Oracle layoffs : భారత్‌లో 12,000 మంది ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్.. క్యాన్సర్​ రోగిని కూడా వదల్లేదు!

Oracle layoffs 2026 India : ప్రముఖ ఐటీ దిగ్గజం ఒరాకిల్ భారత్‌లో భారీ స్థాయిలో లేఆఫ్స్‌కు పాల్పడింది. సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిపై వేటు పడగా, బాధితుల్లో క్యాన్సర్ రోగులు, దశాబ్దాల కాలంగా సంస్థను నమ్ముకున్న సీనియర్ ఉద్యోగులు  సైతం ఉన్నారు.

Published on: Apr 01, 2026 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ ఐటీ రంగంలో ‘లేఆఫ్స్​’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సెగ భారతీయులను కూడా తాకింది! అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ సంస్థ ఒరాకిల్​.. భారత విభాగంలోని సుమారు 12వేల మంది ఉద్యోగులను ఒకేసారి తొలిగించినట్టు తెలుస్తోంది. గ్లోబల్ వైడ్‌గా కంపెనీ దాదాపు 30,000 మందిని తీసేయగా, అందులో గణనీయమైన సంఖ్యలో భారతీయులే ఉండటం గమనార్హం.

ఒరాకిల్​ లేఆఫ్స్​ 2026.. (Unsplash)
ఒరాకిల్​ లేఆఫ్స్​ 2026.. (Unsplash)

అయితే ఈ ఒరాకిల్​ లేఆఫ్స్​ ఇక్కడితో ఆగేడట్టు కనిపించడం లేదు! కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరో రౌండ్ మాస్ లేఆఫ్స్ ఉండవచ్చని సంస్థలోని మానవ వనరుల (హెచ్​ఆర్​) విభాగం చెప్పినట్టు సమాచారం.

ఒరాకిల్​ లేఆఫ్స్​ 2026- కంపెనీ ఏమంటోంది?

సంస్థాగత మార్పుల కారణంగా కొన్ని పోస్టులు ఎక్కువగా ఉన్నాయని, అందుకే కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒరాకిల్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో ఈ సంస్థకు 30,000 మంది సిబ్బంది ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 40 శాతం మందిపై ప్రభావం పడింది.

అయితే ఈ పరిణామంపై అధికారికంగా స్పందించడానికి ఒరాకిల్ నిరాకరించింది.

ఒరాకిల్​ లేఆఫ్స్​ 2026- పరిహారం ప్యాకేజీ వివరాలు..

స్వచ్ఛందంగా, సామరస్యపూర్వక పద్ధతిలో రాజీనామా చేసే వారికి మాత్రమే సెవరెన్స్ ప్యాకేజీని వర్తింపజేస్తున్నట్లు సంస్థ చెప్పడం గమనార్హం.

ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి 15 రోజుల జీతం.

టెర్మినేషన్ తేదీ వరకు రావాల్సిన బకాయిలు.

ఒక నెల నోటీస్ పీరియడ్ జీతం, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్.

వీటికి అదనంగా మరో రెండు నెలల జీతాన్ని 'టాప్-అప్'గా ఆఫర్ చేసింది.

ఒరాకిల్​ లేఆఫ్స్​ 2026- కలచివేస్తున్న కథలు.. మానవత్వం ఎక్కడ?

ఈ ఒరాకిల్​ లేఆఫ్స్ ప్రక్రియ అత్యంత అమానవీయంగా సాగిందంటూ రెడ్డిట్ వంటి సోషల్ మీడియా వేదికల్లో నెటిజన్లు మండిపడుతున్నారు.

క్యాన్సర్ రోగిపై ఈమెయిల్ వేటు: "మా నాన్న 20 ఏళ్లుగా ఒరాకిల్‌లో పనిచేస్తున్నారు. ఆయన రిటైర్మెంట్‌కు మరో రెండేళ్లు ఉండగా, కనీసం ఫోన్ కాల్ కూడా చేయకుండా ఈమెయిల్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇన్సూరెన్స్ కూడా లేకపోతే ఎలా?" అని ఒక బాధితుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

16 గంటల పనివేళలపై నిరసన: భారత్‌లో రోజుకు 16 గంటల పనివేళలను నిరసించినందుకు గత సెప్టెంబర్‌లోనే తనపై వేటు వేశారని మెరుగు శ్రీధర్ అనే మాజీ ఉద్యోగి ఆరోపించారు. అమెరికాలో చట్టాలు కఠినంగా ఉండటం వల్లే కంపెనీ భారతీయులను ఎక్కువగా లక్ష్యం చేసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇమ్మిగ్రేషన్ కష్టాలు: ఒక ఉద్యోగి తన గోడు వెళ్లబోస్తూ.. "ఒరాకిల్ నన్ను 6 నెలల క్రితమే అమెరికా నుంచి కెనడాకు బదిలీ చేసింది. ఇప్పుడు నా ఉద్యోగం పోయింది, ఇమ్మిగ్రేషన్ సమస్యలతో నా కుటుంబం రోడ్డున పడింది," అని ఆవేదన చెందారు.

ఒరాకిల్ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. కంపెనీలను నమ్ముకుని దశాబ్దాల పాటు శ్రమించిన వారికి ఇలాంటి బహుమతి ఇవ్వడం ఐటీ రంగంలోని చీకటి కోణాన్ని బయటపెడుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. ఒరాకిల్ ప్రకటించిన సెవరెన్స్ ప్యాకేజీ అందరికీ వర్తిస్తుందా?

లేదు. కంపెనీ అందించే ఈ ప్రత్యేక పరిహార ప్యాకేజీ కేవలం ‘సామరస్యపూర్వకంగా, స్వచ్ఛందంగా’ రాజీనామా చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా, రాజీనామా పత్రంపై సంతకం చేసిన వారికే ఈ 15 రోజుల అదనపు జీతం, రెండు నెలల టాప్-అప్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. నిరసన తెలిపే వారికి లేదా ఇతర కారణాలతో తొలగించిన వారికి ఇవి వర్తించకపోవచ్చు.

2. భారత్‌లో పనిచేస్తున్న ఒరాకిల్ ఉద్యోగులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉండటానికి కారణమేంటి?

కంపెనీ మాజీ ఉద్యోగుల కథనం ప్రకారం.. అమెరికా వంటి దేశాల్లో స్థానిక పౌరులను తొలగించాలంటే అక్కడి కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. భారీగా జరిమానాలు లేదా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ భారత్‌లో అటువంటి కఠినమైన నిబంధనలు లేకపోవడం, ఇక్కడి నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే, గ్లోబల్ లేఆఫ్స్‌లో భాగంగా అత్యధికంగా 12,000 మంది భారతీయులపై ఒరాకిల్ వేటు వేసిందని తెలుస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More