Iran War : ఇరాన్‌పై అమెరికా ‘గ్రౌండ్ ఆపరేషన్’? ఖార్గ్ ఐలాండ్ సీజ్ చేసేందుకు పెంటగాన్ సన్నద్ధం..

పశ్చిమాసియాలో యుద్ధం ఐదో వారానికి చేరుకున్న వేళ, ఇరాన్ భూభాగంలోకి పదాతి దళాలను పంపేందుకు అమెరికా పెంటగాన్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది! ఖార్గ్ ఐలాండ్ స్వాధీనం, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ సమీప తీరప్రాంతాలపై దాడులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగనుంది.

Published on: Mar 29, 2026, 10:10:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాలో యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించిన తరుణంలో, ఇరాన్ లోపల వారాల పాటు సాగే 'గ్రౌండ్ ఆపరేషన్స్' కోసం పెంటగాన్ సిద్ధమవుతోందని 'వాషింగ్టన్ పోస్ట్' నివేదించింది. ఇందులో భాగంగా ఇరాన్‌కు చెందిన చమురు నిల్వ కేంద్రం ఖార్గ్ ఐలాండ్, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ సమీపంలోని తీరప్రాంతాలపై అమెరికా దాడులు చేసే అవకాశం ఉంది.

ఇరాన్​లో అమెరికా గ్రౌండ్​ ఆపరేషన్​?
ఇరాన్​లో అమెరికా గ్రౌండ్​ ఆపరేషన్​?

ఈ ప్రణాళికల్లో స్పెషల్ ఆపరేషన్స్, సాధారణ పదాతి దళాల దాడులు ఉండవచ్చని సమాచారం. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రణాళికలకు ఆమోదం తెలుపుతారా? లేదా? అనేది ఇంకా స్పష్టత లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.

కాగా ఈ భూతల దాడులు కేవలం నిర్దిష్ట లక్ష్యాల కోసమే తప్ప, ఇరాన్‌ను పూర్తిగా ఆక్రమించుకునే ఉద్దేశం కాదని వాషింగ్టన్ పోస్ట్ స్పష్టం చేసింది.

ఇరాన్​ యుద్ధం- ఖార్గ్ ఐలాండ్ లక్ష్యంగా..

ఇరాన్​కి చెందిన అతిపెద్ద చమురు టెర్మినల్ ఉన్న ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడంపై ట్రంప్ యంత్రాంగం చర్చిస్తోంది. గత నెలలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి టెహ్రాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌ను సమర్థవంతంగా దిగ్బంధించింది. ఈ తీరప్రాంతాల్లో దాడులు చేయడం ద్వారా వాణిజ్య, మిలిటరీ నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ ఆయుధాలను కనుగొని నాశనం చేయాలని అమెరికా భావిస్తోంది.

ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి "కొన్ని వారాల సమయం" పడుతుందని ఒక అధికారి తెలపగా, మరొకరు "రెండు నెలల వరకు" పట్టవచ్చని పేర్కొన్నారు.

ముందే సిద్ధం చేసిన ప్రణాళిక..

అమెరికా సైనిక వ్యూహాలతో పరిచయం ఉన్న ఒక మాజీ సీనియర్ రక్షణ అధికారి మాట్లాడుతూ, ఇవి చాలా విస్తృతమైన ప్రణాళికలని చెప్పారు. "మేము దీనిని ఇప్పటికే పరిశీలించాము, వార్-గేమింగ్ కూడా చేశాము. ఇది చివరి నిమిషంలో చేసిన ప్లాన్ కాదు," అని ఆయన వివరించారు.

ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల అక్కడి ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనను ఇరకాటంలో పెట్టవచ్చని, అలాగే భవిష్యత్తులో జరిగే చర్చల్లో ఇది ఒక బలమైన “బేరసారాల అస్త్రం”గా ఉపయోగపడుతుందని సదరు అధికారి తెలిపారు. అయితే, స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో అమెరికా దళాలకు రక్షణ కల్పించడమే అతిపెద్ద సవాలు అని ఆయన హెచ్చరించారు.

"ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడం కష్టం కాదు, కానీ అక్కడ ఉన్న మన సైనికులను కాపాడుకోవడమే అసలైన పని," అని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ ముడిచమురు ఎగుమతుల్లో 90 శాతం వాటా ఉన్న ఖార్గ్ ఐలాండ్‌ను ట్రంప్ ఇప్పటికే “క్రౌన్ జ్యువెల్”గా అభివర్ణించారు. ఈ నెల ప్రారంభంలో ఇక్కడ అమెరికా వైమానిక దాడులు కూడా జరిగాయి. అలాగే, గల్ఫ్ చమురు, గ్యాస్ ఎగుమతులకు కీలకమైన హర్ముజ్​ జలసంధిని వెంటనే తెరిపించాలని ట్రంప్ ఇరాన్‌ను పదేపదే హెచ్చరిస్తున్నారు.

20 ఏళ్లలో లేనంత భారీ సైనిక మోహరింపు..

గత రెండు దశాబ్దాలలో పశ్చిమాసియాలో ఎన్నడూ లేని విధంగా అమెరికా తన సైన్యాన్ని భారీగా పెంచింది. శనివారం నాటికి 3,500 మంది మెరైన్లు, సైనికులు యూఎస్​ఎస్​ త్రిపోలి యుద్ధనౌకపై ఈ ప్రాంతానికి చేరుకున్నారు. జపాన్ కేంద్రంగా పనిచేసే ఈ నౌకలో ట్రాన్స్‌పోర్ట్, స్ట్రైక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అంఫీబియస్ అసాల్ట్ ఆస్తులు ఉన్నాయి. ఇందులో సీహాక్ హెలికాప్టర్లు, ఆస్ప్రీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎఫ్​​-35 ఫైటర్ జెట్‌లు ఉన్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

పాకిస్థాన్​ మీడియేషన్​ ఫలిస్తుందా?

మరోవైపు, అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఇస్లామాబాద్‌లో కీలకమైన చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. మధ్యప్రాచ్యం అంతటా ఉద్రిక్తతలు, పరస్పర అపనమ్మకం గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ, శాంతి స్థాపనే ధ్యేయంగా ఈ 'మధ్యవర్తిత్వ చర్చలు' జరగనున్నాయి.

సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ దేశాలకు చెందిన అగ్రశ్రేణి దౌత్యవేత్తలు ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఆదివారం ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో యుద్ధాన్ని ముగించడం, ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు పాకిస్థాన్ తెలిపింది.

పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ప్రస్తుత పరిస్థితులపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్‌తో తాను ఇప్పటికే "సుదీర్ఘ చర్చలు" జరిపినట్లు వెల్లడించారు.

చర్చల్లో ఎవరు పాల్గొంటున్నారు?

ఈ చర్చల్లో ప్రాంతీయ దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలు పాల్గొననున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. హాజరయ్యే ముఖ్యులు వీరే:

సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు.

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ చర్చలకు నాయకత్వం వహిస్తారు.

ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలతో పాటు వివిధ అంశాలపై ఆది, సోమవారాల్లో చర్చలు జరుగుతాయి.

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న 'బ్యాక్‌ఛానల్ దౌత్యం'లో (రహస్య చర్చలు) పాల్గొంటున్న ప్రతినిధులు కూడా ఇందులో భాగం కానున్నారు.

అయితే, టెహ్రాన్ (ఇరాన్) తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

అమెరికా తరపున ఈ చర్చలకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పలు నివేదికల ప్రకారం.. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ లేదా జారెడ్ కుష్నర్ నేతృత్వంలో జరిగే చర్చలు సఫలం కాకపోవచ్చని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. యుద్ధం ప్రారంభానికి ముందు జరిగిన చర్చలు విఫలం కావడంతో, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర అపనమ్మకం నెలకొనడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More