Personal loan scams : ఇవి తెలియకుండా పర్సనల్ లోన్ తీసుకుంటుంటే.. 'స్కామ్'కు గురైనట్టే!
పర్సనల్ లోన్స్ విషయంలో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? లోన్ స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వ్యక్తిగత అవసరాల కోసం మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి విషయంలో స్కామ్స్, ఫ్రాడ్స్ జరుగుతున్న నేపథ్యంలో.. పర్సనల్ లోన్ చుట్టూ ఉన్న కొన్ని విషయాలను మీరు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విషయాలు మీకు తెలిస్తే, మీరు స్కామ్‌కి గురయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. మోసగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే, అమాయక బాధితులను వారు ఏ విధంగా బురిడీ కొట్టిస్తారో, ఏ రకమైన మోసాలకు పాల్పడతారో మీరు తప్పకుండా తెలుసుకోవాలి.

పర్సనల్ లోన్ స్కామ్స్- ఇలా ఉంటాయి..!
I. అర్హత లేని రుణం ఇస్తానని హామీ:
మీకు అర్హత లేకపోయినా పర్సనల్ లోన్స్ ఇస్తామని లేదా సాధారణంగా ఇచ్చే దానికంటే ఎక్కువ మొత్తంలో లోన్ ఇస్తామని కొన్నిసార్లు మోసగాళ్లు అబద్ధపు హామీలు ఇస్తారు. ఇలాంటి వాగ్దానాలు నమ్మకూడదు.
II. ఫిజికల్ డాక్యుమెంటేషన్ ద్వారా అప్రూవల్:
మోసగాళ్లలో మరొక సాధారణ పద్ధతి ఏంటంటే ఆన్‌లైన్‌కు బదులుగా ఫిజికల్ డాక్యుమెంట్‌లు (పేపర్ ఫైల్స్) ద్వారా లోన్ అప్లికేషన్ అప్రూవల్ పత్రాలను పంపడం.
తాము నిజమైన బ్యాంక్ ఉద్యోగితో టచ్‌లో ఉన్నామని నమ్మించడానికి, మోసగాళ్లు.. అమాయక బాధితులకు నకిలీ పత్రాలు లేదా మెసేజ్‌లు చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాధారణంగా, బ్యాంకులు, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లు రుణాల ఆమోద ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తాయి! కాబట్టి, బ్యాంక్ బ్రాంచ్‌లో ఉద్యోగి సహాయంతో జరిగే ప్రక్రియ కాకుండా, ఎవరైనా మీకు ఫిజికల్ డాక్యుమెంట్ల ద్వారా లోన్ అప్రూవల్ ఇస్తానని వాగ్దానం చేస్తే, అది ప్రమాద ఘంటికగా భావించాలి.
III. టెక్స్ట్/వాట్సాప్ ద్వారా నకిలీ మెసేజ్‌లు:
కొంతమంది మోసగాళ్లు బ్యాంక్ మెసేజ్‌లను పోలిన నకిలీ లోన్ అప్రూవల్ మెసేజ్‌లను టెక్స్ట్ లేదా వాట్సాప్ ద్వారా పంపి, బాధితుల నుంచి డబ్బు కొల్లగొడుతున్నారు. పర్సనల్ లోన్ స్కామ్స్ విషయంలో ఇది సర్వసాధారణంగా మారింది.
పర్సనల్ లోన్ స్కామ్స్ నుంచి సురక్షితంగా ఉండేందుకు టిప్స్..
ఇటువంటి లోన్ మోసాల నుంచి మీరు సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్ ఇక్కడ ఉన్నాయి:
I. ఏజెంట్లకు దూరంగా ఉండండి:
మీరు లోన్ కోసం చూస్తున్నట్లయితే, నేరుగా బ్యాంకును లేదా వారి అధికారిక ప్రతినిధిని సంప్రదించడం ఉత్తమం. అనధికార ఏజెంట్ ద్వారా లేదా తాను ఏజెంట్‌నని చెప్పుకునే వ్యక్తి ద్వారా బ్యాంకును ఆశ్రయించడం ప్రమాదకరమైన చర్య.
II. బ్యాంక్ అధికారిక కమ్యూనికేషన్‌ను గమనించండి:
మీరు మోసగాడి చేతిలో మోసపోకుండా ఉండాలంటే, రుణ ఆమోదం నేరుగా బ్యాంక్ నుంచే వచ్చిందని నిర్ధారించుకోండి. బ్యాంక్ కమ్యూనికేషన్ ఎప్పుడూ అధికారిక ఇమెయిల్ ఐడీ నుంచే జరుగుతుంది అలాగే, బ్యాంక్ అధికారిక నంబర్ నుంచి పంపే టెక్స్ట్ మెసేజ్‌లు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. పంపినవారి ఫోన్ నంబర్‌ను చూసి అది నిజమైన మెసేజా కాదా అని సులభంగా గుర్తించవచ్చు.
III. రుణం కోసం డబ్బు అడిగితే నిరాకరించండి:
రుణం ఇప్పిస్తామని, కానీ ప్రతిఫలంగా డబ్బు (అంటే లంచం) కావాలని అడిగితే, ఆ ఆఫర్‌ను వెంటనే తిరస్కరించండి. అలా చేయడం వల్ల మీకు లోన్ రాకపోవడం మాత్రమే కాదు, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ చిట్కాలను పాటిస్తే పర్సనల్ లోన్ తీసుకునే క్రమంలో మీరు మోసాల బారిన పడకుండా ఉండవచ్చు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పర్సనల్ లోన్ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












