New Zealand Visa : అమెరికా, ఆస్ట్రేలియా వీసా కష్టాలు.. భారత విద్యార్థులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్!

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లక్షల రూపాయలు వెచ్చించే భారతీయ కుటుంబాలకు న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల పోస్ట్-స్టడీ వర్క్ వీసాలలో కొత్త మార్పులు తీసుకొస్తొంది. నవంబర్ 16, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన నిబంధనల సమగ్ర విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 19, 2026, 16:22:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సొంతదేశంలో డిగ్రీ పూర్తి చేసి, ఉన్నత భవిష్యత్తు కోసం విదేశీ బాట పట్టే భారతీయ విద్యార్థులకు కేవలం మంచి విశ్వవిద్యాలయంలో సీటు సాధించడమే ప్రధాన లక్ష్యం కాదు! చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎంతకాలం ఉండేందుకు అనుమతి లభిస్తుంది? అనేది అత్యంత కీలకమైన ప్రశ్న. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వీసాల్లో ఇటీవలి కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం తన పోస్ట్-స్టడీ వర్క్ వీసా నిబంధనల్లో సంచలనాత్మక మార్పులు చేసింది.

న్యూజిలాండ్ షార్ట్-టర్మ్ గ్రాడ్యుయేట్ వర్క్ వీసా అప్డేట్స్..
న్యూజిలాండ్ షార్ట్-టర్మ్ గ్రాడ్యుయేట్ వర్క్ వీసా అప్డేట్స్..

నవంబర్ 16 నుంచి కొత్త వర్క్ వీసా విధానం..

ప్రస్తుతం ఉన్న పోస్ట్-స్టడీ వర్క్ వీసాకు (పీఎస్​డబ్ల్యూవీ) అర్హత సాధించని అంతర్జాతీయ విద్యార్థుల కోసం న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రత్యేకంగా 'షార్ట్-టర్మ్ గ్రాడ్యుయేట్ వర్క్ వీసా'ను ప్రవేశపెడుతోంది. 2026 నవంబర్ 16 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ప్రకారం.. అర్హులైన గ్రాడ్యుయేట్లకు ఆరు నెలల పాటు ఓపెన్ వర్క్ రైట్స్ లభిస్తాయి. ఈ ఆరు నెలల వ్యవధిలో విద్యార్థులు తమ అర్హతకు తగిన ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి లేదా దీర్ఘకాలిక వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

దీనితో పాటు మరొక కీలక మార్పును కూడా న్యూజిలాండ్ అధికారులు తీసుకొచ్చారు. భారతదేశంలో ఇప్పటికే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌లో అర్హత కలిగిన లెవెల్ 7 గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పోస్ట్-స్టడీ వర్క్ వీసా పొందడానికి అర్హత సాధిస్తారు. భారతీయ విద్యార్థులకు ఇది ఎంతో ఊరట కలిగించే అంశం.

అయితే, ఈ రెండు వీసాల మధ్య ఉన్న తేడాను విద్యార్థులు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కొత్తగా తీసుకొచ్చిన ఆరు నెలల వీసా కేవలం ఒక తాత్కాలిక వంతెన లాంటిది మాత్రమే. దీనిని ఒక్కసారి మాత్రమే ఇస్తారు, పైగా ఇది సుదీర్ఘ పోస్ట్-స్టడీ వర్క్ వీసాకు ప్రత్యామ్నాయం కాదని గ్రహించాలి.

న్యూజిలాండ్‌లో భారతీయ విద్యార్థుల హవా..

న్యూజిలాండ్ అంతర్జాతీయ విద్యా రంగం వేగంగా పుంజుకుంటోంది. 2025 గణాంకాల ప్రకారం ఆ దేశంలో 92,580 మంది అంతర్జాతీయ విద్యార్థులు చేరగా, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇందులో ఏకంగా 14 శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. చైనా తర్వాత న్యూజిలాండ్‌కు విద్యార్థులను పంపే రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.

ఈ నేపథ్యంలో మారిన నిబంధనలు భారతీయ విద్యార్థుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని విదేశీ విద్యా నిపుణులు భావిస్తున్నారు. యూనివర్సిటీ లివింగ్ కో-ఫౌండర్, సీఓఓ మయాంక్ మహేశ్వరి ఈ అంశంపై స్పందిస్తూ, "కోర్సు పూర్తయిన తర్వాత అవకాశాల కోసం చూసే భారతీయ విద్యార్థులకు ఈ కొత్త నిబంధనలు మరొక కీలక అంశంగా మారతాయి. అయితే కేవలం వర్క్ వీసా వ్యవధిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఏ దేశాన్ని ఎంచుకోకూడదు. కోర్సు నాణ్యత, మొత్తం వ్యయం, ఉద్యోగావకాశాలు, వీసా నిబంధనలను సమగ్రంగా పరిశీలించాలి," అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కోర్సు ఎంపికలోనే ఉపాధి అవకాశాలు..

న్యూజిలాండ్‌లో ఏ కోర్సు చేసినా ఆటోమేటిక్‌గా ఒకే రకమైన ఉద్యోగావకాశాలు వస్తాయని అనుకోవడం పొరపాటు. కొత్తగా తెచ్చిన ఆరు నెలల షార్ట్-టర్మ్ వీసా లెవెల్ 5 నుంచి 7 వరకు గల నిర్దిష్ట కోర్సులు పూర్తి చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇక లెవెల్ 7 గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆధారిత సుదీర్ఘ వర్క్ వీసా పాత బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారికి వర్తిస్తుంది.

అందుకే విశ్వవిద్యాలయం పేరు చూసి లేదా సబ్జెక్టు ప్రాచుర్యాన్ని చూసి కళ్లు మూసుకుని చేరిపోకూడదు. ఆ కోర్సు కరికులం ఏంటి, అది తమకు కావాల్సిన పోస్ట్-స్టడీ వర్క్ వీసా నిబంధనలకు సరిపోతుందా లేదా అని ముందే సరిచూసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యూషన్ ఫీజు ఒక్కటే కాదు.. జీవన వ్యయాల లెక్కింపు ముఖ్యం

విదేశీ విద్యకు ప్రణాళిక రచించే సమయంలో కేవలం కాలేజీ ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా నివాసం, ఆహారం, ప్రయాణం, ఇన్సూరెన్స్, రోజువారీ ఖర్చులను లెక్కలోకి తీసుకోవాలి.

జీవన వ్యయం నిధి: న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ప్రతీ విద్యార్థి తమ వద్ద ఏడాది జీవన వ్యయాల కోసం కనీసం NZ$20,000 (న్యూజిలాండ్ డాలర్లు) నిధులు ఉన్నట్లు చూపించాలి.

నివాస ఖర్చులు: షేరింగ్ గదిలో ఉండే వారికి వారానికి దాదాపు NZ$140 నుంచి ప్రారంభమై, అన్ని వసతులు ఉండే హాల్స్ లో ఉండే వారికి వారానికి NZ$484 వరకు అవుతుంది.

కిరాణా ఖర్చులు: వారానికి దాదాపు NZ$80 నుంచి NZ$120 వరకు ప్రాథమిక ఆహార ఖర్చులు అవుతాయి.

అకాడమిక్ సెషన్‌లో విద్యార్థులు వారానికి 25 గంటల వరకు పార్ట్-టైమ్ పని చేయడానికి వీలుంది. అయితే, కేవలం పార్ట్ టైమ్ ఉద్యోగం ఆధారంగానే మొత్తం ఫీజులు, ఖర్చులు వెళ్లదీయవచ్చని అనుకోవడం ఏమాత్రం క్షేమకరం కాదు.

డిమాండ్ ఉన్న కోర్సులు ఇవే..

భారతీయ విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), డేటా సైన్స్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, హెల్త్‌కేర్ విభాగాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే చదువు పూర్తయిన తర్వాత ఆయా పరిశ్రమలతో కాలేజీకి ఉన్న అనుసంధానం, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, కెరీర్ గైడెన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. సరైన ప్రణాళికతో కోర్సును ఎంచుకున్నప్పుడే న్యూజిలాండ్ తీసుకొచ్చిన ఈ కొత్త వర్క్ వీసా నిబంధనలు భారతీయ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More