ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో ముందంజలో నిలిచేందుకు బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తున్న దిగ్గజ టెక్ సంస్థ 'ఒరాకిల్' (Oracle) మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని తన సిబ్బందిపై వేటు వేస్తూ లేఆఫ్స్ రౌండ్‌ను ప్రారంభించింది. అయితే, ఈ ప్రక్రియలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇస్తున్న 'సివరెన్స్ ప్యాకేజీ' ఇతర ప్రధాన టెక్ కంపెనీలతో పోలిస్తే అత్యంత తక్కువగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పరిహారంలో కోతలు: ఒరాకిల్ నిబంధనలు ఇవే

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోయిన అమెరికా సిబ్బందికి ఒరాకిల్ 4 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, వారు పనిచేసిన ప్రతి ఏడాదికి ఒక వారం వేతనాన్ని అదనంగా చెల్లిస్తోంది. కంపెనీ ప్రామాణిక నిబంధనల ప్రకారం గరిష్టంగా 26 వారాల వేతనాన్ని మాత్రమే పరిహారంగా పొందే వెసులుబాటు ఉంది. కొత్తగా చేరిన వారైనా, ఏళ్లుగా సేవలందిస్తున్న వారైనా ఈ 26 వారాల పరిమితిని దాటి పరిహారం పొందే అవకాశం లేకపోవడం గమనార్హం.
ఏఐపై కోట్లు.. ఉద్యోగులపై వేటు
ఒరాకిల్ తన వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థాగత మార్పులు చేస్తోందని, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల విస్తరణ కోసం బిలియన్ల డాలర్ల అప్పులు సేకరిస్తోందని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే బాధితులకు పంపిన ఇమెయిళ్లలో కంపెనీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.
"ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను సమగ్రంగా సమీక్షించిన తర్వాత, విస్తృత సంస్థాగత మార్పుల్లో భాగంగా మీ ఉద్యోగ పాత్రను తొలగించాలని నిర్ణయించాం. ఈ రోజుతోనే మీ చివరి పనిదినం ముగుస్తుంది" అని ఆ ఇమెయిల్‌లో పేర్కొన్నారు.
అయితే ఈ దఫా ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే స్పష్టమైన సంఖ్యను కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. ఒకవైపు ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా నిధులు వెచ్చిస్తూ, మరోవైపు ఉన్నపలంగా సిబ్బందిని తొలగించడం ఒరాకిల్ వైఖరిపై విమర్శలకు దారితీస్తోంది.
మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ ప్యాకేజీలతో పోలిక
పోటీ సంస్థలైన మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ ఇస్తున్న పరిహారాలతో పోలిస్తే ఒరాకిల్ ప్యాకేజీ చాలా చిన్నదిగా కనిపిస్తోంది.
{{/usCountry}}పోటీ సంస్థలైన మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ ఇస్తున్న పరిహారాలతో పోలిస్తే ఒరాకిల్ ప్యాకేజీ చాలా చిన్నదిగా కనిపిస్తోంది.
{{/usCountry}}సేల్స్‌ఫోర్స్ (Salesforce): ఈ సంస్థ గరిష్టంగా 30 వారాల వేతనాన్ని పరిహారంగా అందిస్తోంది. ఉద్యోగుల హోదాను బట్టి కనీసం 9 నుంచి 13 వారాల వేతనంతో పాటు, పనిచేసిన ప్రతి ఏడాదికి 3 వారాల అదనపు వేతనాన్ని ఇస్తోంది.
మైక్రోసాఫ్ట్ (Microsoft): ఇటీవల చేపట్టిన తొలగింపుల్లో మైక్రోసాఫ్ట్ గరిష్టంగా 39 వారాల వరకు ప్రాథమిక వేతనాన్ని ఇచ్చింది. అంతేకాకుండా కనీసం 60 రోజుల వేతనంతో పాటు, ప్రతి ఆరు నెలల సర్వీసుకు 1 నుంచి 2 వారాల అదనపు వేతనాన్ని పరిహారంగా అందించింది.
మైక్రోసాఫ్ట్ ఇచ్చే 39 వారాలు, సేల్స్‌ఫోర్స్ ఇచ్చే 30 వారాల గరిష్ట పరిమితితో పోలిస్తే ఒరాకిల్ విధిస్తున్న 26 వారాల పరిమితి చాలా తక్కువ. హఠాత్తుగా ఉద్యోగం కోల్పోయిన సగటు ఉద్యోగికి మరొక ఉద్యోగం వెతుక్కునేందుకు, కుటుంబ ఖర్చులు నెట్టుకొచ్చేందుకు కొన్ని అదనపు వారాల వేతనం ఎంతో కొండంత అండగా నిలుస్తుంది. కానీ ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయం బాధితులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.