500 కి.మీ రేంజ్​ ఎలక్ట్రిక్​ బైక్​- ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ప్లస్​పై బిగ్​ అప్డేట్​..

ఓలా ఎలక్ట్రిక్ “రోడ్​స్టర్​ ఎక్స్​ ప్లస్​” బైక్​పై బిగ్​ అప్డేట్​. స్వదేశీ 4680 భారత్​ సెల్​ బ్యాటరీతో నడిచే ఈ బైక్​ ప్రభుత్వ అనుమతులు పొందినట్టు సంస్థ ప్రకటించింది. ఫలితంగా దీని డెలివరీలు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Published on: Dec 31, 2025, 06:15:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ టూ-వీలర్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ విప్లవానికి సిద్ధమవుతున్న ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఓలా తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్​ 'రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్' కోసం ప్రభుత్వ ధృవీకరణ పత్రాలను పొందింది. పూర్తిగా మన దేశంలోనే అభివృద్ధి చేసిన '4680 భారత్ సెల్' బ్యాటరీ ప్యాక్‌తో నడిచే ఈ బైక్‌కు మానేసర్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ), సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్​) 1989 ప్రకారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని అనుమతులు లభించడంతో, రానున్న కొద్ది వారాల్లోనే ఈ బైక్ డెలివరీలను ప్రారంభించేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది.

ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ప్లస్​ ఎలక్ట్రిక్​ బైక్​
ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ప్లస్​ ఎలక్ట్రిక్​ బైక్​

భారతదేశ ఈవీ ప్రయాణంలో కీలక మలుపు!

"రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్‌కు ప్రభుత్వ సర్టిఫికేషన్ లభించడం ఓలా ఎలక్ట్రిక్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. భారతదేశంలో పూర్తిస్థాయి ఈవీ టెక్నాలజీని నిర్మించాలనే మా లక్ష్యానికి ఇది నిదర్శనం. మా సొంత సెల్- బ్యాటరీ సాంకేతికతతో నడుస్తున్న ఈ ఎలక్ట్రిక్​ బైక్, అద్భుతమైన రేంజ్, అత్యుత్తమ పనితీరు, భద్రతను అందిస్తుంది. దేశీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ఇదొక నిర్ణయాత్మక అడుగు," అని ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

భారత మార్కెట్​లో ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ప్లస్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 1.30లక్షలుగా ఉంది. ఇందులో 4.5 కేడబ్ల్యూహెచ్​, 9.1 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. పెద్ద బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 501 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్​ బైక్​ 0-40 కేఎంపీహెచ్​ స్పీడ్​ని కేవలం 2.7 సెకన్లలో అందుకోగలదు. దీని టాప్​ స్పీడ్​ 125 కేఎంపీహెచ్​.

కఠిన పరీక్షల్లో నెగ్గిన 9.1 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ..

మరోవైపు, ఓలాకు చెందిన 9.1 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ కూడా ఏఆర్ఏఐ నుంచి ఏఐఎస్​-156 అమెండ్‌మెంట్ 4 కింద ధృవీకరణ పొందింది. ఈ బ్యాటరీ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేదని కంపెనీ స్పష్టం చేసింది. నీటిలో మునిగినా పాడవకుండా ఉండటం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను తట్టుకోవడం, ప్రయాణంలో వచ్చే కుదుపులను తట్టుకునే సామర్థ్యం వంటి అనేక కఠినమైన పరీక్షలను ఎదుర్కొని ఈ సర్టిఫికేషన్ సాధించింది.

ప్రస్తుతం మోటార్‌సైకిళ్ల హవా కొనసాగుతున్న భారత రోడ్లపై, ఓలా తన స్వదేశీ పరిజ్ఞానంతో ఎలాంటి మార్పు తీసుకువస్తుందో చూడాలి. కేవలం వారాల వ్యవధిలోనే ఈ రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ సామాన్యుడి ముంగిటకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

అన్నింటికీ ఆధారం.. భారత్ సెల్..

ఓలాకు చెందిన 4680 భారత్ సెల్ ప్లాట్‌ఫారమ్‌ను కేవలం ఈ బైక్‌లకే పరిమితం చేయకుండా, కంపెనీ తన స్కూటర్ల శ్రేణిలో కూడా ఉపయోగిస్తోంది. భవిష్యత్తులో రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్‌కు కూడా ఇదే టెక్నాలజీ వెన్నెముకగా నిలవనుంది. ఒకే రకమైన శక్తివంతమైన బ్యాటరీ టెక్నాలజీని అన్ని రకాల వాహనాలకు అనుసంధానించడం ఓలా వ్యూహంలో భాగం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More