US Iran deal : ఇరాన్‌పై సైనిక దాడులు రద్దు చేసిన అమెరికా! ట్రంప్ కీలక ప్రకటన..
ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి ప్రాథమిక అవగాహన కుదరడంతో ఆ దేశంపై ప్రతిపాదిత సైనిక దాడులను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధి తెరవడం, అణు బెదిరింపులకు స్వస్తి పలకడం ఈ ఒప్పందంలో కీలకం అని అన్నారు.
వారాల పాటు సాగుతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఒక ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది! ఇరాన్‌పై చేపట్టాలనుకున్న సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రధానాంశాలు (పారామీటర్లు) ఖరారు కావడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా ఒప్పందం ప్రకారం ప్రాధాన్యత కలిగిన హార్ముజ్ జలసంధిని వెంటనే పునఃప్రారంభించడంతో పాటు ఇరాన్ తన అణు కార్యక్రమానికి శాశ్వతంగా స్వస్తి పలకాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
"ప్రపంచ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం" – ట్రంప్
"హార్ముజ్ జలసంధిని తక్షణమే, పూర్తిస్థాయిలో తెరవడం, ఇరాన్ అణు బెదిరింపులను అంతం చేయడం ఈ ఒప్పందంలో భాగాలు. ఇరాన్ చేసిన విజ్ఞప్తి మేరకు, ప్రపంచ భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అలాగే సంపన్నమైన ఇరాన్ మనుగడను కాపాడే ఉద్దేశంతో దాడులను రద్దు చేసేందుకు అంగీకరించాను. అయితే ఒప్పందం త్వరితగతిన కార్యరూపం దాల్చడమే దీనికి ప్రాతిపదిక. వేగంగా పని పూర్తి చేయండి," అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఈ శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ కూడా తమతో కలిసి వస్తుందని ట్రంప్ తెలిపారు. గతంలో జూన్ మాసంలో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఈసారి ఇజ్రాయెల్ భాగస్వామ్యం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, అమెరికా-టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, తమ జాతీయ భద్రతకే మొదటి ప్రాధాన్యమని, ఇరాన్‌తో పాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా వంటి ఇరాన్ ప్రాక్సీ గ్రూపులపై అవసరమైతే దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ గతంలోనే స్పష్టం చేసింది.
శాంతి ఒప్పందం.. ఆపై మళ్లీ మొదలైన దాడులు!
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఈ ఏడాది జూన్ 17న 14 అంశాలతో కూడిన అవగాహనా ఒప్పందం కుదిరింది. ఏప్రిల్‌లో ప్రారంభమైన తాత్కాలిక కాల్పుల విరమణను మరింత ముందుకు తీసుకెళ్తూ, ఆ ప్రాంతంలో అన్ని రకాల సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు అప్పట్లో అమెరికా ప్రకటించింది.
ఆ ఒప్పందం ప్రకారం.. యుద్ధానికి పూర్వం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలి. అలాగే ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాల్సి ఉంది. దీనికి ప్రతిఫలంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని హామీ ఇచ్చింది. దీనితో పాటు ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను సడలించి, స్తంభింపజేసిన ఆస్తులను పునరుద్ధరించేందుకు యూఎస్ అంగీకరించింది. లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య పోరును కూడా ఆపాలని ప్రతిపాదించారు.
అయితే, ఈ సుదీర్ఘ శాంతి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలవలేదు. ఒప్పంద నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయి అన్న ఆరోపణలతో జూలై 8న అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పోరు మొదలైంది. దీనితో 14 అంశాల ఒప్పందాన్ని ఇరాన్ తాత్కాలికంగా రద్దు చేసింది. కానీ, తాజాగా జరిగిన దౌత్య సంప్రదింపులతో మళ్లీ ఉద్రిక్తతలు తగ్గి, శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతుండటం.. మంచి విషయం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


