Jensen Huang : ఒకరు కాదు.. ఇద్దరు! 'అఫైర్' వ్యవహారంతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై వేటు?
ప్రపంచ ఏఐ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ పదవికి గండం పొంచి ఉంది! అనుమానిత చైనా గూఢచారితో పాటు సంస్థలోని ఓ ఉన్నతోద్యోగితో ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న కథనాలు టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామంతో ఎన్విడియా షేర్లు భారీగా పతనమయ్యాయి.
ప్రపంచ కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజం ఎన్విడియా అత్యున్నత నాయకత్వంలో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి! సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను పదవి నుంచి తప్పించేందుకు ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ వార్తాసంస్థ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. వ్యక్తిగత సంబంధాలు, అనుమానిత చైనా గూఢచారితో ఆయనకు ఉన్న సంబంధాలపై తీవ్ర ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. హువాంగ్ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునేందుకు అతి త్వరలోనే బోర్డు అత్యవసరంగా సమావేశం కానున్నట్లు సమాచారం.

రెండు వివాహేతర సంబంధాలు.. వెలుగులోకి కీలక పేర్లు!
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ హువాంగ్ అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆమె చైనా స్పై అని గత వారమే సంచలన వార్తలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారం చల్లబడకముందే జెన్సన్ వ్యక్తిగత జీవితం గురించి మరో బాంబు పేలింది!
జెన్సన్ హువాంగ్‌కు రెండు వివాహేతర సంబంధాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అందులో ఒకరు అనుమానిత చైనా గూఢచారి కాగా, మరొకరు సంస్థలోనే పనిచేస్తున్న ఉన్నతోద్యోగి అని తెలిపింది. ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగపు వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో హువాంగ్‌కు సంబంధం ఉన్నట్లు సంస్థలో గతంలో పనిచేసిన ఐదుగురు వ్యక్తుల ద్వారా తెలిసిందని పలు మీడియా నివేదికలు వెల్లడించాయి.
కింబర్లీ పావెల్ నేరుగా సీఈఓ జెన్సన్ హువాంగ్ పర్యవేక్షణలోనే పనిచేస్తున్నారు.
తన భార్యకు తాను నమ్మకద్రోహం చేశానని హువాంగ్ ఇటీవల అంగీకరించిన కొద్ది రోజులకే ఈ వరుస కథనాలు బయటకు రావడం సంచలనంగా మారింది.
ఇక ఆలిస్ హువాంగ్ అనే మహిళతో జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సంబంధంపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా నిఘా అధికారుల సమాచారం ప్రకారం, ఎన్విడియా తయారు చేసే అత్యంత కీలకమైన చిప్‌లను చైనా కంపెనీలకు చేరవేయడంలో ఆలిస్ హువాంగ్ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కుప్పకూలిన ఎన్విడియా షేర్లు.. రూ. 28 లక్షల కోట్ల సంపద ఆవిరి!
సీఈఓ జెన్సన్ చుట్టూ అల్లుకున్న ఈ వివాదాల ప్రభావం స్టాక్ మార్కెట్‌లో ఎన్విడియా షేర్లపై తీవ్రంగా పడింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. బుధవారం ఆఫ్టర్-అవర్స్ ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు దాదాపు 9 శాతం మేర పతనమయ్యాయి. ఆలిస్ హువాంగ్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలు వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్విడియా మార్కెట్ విలువ ఏకంగా 300 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 28 లక్షల కోట్లకు పైగా) పైగా తుడిచిపెట్టుకుపోయింది. సీఈఓ భవిష్యత్తుపై కంపెనీ అధికారిక ప్రకటన కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అమెరికా-చైనా టెక్ పోరు మధ్య నాయకత్వ సంక్షోభం!
సుమారు 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా ఎన్విడియా ఎదిగింది. ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ వంటి సేవలను నడపడానికి, ఆధునిక ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఎన్విడియా చిప్‌లే ప్రధాన ఆధారం. ఒకవేళ హువాంగ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తే, సంస్థలో భారీ నాయకత్వ శూన్యత ఏర్పడే ప్రమాదం ఉంది.
అమెరికా, చైనా దేశాల మధ్య సాగుతున్న సాంకేతిక ఆధిపత్య పోరులో ఎన్విడియా అత్యంత కీలక కేంద్రంగా ఉంది. భద్రతా కారణాల రీత్యా అధునాతన ఏఐ చిప్‌లను చైనాకు విక్రయించకుండా అమెరికా ఆంక్షలు విధిస్తున్న తరుణంలో, ఆలిస్ హువాంగ్ వ్యవహారం అమెరికా ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. సంస్థ అగ్రస్థానంలో జరిగే ఏ చిన్న మార్పైనా ప్రపంచ టెక్ పరిశ్రమను, స్టాక్ మార్కెట్లను కుదిపేసే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


