Sign in

DC vs PBKS : 265 రన్స్ సింపుల్ గా కొట్టేశారు - IPL చరిత్రలో పంజాబ్ కింగ్స్ రికార్డు ఛేజింగ్..!

IPL 2026 PBKS vs DC : ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్ కింగ్స్ కళ్లు చెదిరే రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.5 ఓవర్లలోనే ఛేదించి… టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత భారీ ఛేజింగ్‌ను నమోదు చేసింది.

Published on: Apr 25, 2026, 20:18:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPL 2026 PBKS vs DC : ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అసాధారణ ఆటతీరుతో చరిత్ర సృష్టించింది. ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించి…. సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా…. ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత విజయవంతమైన రికార్డు ఛేజింగ్ కావడం విశేషం.

ఐపీఎల్‌లో పంజాబ్ సరికొత్త రికార్డు
ఐపీఎల్‌లో పంజాబ్ సరికొత్త రికార్డు

ఓపెనర్ల మెరుపు ఆరంభం

265 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన ఈ స్టార్ ఓపెనర్లు…, పవర్ ప్లేలో కేవలం 6 ఓవర్లలోనే స్కోరు బోర్డును 105 పరుగులకు చేర్చారు. ఇది ఈ సీజన్‌లోనే అత్యధిక పవర్ ప్లే స్కోరు.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కేవలం 26 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో తొలి వికెట్‌కు కేవలం 6.5 ఓవర్లలోనే 126 పరుగులు నమోదయ్యాయి.

శ్రేయస్ మెరుపులు….

వరుసగా మూడు వికెట్లు కోల్పోయి పంజాబ్ కాస్త తడబడినట్లు అనిపించినా…. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. తనకు లభించిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్న అయ్యర్…. 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో పంజాబ్ ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి (ఒకటి వర్షం వల్ల రద్దు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఓటమిపాలైన ఢిల్లీ… ఆరో స్థానంలో నిలిచింది. 7 మ్యాచ్ లు ఆడగా… కేవలం మూడింటిల్లో మాత్రమే నెగ్గింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు (152 నాటౌట్) సాధించి రికార్డు సృష్టించాడు. నితీష్ రాణా (91) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, పంజాబ్ బ్యాటర్ల ధాటికి ఢిల్లీ భారీ స్కోరు కూడా తలవంచక తప్పలేదు. గతంలో 2024లో కోల్‌కతాపై పంజాబ్ సాధించిన 261 పరుగుల ఛేజింగ్ రికార్డును ఈ రోజు వారే తిరగరాశారు.

ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ మొదలు కాగానే ఢిల్లీ ఆటగాడు లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్షర్ పటేల్ వేసిన 2.3 ఓవర్‌లో ప్రియాంశ్ క్యాచ్‌ను అందుకునేందుకు ప్రయత్నించి ఎంగిడి కిందపడ్డాడు. అతడి తల నేలకు బలంగా తాకింది.. వెంటనే అంబులెన్స్‌ను మైదానంలోకి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. ఎంగిడి కోలుకోవాలని ఢిల్లీతో పాటు ఇతర జట్లు ఆటగాళ్లు ఆకాంక్షిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More