంగ్ జెన్సన్ హువాంగ్‌తో సంబంధం పెట్టుకున్నట్లు అమెరికా నివేదికలు.. అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగానికి వివరించాయని సదరు నివేదిక పేర్కొంది.

ఈ కథనంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో, అమెరికా చట్టసభల సభ్యులు కూడా ఈ చైనా గూఢచర్యంపై క్లోజ్డ్ డోర్ బ్రిఫింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

"నా భార్యాపిల్లలను మానసికంగా గాయపరిచాను": జెన్సన్ హువాంగ్

కంపెనీ ఉద్యోగులకు నవంబర్ 8న పంపిన సుదీర్ఘ లేఖలో జెన్సన్ హువాంగ్ తన తప్పును ఒప్పుకున్నారు.

"నేను నా భార్య పట్ల నిబద్ధత తప్పాను. నా చర్యలు నా భార్యను, పిల్లలను తీవ్రంగా గాయపరిచాయి. నేను చేసిన పనికి ఎలాంటి క్షమాపణలు లేవు. నా కుటుంబం నాకెంతో ఆప్యాయతను, అండను ఇచ్చింది. వారు నా నుంచి నిజాయితీని, విశ్వసనీయతను ఆశించడంలో తప్పులేదు. కానీ వారి నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఈ బాధకు నేనే పూర్తి బాధ్యత వహిస్తూ, వచ్చే విమర్శలన్నింటినీ స్వీకరిస్తాను," అని జెన్సన్ హువాంగ్ చెప్పుకొచ్చారు.

అలాగే ఎన్విడియా వాటాదారులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ..

"ఎన్విడియాకు నాయకత్వం వహించడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. కానీ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో నేను విఫలమయ్యాను. ఈ సంస్థ పట్ల నేను పూర్తి అంకితభావంతో ఉంటాను. మీ నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి శ్రమిస్తాను," అని జెన్సన్ పేర్కొన్నారు.

బోర్డు స్వతంత్ర విచారణ.. జాతీయ భద్రతకే ప్రాధాన్యం!

ఈ కథనాల నేపథ్యంలో ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించింది. బయటి న్యాయ నిపుణుల సహాయంతో స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ ఈ విచారణను పర్యవేక్షిస్తుందని బోర్డు స్పష్టం చేసింది.

అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక భద్రత ఎన్విడియాకు, వాటాదారుల ప్రయోజనాలకు అత్యంత కీలకమని బోర్డు పేర్కొంది. ఇప్పటివరకు జాతీయ భద్రతకు గానీ, ఎన్విడియా సాంకేతిక రహస్యాలకు గానీ ఎలాంటి భంగం వాటిల్లిందని భావించడం లేదని, అయితే అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని డైరెక్టర్ల బోర్డు స్పష్టం చేసింది. ఈ విచారణకు జెన్సన్ హువాంగ్ కూడా పూర్తి సహకారం అందిస్తారని వెల్లడించింది.

అమెరికా-చైనా మధ్య టెక్నాలజీ యుద్దం తీవ్రతరమవుతున్న వేళ, ఏఐ మార్కెట్ దిగ్గజం ఎన్విడియా చుట్టూ ముసురుకున్న ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని టెక్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More