ITR Filing 2026 : ఇప్పటికే రికార్డు స్థాయిలో ఐటీఆర్ ఫైలింగ్స్.. 7.3 కోట్లకు పైగానే!
ITR Filing 2026 : అసెస్మెంట్ ఇయర్ 2026కి సంబంధించి రూ. 7.3 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 4-5% పెరగ్గా, కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ల సంఖ్యను 536కి తగ్గించినట్లు రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వెల్లడించారు.
దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరుగుతోంది. అసెస్మెంట్ ఇయర్ (ఏవై) 2026కు సంబంధించి ఇప్పటివరకు ఏకంగా 7.3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయని, ఇది గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ శుక్రవారం వెల్లడించారు. పన్ను చట్టాలను సరళతరం చేయడం, ఫేస్‌లెస్ విచారణలను బలోపేతం చేయడం, పన్ను చెల్లింపుదారులకు సేవలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఆదాయపు పన్ను శాఖను కేవలం చట్టాలను అమలు చేసే సంస్థగానే కాకుండా, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఒక సహాయకారిగా చూడాలని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. సాంకేతికతను ఉపయోగించుకుని పన్నుల నిర్వహణను మరింత స్మార్ట్‌గా, సమర్థవంతంగా మార్చాలని సూచించారు.
మానవ ప్రమేయాన్ని తగ్గించి, ఆటోమేషన్‌ను పెంచడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఫేస్‌లెస్ పన్ను వ్యవస్థను మరింత విస్తరించడంతో పాటు, నిలకడైన, సులువైన పన్ను విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఐటీఆర్ ఆలస్యమైతే పడే 5 రకాల పెనాల్టీలు ఇవే.. జులై 31 ముందే ఫైల్ చేయండి
వేగంగా పరిష్కారమవుతున్న అప్పీళ్లు, ఫిర్యాదులు!
ఆదాయపు పన్ను శాఖ పనితీరును వివరిస్తూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై26) ఏకంగా 2.24 లక్షల పన్ను అప్పీళ్లను పరిష్కరించినట్లు రెవెన్యూ కార్యదర్శి తెలిపారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 30 శాతం పెరుగుదలను సూచిస్తోంది. దీనికి తోడు పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన దాదాపు 4 లక్షల ఫిర్యాదులను పరిష్కరించి, 95 శాతానికి పైగా డిస్పోజల్ రేటును సాధించినట్లు ఆయన వెల్లడించారు.
ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై26) గ్రాస్, నెట్ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 4 నుంచి 5 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
సులభంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం..
భారత పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం’ ఒక అద్భుతమైన సంస్కరణ అని అరవింద్ శ్రీవాస్తవ కొనియాడారు. ఈ భారీ మార్పులో భాగంగా పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను కుదించి, కేవలం 536 సెక్షన్లకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఇదీ చూడండి : గడువు ముగిసేలోగా ఐటీఆర్ ఫైల్ చేయండి: పన్ను చెల్లింపుదారులకు నిపుణుల సూచన
దీనివల్ల సాధారణ పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారవేత్తలకు చట్టంపై స్పష్టత రావడంతో పాటు నిబంధనల అమలు చాలా సులభతరం అవుతుందని చెప్పారు. పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత, పన్ను చెల్లింపుదారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ సంస్కరణలు రూపుదిద్దుకున్నాయని ఆయన వివరించారు.
కాగా.. ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్‌కి డెడ్‌లైన్ జులై 31. గడువును పొగించే అవకాశాలు లేకపోవడంతో ప్రజలు ముందుగానే రిటర్నులు దాఖలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


