భారత్‌లో 3,000 మందికి ఒరాకిల్ షాక్: ఏఐ వైపు భారీగా నిధుల మళ్లింపు
సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ భారత్‌లో 3,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి వేసేందుకు సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ రంగానికి నిధులను భారీగా మళ్లించే వ్యూహంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి ఉద్యోగుల కోతకు సిద్ధమవుతోంది. రాబోయే త్రైమాసికం ప్రారంభానికి ముందే కంపెనీ వ్యయాలను తగ్గించుకునే నిమిత్తం భారత్‌లో సుమారు 3,000 మంది సిబ్బందిని తొలగించే అవకాశముందని సమాచారం. కంపెనీ అంతర్గత చర్చల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడవచ్చు.

మరోవైపు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని వేగంగా విస్తరించేందుకు ఒరాకిల్ బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తోంది. ఈ భారీ మౌలిక వసతుల వ్యయానికి కావలసిన నిధులను సమకూర్చుకోవడానికి కంపెనీ జీతాల బిల్లులను నియంత్రించాలని భావిస్తోంది. సెప్టెంబర్ 1ని ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు కీలకమైన తేదీగా పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఈ మేరకు తొలగించాల్సిన ఉద్యోగ బాధ్యతలను నివేదించాలని ఒరాకిల్ యాజమాన్యం మేనేజర్లకు సూచించింది.
ఒరాకిల్ ఆదాయం రూ రూ రూ.. ఏఐ వ్యయాలు భారీగా పెంపు
2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ వార్షిక ఆదాయం 17 శాతం వృద్ధితో 67.4 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో క్లౌడ్ వ్యాపారం 39 శాతం పెరిగి 34 బిలియన్ డాలర్లను నమోదు చేయగా, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 77 శాతం పెరిగి 18.1 బిలియన్ డాలర్లకు చేరింది. నాలుగో త్రైమాసికంలోనే క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏకంగా 93 శాతం వృద్ధి చెందింది.
అయితే, ఈ వేగవంతమైన వృద్ధిని నిలబెట్టుకోవడానికి కంపెనీ భారీగా మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో 54 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 32 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ, ఫ్రీ క్యాష్ ఫ్లో మాత్రం ప్రతికూలంగా (-23.7 బిలియన్ డాలర్లు) నమోదైంది. వ్యాపారం ద్వారా వచ్చిన నగదు కంటే మౌలిక వసతుల కల్పనకు పెట్టిన మూలధన వ్యయమే (క్యాపెక్స్) ఎక్కువగా ఉండటం దీనికి కారణం.
ఏడాది వ్యవధిలోనే 13 శాతం సిబ్బంది తగ్గింపు
ఏడాది కాలంగా ఒరాకిల్ పెద్ద ఎత్తున సిబ్బందిని తగ్గించుకుంది. 2026 మే 31 నాటికి కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 1,41,000కు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే (1,62,000) దాదాపు 21,000 మంది అంటే 13 శాతం ఉద్యోగులను కంపెనీ తగ్గించింది.
సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలోనే అత్యధికంగా 6,000 ఉద్యోగాల కోత పడింది. దీంతో పాటు క్లౌడ్ సర్వీసెస్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డి) విభాగాల్లోనూ సిబ్బందిని తొలగించారు. అయితే, హార్డ్‌వేర్ విభాగంలో మాత్రం తక్కువ స్థాయిలో నిష్క్రమణలు జరిగాయి.
ఏఐ రంగానికి నిధుల మళ్లింపు
డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌కు పేరుగాంచిన ఒరాకిల్, ప్రస్తుతం ఏఐ మోడళ్లకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చాట్‌జిపిటి (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI), ఒరాకిల్‌తో 5 ఏళ్ల కాలానికి ఏకంగా 300 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ ఏఐ (xAI) కూడా తన 'గ్రోక్' మోడళ్ల నిర్వహణకు ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌నే ఉపయోగిస్తోంది.
ఎన్విడియా, మెటా, ఓపెన్ఏఐ, టిక్‌టాక్ వంటి దిగ్గజ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి 50 బిలియన్ డాలర్ల వరకు రుణ, ఈక్విటీ నిధులను సమీకరించాలని 2026 ఫిబ్రవరిలో ఒరాకిల్ నిర్ణయించింది. అంతకుముందు 2025 సెప్టెంబర్‌లోనూ 18 బిలియన్ డాలర్ల బాండ్లను విక్రయించింది.
పెరిగిన ఏఐ కాంట్రాక్టులు.. ఎగిసిన మూలధన వ్యయం
2026 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఒరాకిల్ పెండింగ్ ఆర్డర్ల విలువ (ఆర్‌పీఓ) 363 శాతం పెరిగి 638 బిలియన్ డాలర్లకు చేరింది. ద్వితీయార్థంలో కుదిరిన భారీ ఏఐ కాంట్రాక్టులే ఇందుకు కారణం.
ఇక ఒరాకిల్ మూలధన వ్యయం (Capex) 2026 ఆర్థిక సంవత్సరంలో 55.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాదితో పోలిస్తే (21.2 బిలియన్ డాలర్లు) ఇది రెట్టింపు కంటే ఎక్కువ. డేటా సెంటర్ల విస్తరణే ఈ వ్యయాల పెరుగుదలకు ప్రధాన కారణం.
ఓపెన్ఏఐ ఆధారిత వ్యయాలపై భిన్నాభిప్రాయాలు
ఒరాకిల్ ఏఐ దిశగా వేగంగా అడుగులు వేయడానికి ఓపెన్ఏఐ డిమాండ్ ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, "ప్రస్తుత ఏఐ బబుల్ అంతా నిజానికి ఒక ఓపెన్ఏఐ బబుల్ మాత్రమే" అని ఏఐ విశ్లేషకుడు ఎడ్ జిట్రాన్ వ్యాఖ్యానించారు. ఓపెన్ఏఐ పతనమైతే ఏఐ పరిశ్రమ మొత్తం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని ఆయన హెచ్చరించారు.
అయితే, వెస్టెడ్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ విరామ్ షా మాట్లాడుతూ.. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న అన్ని టెక్ దిగ్గజాలకు ఓపెన్ఏఐ పై ఒకే రకమైన ఆధారపడేతత్వం లేదని తెలిపారు.
టెక్ రంగాన్ని కుదిపేస్తున్న ఏఐ వ్యయాల మార్పు
వ్యయాలను తగ్గిస్తూ ఏఐ మౌలిక వసతులపై పెట్టుబడులు పెంచుతున్న కంపెనీల్లో ఒరాకిల్ ఒక్కటే లేదు. మైక్రోసాఫ్ట్ కూడా భారత్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులను పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ (పీఐపీ) పరిధిలోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇది భారత మైక్రోసాఫ్ట్ సిబ్బందిలో 2 శాతానికి సమానం.
సాంప్రదాయ వ్యాపారాల నుంచి నిధులను, వనరులను మళ్లించి ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ కెపాసిటీని పెంచుకోవడంపై ఒరాకిల్ దృష్టి పెట్టడం ఐటీ పరిశ్రమలో సరికొత్త సవాళ్లకు దారితీస్తోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


