Tokyo earthquake today : జపాన్​లో మరోసారి భూకంపం- వణికిపోయిన టోక్యో!

జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. టోక్యోతో పాటు తూర్పు ప్రాంతాలు ప్రకంపనలతో వణికిపోయాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.

Published on: Aug 23, 2026, 09:10:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జపాన్‌ను భూకంపం మరోసారి భయపెట్టింది. ఆదివారం తెల్లవారుజామున తూర్పు జపాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా రాజధాని టోక్యో ప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంతో ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

జపాన్​లో మరోసారి భూకంపం- వణికిపోయిన టోక్యో! (Representative/AFP)
జపాన్​లో మరోసారి భూకంపం- వణికిపోయిన టోక్యో! (Representative/AFP)

జపాన్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తరచూ భూకంపాలు సంభవించే ఇబరాకి ప్రిఫెక్చర్ దక్షిణ ప్రాంత భూగర్భంలో 70 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం కేంద్రీకృతమైంది.

అయితే యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం దీని తీవ్రతను 5.8గా రికార్డ్ చేసింది.

గాయపడిన వారిలో వృద్ధురాలు కూడా..

ఈ జపాన్ భూకంపం కారణంగా నాలుగు ప్రిఫెక్చర్లలో మొత్తం 23 మంది గాయపడ్డారు. సైతామాలో తొమ్మిది మంది, కనగావాలో తొమ్మిది మంది, చిబాలో నలుగురు, ఇబరాకిలో ఒకరు గాయపడినట్లు ఆయా ప్రాంతాల అధికారులు వెల్లడించారు.

నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో మంచం మీద నుంచి కిందకు దూకడం, పరుగుపెట్టే ప్రయత్నంలో ఫర్నిచర్ లేదా తలుపులకు తగలడం వల్ల చాలా మంది గాయపడ్డారు. కనగావా ప్రిఫెక్చర్‌లోని యోకోహామాలో మంచం మీద నుంచి పడిపోయి 80 ఏళ్ల వృద్ధురాలు తుంటి భాగంలో తీవ్రంగా గాయపడినట్లు 'యోమియురి' పత్రిక పేర్కొంది.

రైలు సర్వీసులు, విద్యుత్ సరఫరాకు అంతరాయం..

ఈ జపాన్ భూకంప ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా పడింది. టోక్యో, నరిటా విమానాశ్రయానికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అయితే షింకన్‌సెన్ బుల్లెట్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తున్నట్లు ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది.

భూ ప్రకంపనలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని సనే తకైచి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

జపాన్ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్‌లు మోగాయి. టోక్యో నగరంలో ప్రకంపనలు తీవ్రంగా కనిపించాయి. టోక్యోలోని కోటో ఈశాన్య వార్డులో భూగర్భ నీటి పైపు పగిలిపోవడంతో రోడ్డుపై నీరు ఉప్పొంగి ప్రవహించింది. అయితే వెంటనే స్పందించిన సిబ్బంది పైపును బాగుచేసి నీటి లీకేజీని అరికట్టారు! టోక్యోలో సుమారు 460 ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, ఆదివారం ఉదయానికల్లా పునరుద్ధరించినట్లు టెప్కో పవర్ గ్రిడ్ వెల్లడించింది.

అణు సామర్థ్యం కలిగిన ప్లాంట్లు, సుమారు డజనుకు పైగా అణు విద్యుత్ కేంద్రాల్లో భూకంపం కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదని, అన్నీ సురక్షితంగా ఉన్నాయని అణు నియంత్రణ ప్రాధికార సంస్థ తెలిపింది.

కాగా, సరిగ్గా నెల రోజుల క్రితం జపాన్ దక్షిణ ద్వీపమైన క్యుషులోని కుమమోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో భవనాలు ధ్వసమయ్యాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More