Real estate : ఐటీ లేఆఫ్స్ భయాలు- రియల్ ఎస్టేట్‌లో ‘పాజ్’ బటన్ మొదలైందా?
Bengaluru Real estate : ఏఐ ఎఫెక్ట్‌తో ఐటీ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. చాలా మంది ఉద్యోగాల కోత గురించి ఆందోళన చెందుతున్నారు. ఇది బెంగళూరు రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. తొలిసారి ఇల్లు కొనేవాళ్లల్లో చాలా మంది ఇప్పుడు వెనకడుగు వేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రధానంగా తొలిసారి ఇల్లు కొనే ఐటీ ఉద్యోగుల మీద ఆధారపడి నడుస్తుంది. ముఖ్యంగా రూ. 70 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల ధర కలిగిన సెగ్మెంట్‌లో వీరి పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. అయితే, ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఉద్యోగాల కోత మొదలవుతుందనే చర్చలు ఊపందుకోవడంతో, ఈ మార్కెట్‌లో ఒక్కసారిగా స్తబ్ధత మొదలైంది. ఐటీ రంగంలో లేఆఫ్స్ భయాలు గృహ నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తాయా అనే అంశంపై రెడ్డిట్ వంటి వేదికల్లో కొనుగోలుదారులు తీవ్రంగా చర్చిస్తున్నారు.

బెంగళూరు రియల్ ఎస్టేట్- లేఆఫ్స్, ప్రస్తుత పరిస్థితి..
రెడ్డిట్ వేదికగా ఒక వినియోగదారుడు పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. 2026 ప్రారంభంలో దాదాపు 5,000 నుంచి 7,000 ఐటీ ఉద్యోగాల్లో కోత విధించినట్లు ప్రకటించారు. బెంగళూరులోని ప్రధాన ఉపాధి కారిడార్లలో సుమారు 12 లక్షల మంది టెక్ ఉద్యోగులు ఉండగా, ఈ కోత చాలా స్వల్పంగా అనిపించవచ్చు. ఒకవేళ ఈ సంఖ్య 15,000 నుంచి 20,000కు చేరినా, అది మొత్తం శ్రామిక శక్తిలో చాలా తక్కువ శాతమే అవుతుంది.
అయినప్పటికీ, దీని ప్రభావం నేరుగా ఉద్యోగాలు కోల్పోవడం కంటే, కొనుగోలుదారులలో 'సంకోచం' రూపంలో కనిపిస్తోంది!్
"మొదటిసారి ఇల్లు కొనే టెక్ ఉద్యోగులు ప్రస్తుతం తమ నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు," అని మరో వినియోగదారుడు పేర్కొన్నారు.
మరికొందరి వాదన ప్రకారం.. లేఆఫ్స్ కంటే ‘నియామకాలు లేకపోవడం’ పెద్ద ఆందోళనగా మారింది. కంపెనీలు తొలగింపులు చేయకపోయినా, కొత్తవారిని చేర్చుకోవడం లేదు. దీంతో ఉద్యోగ ధోరణులపై స్పష్టత వచ్చే వరకు డిమాండ్ తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
బెంగళూరు రియల్ ఎస్టేట్- ప్రాంతాల వారీగా ప్రభావం, లిక్విడిటీ సమస్యలు..
బెంగళూరు రియల్ ఎస్టేట్‌లో ఐటీ రంగంపై మాత్రమే ఆధారపడిన మైక్రో-మార్కెట్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రెడ్డిట్ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. వివిధ రకాల పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉన్న ప్రాంతాలు కొంతవరకు తట్టుకోగలవు.
నగదు కొరత: "కొనుగోలుదారులు ఆగితే, విక్రయాల పరిమాణం పడిపోతుంది. దీనివల్ల బిల్డర్ల దగ్గర నగదు ప్రవాహం తగ్గి, మధ్య తరగతి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరగవచ్చు," అని ఒకరు హెచ్చరించారు.
రిటర్న్స్: ధరలు భారీగా పడిపోకపోయినా, అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయంలో వృద్ధి నెమ్మదిస్తే, అది పెట్టుబడిపై వచ్చే అసలు లాభాలను తగ్గించేస్తుంది.
బెంగళూరు రియల్ ఎస్టేట్- ఆ ప్రమాదంతో..!
కొందరు వినియోగదారులు దీన్ని స్వల్పకాలిక జాప్యంగా భావిస్తుండగా, మరికొందరు మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని హెచ్చరిస్తున్నారు.
"ఇది గోడకు కొట్టినట్లు తగులుతుంది," అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ఇళ్ల ధరలు భారీగా పడిపోకపోయినా, చాలా కాలం పాటు ఒకే చోట ఆగిపోయే (ప్రమాదం ఉంది. అధిక విలువలు, వలస వచ్చే టెక్ ఉద్యోగులపైనే ఆధారపడటం వల్ల రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో మార్కెట్ కరెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అంతేకాకుండా, చాలామంది కొనుగోలుదారులు తక్కువ ఆర్థిక బఫర్‌తో ఇల్లు కొంటున్నారని, ఆదాయానికి అంతరాయం కలిగితే వారు తీవ్ర ఇబ్బందుల్లో పడతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ మూడు నెలల పాటు వరుసగా ఈఎంఐలు చెల్లించకపోతే, బ్యాంకులు ఆ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసే ప్రమాదం ఉందని, ఇది ‘డిస్ట్రెస్ సేల్స్’ (తక్కువ ధరకే అమ్ముకోవడం) కు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
బెంగళూరు రియల్ ఎస్టేట్- నిపుణుల హెచ్చరిక..
ఆర్థిక ప్రణాళిక నిపుణుల ప్రకారం.. ఉద్యోగ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు గృహ రుణ ఈఎంఐలు పెరగడం ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. ముఖ్యంగా బడ్జెట్‌ను మించి ఇల్లు కొనేవారికి ఇది శాపంగా మారుతుంది. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నప్పటికీ, భారీ ఈఎంఐలు, రోజువారీ ఖర్చుల తర్వాత చేతిలో నగదు మిగలడం కష్టమవుతోంది.
ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ సురేష్ సదగోపన్ ప్రకారం.. స్థిరమైన ఖర్చులు నెలవారీ మిగులు ఆదాయాన్ని ఎంత వేగంగా హరిస్తాయనే విషయాన్ని చాలామంది అంచనా వేయలేకపోతున్నారు. దీనివల్ల మెడికల్ ఎమర్జెన్సీలు లేదా ఇతర ఆకస్మిక ఖర్చుల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
నిపుణుల సలహా: ఈఎంఐల భారం పెరగకుండా ఉండాలంటే అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి, అదనపు అప్పులు చేయకూడదు.
ముందస్తు జాగ్రత్త: ఇల్లు కొనేందుకు తొందరపడి భారీ లోన్ తీసుకోవడం కంటే, డౌన్‌పేమెంట్ మొత్తాన్ని పెంచుకోవడం ద్వారా తిరిగి చెల్లించే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


