Oracle layoffs : ఏఐ డేటా సెంటర్ల కోసం డబ్బులు కావాలంటూ.. 30వేల ఉద్యోగులను తీసేస్తున్న ఒరాకిల్​!

ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన నిధుల కోసం ఒరాకిల్ 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా బ్యాంకులు పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేయడంతో, ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని సమాచారం.

Published on: Feb 2, 2026, 09:40:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
ఓరాకిల్​లో మరోసారి ఉద్యోగాల కోత (REUTERS)
ఓరాకిల్​లో మరోసారి ఉద్యోగాల కోత (REUTERS)

టెక్ ప్రపంచంలో ఏఐ రేసు ఊపందుకుంటున్న వేళ, ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 30,000 మంది ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ భావిస్తోంది. తద్వారా నిధులను ఆదా చేసి, డేటా సెంటర్ల నిర్మాణానికి మళ్లించాలని యోచిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 'టీడీ కోవెన్​' పరిశోధనా నివేదికను ఉటంకిస్తూ 'సీఐఓ' అనే సంస్థ ఈ సంచలన విషయాలను బయటపెట్టింది.

ఒరాకిల్ భారీ లేఆఫ్​: 30,000 ఉద్యోగాల తొలగింపు?

ఒరాకిల్​కి తన ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం సుమారు 156 బిలియన్ డాలర్ల మూలధన వ్యయం అవసరమని టీడీ కోవెన్​ అంచనా వేసింది. అయితే, ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సందేహిస్తున్నాయని తెలుస్తోంది.

గత కొన్ని వారాలుగా పలు అమెరికా బ్యాంకులు ఒరాకిల్‌కు రుణాలు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గాయని సమాచారం.

సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్​ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే బాధ్యతను ఒరాకిల్ తీసుకుంది. కానీ నిధుల ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది.

లేఆఫ్స్ వల్ల కంపెనీకి కలిగే లాభం ఏంటి?

ఈ భారీ లేఆఫ్స్ ద్వారా ఒరాకిల్ సుమారు 8 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఫ్రీ క్యాష్ ఫ్లో పొందవచ్చని నివేదిక పేర్కొంది.

ఈ దఫా ఒరాకిల్​ లేఆఫ్స్​లో 20,000 నుంచి 30,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

అయితే, తాజా పరిణామాలపై ఒరాకిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే, కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద లేఆఫ్ అవుతుంది.

రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌లో భాగంగా గత ఏడాది (2025) చివరిలో ఒరాకిల్ 10,000 మందిని తొలగించింది.

అమెజాన్ సైతం ఏఐ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా 16,000 మందిని తొలగించిన కొన్ని రోజులకే ఒరాకిల్ నుంచి ఈ వార్త రావడం టెక్ రంగంలో కలకలం రేపుతోంది.

మెటా సైతం ఈ ఏడాదిలో ఇప్పటికే 1000కిపైగా మంది ఉద్యోగులను తొలగించింది.

సెర్నర్ విక్రయం.. క్లయింట్లపై భారం

కేవలం ఉద్యోగాల కోత మాత్రమే కాకుండా, మరికొన్ని కఠిన నిర్ణయాలను కూడా ఒరాకిల్ పరిశీలిస్తోంది. అవి..

సెర్నర్ విక్రయం: 2022లో 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ విభాగం 'సెర్నర్'ను విక్రయించే ఆలోచనలో ఒరాకిల్​ ఉంది.

క్లయింట్ల భాగస్వామ్యం: ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి క్లయింట్లే స్వయంగా సహకరించాలని ఒరాకిల్ కోరుతోంది. అంటే మౌలిక సదుపాయాల కల్పనలో క్లయింట్లను కూడా భాగస్వాములను చేస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని సంస్థ చూస్తోంది. దీనిని “బ్రింగ్​ యుర్​ ఓన్​ చిప్​” అని సంస్థ పిలుస్తోంది.

క్లౌడ్​ ఇన్​ఫ్రాస్టక్చర్​ కోసం ఈ 2026లో 45 బిలియన్​ డాలర్ల నుంచి 50 బిలియన్​ డాలర్ల నిధులను సమకూర్చుకోవాలని సంస్థ భావిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More