...
...
Next Story

Orient cables : 65శాతం ప్రీమియంతో లిస్టింగ్- మరుసటి రోజే ఢమాల్.. ఓరియంట్ కేబుల్స్ షేర్లు బై? ఆర్​ సెల్?

లిస్టింగ్ రోజు మదుపర్లకు 65 శాతం దాకా బంపర్ లాభాలు అందించిన ఓరియంట్ కేబుల్స్ షేర్లు, మరుసటి రోజే లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ పతనం వెనుక గల కారణాలు, కంపెనీ ఆర్థిక బలం, నిపుణుల విశ్లేషణను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Oct 6, 2026, 11:20:58 IST
Advertisement

సోమవారం బంపర్ లిస్టింగ్​తో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఓరియంట్ కేబుల్స్ (ఇండియా) లిమిటెడ్ షేర్లు మరుసటి రోజే మదుపర్లకు ఊహించని పరిణామాన్ని చూపించాయి. సోమవారం (అక్టోబర్ 5, 2026) ఐపీఓ ఆఫర్ ధర రూ. 272 కంటే ఏకంగా 65 శాతం అధికంగా రూ. 448 వద్ద లిస్ట్ అయిన ఈ షేరు, మంగళవారం (అక్టోబర్ 6) ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 10 శాతం పతనమైంది. బీఎస్‌ఈలో సోమవారం రూ. 403.30 వద్ద ముగిసిన షేరు ధర, మంగళవారం రూ. 380 వద్ద ప్రారంభమై లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) ఒత్తిడితో రూ. 363 లోయర్ సర్క్యూట్‌‌ను తాకింది.

ఓరియంట్ కేబుల్స్ షేరు ధర డౌన్- కొనాలా? అమ్మేయాలా? (an AI-generated image for representational purposes)
ఓరియంట్ కేబుల్స్ షేరు ధర డౌన్- కొనాలా? అమ్మేయాలా? (an AI-generated image for representational purposes)

అయితే ఈ పతనం తర్వాత కూడా ఐపీఓ ప్రారంభ ధరతో పోలిస్తే ఈ షేరు ఇంకా 33 శాతం లాభంలోనే కొనసాగుతుండటం ఊరటనిచ్చే అంశం.

ఓరియంట్ కేబుల్స్ షేరు ధర- పతనానికి కారణం..

ఓరియంట్ కేబుల్స్ షేరు ధరలో ఈ ఆకస్మిక పతనానికి మార్కెట్ నిపుణులు ప్రధాన కారణాన్ని విశ్లేషించారు. తొలిరోజే బీఎస్‌ఈలో రూ. 448 వద్ద (ఎన్‌ఎస్‌ఈలో రూ. 450) భారీ లాభాలు దక్కడంతో, స్వల్పకాలిక మదుపర్లు తక్షణ లాభాలను చేజిక్కించుకునేందుకు షేర్లను విక్రయించడం ప్రారంభించారు. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడం వల్లే ధర ఒక్కసారిగా పడిపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే నెలల్లో కంపెనీ త్రైమాసిక రాబడుల వృద్ధి, నికర లాభాలు, ఆర్డర్ల అమలు, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణపైనే మార్కెట్ దృష్టి కేంద్రీకరించనుంది.

ఓరియంట్ కేబుల్స్- కంపెనీ వ్యాపారం, గ్లోబల్ విస్తరణ..

ఓరియంట్ కేబుల్స్ ప్రధానంగా బీ2బీ విభాగంలో నెట్‌వర్కింగ్ కేబుల్స్, పాసివ్ నెట్‌వర్కింగ్ పరికరాల తయారీ రంగంలో కొనసాగుతోంది. టెలికాం, బ్రాడ్‌బ్యాండ్, డాటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధనం, స్మార్ట్ బిల్డింగ్ ఆటోమేషన్, ఎఫ్‌‌ఎంఈజీ, ఆటోమోటివ్, ఈ-మొబిలిటీ వంటి వేగంగా విస్తరిస్తున్న రంగాలకు ఈ కంపెనీ కేబుల్స్ సరఫరా చేస్తోంది. యూఏఈ, ఖతార్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నేపాల్, సింగపూర్, నెదర్లాండ్స్ వంటి అనేక దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఓరియంట్ కేబుల్స్- గత మూడేళ్ల ఆర్థిక ప్రగతి..

ఆదాయం : 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 657.77 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం, ఎఫ్​వై25 నాటికి రూ. 824.96 కోట్లకు, అలాగే ఎఫ్​వై26 నాటికి రూ. 1,171.65 కోట్లకు పెరిగింది.

నికర లాభం (ప్యాట్): ఎఫ్​వై24లో రూ. 40.1 కోట్లుగా నమోదు కాగా, ఎఫ్​వై25లో రూ. 53.3 కోట్లకు, ఎఫ్​వై26లో రూ. 53.56 కోట్లకు చేరింది.

ఓరియంట్ కేబుల్స్ షేరు ధర- కొనాలా? అమ్మేయాలా?

ఓరియంట్ కేబుల్స్ షేరు ధర విషయంలో స్టాక్ మార్కెట్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి ఆందోళన చెందవద్దని నిపుణులు సూచిస్తున్నారు!

"భారతదేశంలో నెట్‌వర్కింగ్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మార్కెట్‌కు రాబోయే రోజుల్లో అపారమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలిక లిస్టింగ్ లాభాల కంటే కంపెనీ త్రైమాసిక రాబడులు, ఆర్డర్ల అమలు, ఎబిట్​డా మార్జిన్లు, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణను మదుపర్లు నిశితంగా పరిశీలించాలి," అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ రవి సింగ్ పేర్కొన్నారు.

భారత నెట్‌వర్కింగ్ కేబుల్స్ మార్కెట్ ఎఫ్​వై26 నుంచి ఎఫ్​వై31 మధ్య కాలంలో 18.7 శాతం సీఏజీఆర్​ వృద్ధి చెంది రూ. 8,450 కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ మార్కెట్ కూడా 17.3 శాతం కాంపౌండ్ వృద్ధితో రూ. 10,500 కోట్ల నుంచి రూ. 23,310 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. డిజిటల్ మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో దీర్ఘకాలిక మదుపర్లు కంపెనీ ప్రగతిని పరిశీలిస్తూ ముందడుగు వేయవచ్చని రవి సింగ్ విశ్లేషించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks